Raksha Bandhan 2024: బలవంతంగా రాఖీ కట్టొద్దు.. కట్టించుకోవద్దు..

అసలు బలవంతంగా రాఖీ కట్టొచ్చా, కట్టించుకోవచ్చా? చదవండి.

Raksha Bandhan 2024: బలవంతంగా రాఖీ కట్టొద్దు.. కట్టించుకోవద్దు..

Raksha Bandhan

Updated On : August 17, 2024 / 6:17 PM IST

రాఖీ , రక్షా బంధన్, శ్రావణ పౌర్ణమి, జంద్యాల పూర్ణిమ ఇలా రాఖీ పండుగను పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. అయితే కొందరు అబ్బాయిల్లో రాఖీ పండుగ వస్తోందనగానే తెలియని టెన్షన్ మొదలవుతుంది. అమ్మాయిలు ఎక్కడ రాఖీ కట్టేస్తారనే భయంతో స్కూల్, కాలేజ్ డుమ్మా కొట్టేసేవారు ఉంటారు. నిజానికి బలవంతంగా రాఖీ కట్టొద్దు. కట్టించుకోవద్దు. అందుకోసం వారికంట పడకుండా ఉండొద్దు. మరేం చేయాలి?

అన్నచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ అనుబంధాన్ని చాటుకుంటూ రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. పెళ్లిళ్లై ఎక్కడెక్కడో సెటిల్ అయిన వారు సైతం ఒకరింటికి ఒకరు వెళ్లి రాఖీలు కడతారు. బహుమతులు ఇస్తారు. మణికట్టుపై పవిత్రమైన రాఖీ కడుతున్నప్పుడు సోదరుడు తన సోదరిని ఎల్లవేళలా కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తాడు.

నిజానికి తోడబుట్టిన వారికి మాత్రమే ఎక్కువగా అమ్మాయిలు రాఖీలు కడతారు. కొంతమంది అమ్మాయిలు తమకు ఇబ్బంది కలిగిస్తున్న అబ్బాయిలకు రాఖీ కట్టాలని అనుకుంటారు. ఎప్పుడెప్పుడు రాఖీ వస్తుందా? అని ఎదురుచూస్తారు. ఇక వారెక్కడ తమకు రాఖీ కట్టేస్తారో అని అబ్బాయిలు ఆ రోజు వారికి కనిపించకుండా తిరుగుతారు. రక్షాబంధన్ రోజు సెలవు దినం పాటించని స్కూళ్లు, కాలేజీల్లో కొందరు అబ్బాయిలు ఈ భయంతో డుమ్మా కొట్టేస్తారు కూడా. ప్రతి సంవత్సరం వారికి ఈ ఇబ్బంది తప్పదు.

ఎవరైనా అమ్మాయి రాఖీ కట్టడానికి వస్తే కొందరు అబ్బాయిలు నో అని చెప్పలేరు. మనసులో స్నేహితురాలిగా భావిస్తూ బలవంతంగా రాఖీ కట్టించుకోవాల్సిన పరిస్థితి. రాఖీ కట్టించుకున్నా తన మనసులో అలాంటి భావం లేదనే అపరాధ భావంతో వారు కుమిలిపోతారు. రాఖీ కట్టే అమ్మాయి కూడా తనకు ఇబ్బంది కలిగించే అబ్బాయిలకు రాఖీ కట్టేస్తే చెక్ పెట్టినట్లుగా భావించకూడదు. మీ పట్ల సోదర భావంతో లేని అబ్బాయిలకు బలవంతంగా రాఖీ కట్టకండి.

పవిత్రమైన రాఖీతో ముడి పెట్టకండి. అలాగే అబ్బాయిలు రాఖీ కట్టేస్తారనే భయంతో తప్పించుకుని తిరక్కండి. ఆ రోజు ఎక్కడికి పారిపోకండి.. సున్నితంగా తిరస్కరించండి. ఇలా చేయమని మానసిక వైద్యులు చెబుతున్నారు.  అలా చెప్పడం వల్ల మీ మధ్య ఉన్న బంధానికి ఒక క్లారిటీ ఇచ్చినవారౌతారని వారు సూచిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇక ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 19న జరుపుకుంటున్నారు.

Also Read : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?