Stay Healthy : ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తినే ఆహారంలో!
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి.

Food
Stay Healthy : తినేఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి ఆరోగ్యం మీ సొంతమౌతుంది. చాలా మందిలో ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయితే తీసుకునే ఆహారంపైన ఏమాత్రం దృష్టిసారించరు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం అన్నది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్ధాలతోనే పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. రోజు వారిగా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చిరు ధాన్యాలు ; పురాతన కాలం నుండి మనపెద్దలు రాగి, జొన్న, సజ్జ లతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకునే వారు. అందుకే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలిగారు. చిరుధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఈ ఫైబర్ తోడ్పడుతుంది. పేగు కేన్సర్ రాకుండా చూడటంతోపాటు, బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇదో చక్కనా ఆహారంగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పప్పు దినుసులు ; మనం తరచూ తినే పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీస్లు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి. శరీరంలో కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడంలో సహకరిస్తాయి. పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి.
పెరుగు ; పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవటంతోపాటు, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి పెరుగు రక్షిస్తుంది.
మసాలా దినుసులు ; కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు వంటి మసాల దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఇంటి పోపు పెట్టెలో ఈ మసాలలు విరివిగా లభిస్తాయి. రోజు వారి వంటకాల్లో వీటిని ఉపయోగించటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక శక్తి పెరగటంతోపాటు, జీర్ణ ప్రక్రియ మెరుగయ్యేందుకు సహాయపడతాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.