Dandruff : చుండ్రు సమస్య నివారణకు గృహ చిట్కాలు
మన శరీరానికి కావలసినంత పౌష్ఠికాహారం తీసుకోపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు వచ్చేస్తుంది.

Dandruff
Dandruff : చుండ్రు వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో ఒకటి. ఎక్కువ ఒత్తిడికి లోనైనా తలలో చుండ్రు వస్తుంది. ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరు చిన్న విషయానికే వత్తిడికి గురికావడం జరుగుతోంది. ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, కూలర్ కింద కూర్చున్నా , తల మీది చర్మం పొడి బారిపోయి పొట్టులా లేస్తుంది. షాంపూ లతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా… చుండ్రు వచ్చే అవకాశం వుంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది. ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది. సముద్ర తీరప్రాంతాల్లో నివసించినా పర్వత ప్రాంతాల్లోనివసించినా దీని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రు రావడానికి కారణమవుతాయి. మన శరీరానికి కావలసినంత పౌష్ఠికాహారం తీసుకోపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు వచ్చేస్తుంది. కొన్ని గృహ చిట్కాలతో సులభంగా చుండ్రును తొలగించుకోవచ్చు. అవేంటో చూద్దాం…
చుండ్రు నివారణకు ఇంటి చిట్కాలు ;
1. చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చెయాలి.
2. తలస్నానం చేయడానికి అరగంట ముందుగానే… పుల్లగా వుండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.
3. ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.
4. ఎక్కువ ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు తినాలి. కాయగూరలు, చేపలను సమతూలంగా ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకపోవడం మంచిది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని భుజించాలి.
5. తలను ఎప్పుడు కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరుచుగా తలకు షాంపూ పెట్టి, సరైనా కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్ధగా శుభ్రపరచాలి. మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ను వాడితే చర్మం పొడిగా ఉండకుండా చూసుకోవచ్చు.
6. రెండు యాపిల్ పండ్లను తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జును వెంట్రుకలకు పట్టించాలి. ఇలా పట్టించిన ఈ యాపిల్ గుజ్జును 45 నిమిషాల వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది.
7. ఐదు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు బాగా పట్టించాలి. ఇవిధంగా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలపాటు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
8. వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి. చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాయాలి. వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ చేకూరుతుంది.
9. చుండ్రును అరికట్టేందుకు ఫ్రూట్ థెరపీ లేదా వెజిటెబుల్ థెరపీని ఉపయోగిస్తే సమస్యను అధిగమించవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.