Mollywood Times Review : ‘మాలీవుడ్ టైమ్స్’ మూవీ రివ్యూ.. ప్రేమలు హీరో నటించిన కొత్త సినిమా.. ‘నేనింతే’ మళయాళం వర్షన్..
Mollywood Times Review in Telugu: ఈ మాలీవుడ్ టైమ్స్ చూస్తున్నంతసేపు పూర్తిగా కాకపోయినా మన రవితేజ నేనింతే సినిమా, ఆర్జీవీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలు గుర్తొస్తాయి.
Mollywood Times Movie Review in Telugu
Mollywood Times Review in Telugu : ప్రేమలు హీరో నస్లేన్ నటించిన కొత్త మళయాళం సినిమా ‘మాలీవుడ్ టైమ్స్’. ఆషిక్ ఉస్మాన్ నిర్మాణంలో అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మళయాళం సినిమా జూన్ లో అక్కడ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తాజాగా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
కథ విషయానికొస్తే..
వినీత్ మాధవన్(నస్లేన్) చిన్నప్పట్నుంచి హారర్ పుస్తకాలు చదువుతూ హారర్ సినిమాల దర్శకుడు కావాలని కలలు కంటాడు. స్కూల్ ఏజ్ లో అనేక ప్రయత్నాలు చేసి హారర్ షార్ట్ ఫిలిం తీసి ఇంట్లో వాళ్లకు చూపించడంతో నమ్మి సినిమాల్లోకి ఎంకరేజ్ చేస్తారు. అదే సమయంలో స్టార్ నవల రచయిత వైకం డేవిడ్ తనయుడు సచిన్ చిన్నప్పటి నుంచే తండ్రి లాగే పెద్ద రచయిత అవ్వాలనుకుంటాడు కానీ అతను రాసిన కథలు ఎవ్వరికి నచ్చవు. దీంతో వైకం డేవిడ్ నేను ఏ కథలు రాయలేదు వేరే వాళ్ళు రాసినవి కొనుక్కొని పేరు తెచ్చుకున్నాను, నువ్వు కూడా అదే చెయ్యి అని కొడుక్కు చెప్తాడు. అయితే వైకం డేవిడ్ కి కథలు ఇచ్చే రచయితల్లో ఒకరు ఓ కొత్త నవల రాసి వైకం అన్ని కాపీ కథలే అని ఆ బుక్ రిలీజ్ చేస్తాడు. ఇది తెలిసి రిలీజయిన బుక్స్ అన్ని వెనక్కి తెప్పిస్తాడు వైకం. కానీ ఒక బుక్ మాత్రం ఎక్కడ ఉందో తెలియదు.
పెద్దయ్యాక సినిమా ఛాన్స్ వస్తుందని తెలిసి వినీత్ మాధవన్ ఓ షార్ట్ ఫిలిం కాంపిటేషన్ లో పాల్గొంటాడు. అతని సినిమాని అందరూ మెచ్చుకున్నా ఫస్ట్ ప్రైజ్, సినిమా ఛాన్స్ మాత్రం అర్జున్ హరిదాస్(సంగీత్ ప్రతాప్)కి ఇస్తారు. వినీత్ కి సచిన్ సినిమా రచయితగా ఆఫర్ చేస్తాడు కానీ ఆ సినిమా మధ్యలోంచి బయటకు వచ్చి ఫైజల్ అనే నిర్మాత దగ్గర హీరో స్వరూప్ (బేసిల్ జోసఫ్)తో ఒక సినిమా తీస్తాడు. కానీ ఆ సినిమా రిలీజ్ సమయానికి అదే కథతో ఇంకో సినిమా యాదృచ్చికంగా రావడం, స్వరూప్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతతో గొడవ జరిగి సినిమా అంతా డిలీట్ చేసేస్తాడు వినీత్ మాధవన్. అదే సమయంలో తన షార్ట్ ఫిలిం కథ, స్టైల్ దొంగలించి అర్జున్ హరిదాస్ సినిమా తీసి హిట్ కొడతాడు. వీటన్నిటితో అందరూ వినీత్ మాధవన్ పై కక్ష కట్టి సినిమా పరిశ్రమలో ఉండనివ్వకుండా చేయాలి, అసలు దర్శకుడు అవ్వకుండా చేయాలి అని ట్రై చేస్తారు. మరి వీళ్ళందర్నీ ఎదుర్కొని వినీత్ మాధవన్ దర్శకుడు అవుతాడా? తను సినిమా చేసే ప్రయత్నంలో ఎదుర్కున్న సవాళ్లు ఏంటి? తన సినిమాకు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అసలు ఏ కథతో సినిమా తీస్తాడు? హారర్ దర్శకుడు అవ్వాలన్న తన కల నెరవేరుతుందా? వైకం డేవిడ్ వెతికే బుక్ ఎక్కడ ఉంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Panjaa : పవర్ స్టార్ స్టైలిష్ సినిమా.. ‘పంజా’ రీ రిలీజ్.. ఎప్పుడంటే..?
సినిమా విశ్లేషణ..
మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు తీస్తారు అనే పాజిటివ్ ఒపీనియన్ ఉన్న సంగతి తెలిసిందే. పైగా ప్రేమలు హీరో నస్లేన్ లోక, మరో రెండు మూడు సినిమాలతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మాలీవుడ్ టైమ్స్ చూస్తున్నంతసేపు పూర్తిగా కాకపోయినా మన రవితేజ నేనింతే సినిమా, ఆర్జీవీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలు గుర్తొస్తాయి. నేనింతే సినిమాలో విలన్ బయట ఉంటే ఇందులో సినిమా వాళ్ళే విలన్స్.
చిన్నప్పుడే వినీత్ మాధవన్, సచిన్ డేవిడ్, వినీత్ ఫ్రెండ్స్ పాత్రలను బాగా ఎస్టాబ్లిష్ చేసాడు. దాదాపు 20 నిమిషాలకు పైగా చైల్డ్ ఎపిసోడ్, వైకం డేవిడ్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. వినీత్ కాస్త పెద్దయ్యాక హారర్ షార్ట్ ఫిలిం తీసి ఇంట్లో వాళ్లకు, తనకు సపోర్ట్ చేసే డివిడి షాప్ అన్నకు చూపించే ప్రయత్నాలు బాగుంటాయి. షార్ట్ ఫిలిం కాంపిటేషన్ కి వెళ్లి సెకండ్ ప్రైజ్ వచ్చిన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఒకరు సక్సెస్ అవడం కోసం ఇంకొకరిని ఏం చేస్తారు? ఒకరు కథలను ఇంకొకరు ఎలా దొంగిలిస్తారు? ఫ్లాప్ సినిమాలను కావాలని ఎందుకు తీస్తారు.. ఇలా ఇండస్ట్రీలో జరిగే చాలా నిజాలని ఈ సినిమాలో చూపించారు.
కాస్త స్లో నేరేషన్ లో సాగినా ఇవన్నీ చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. అయితే ప్రతి సినిమాలో హీరో సక్సెస్ అవుతాడు. కానీ ఫెయిల్యూర్ ని కూడా చూపించే సినిమాలు ఇటీవలే వస్తున్నాయి. జెర్సీ, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాల్లాగే వరుసగా ఫెయిల్ అవుతున్నా ఏదో ఒక నమ్మకంతో ప్రయత్నాలు చేసి గెలిచినా చివరకు సంతృప్తి ఉండదు, గెలిచారు అని గొప్పగా చూడరు అనే విధంగానే సినిమా ముగింపు ఉంటుంది. ఈ సినిమాకు పార్ట్ 2 చేసుకునే అవకాశం ఉంది మరి తీస్తారో లేదో తెలియదు.
హారర్ సినిమా దర్శకుడు అవుదామనుకున్నాడు కాబట్టి సినిమాలో కూడా అక్కడక్కడా హారర్ ఎలిమెంట్స్ పెట్టారు. ఓ రెండు మూడు సీన్స్ లో నవ్విస్తారు. నిర్మాతలు ఎందుకు ఫ్లాప్ సినిమాలు చేస్తారు, హీరో ఫ్రెండ్ మోసం చేయడం, హీరో మేకింగ్ స్టైల్ దొంగిలించడం.. ఇలాంటి సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుస్తాడు అనుకొనేలోపు ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడం, గెలిచినా ఏదో ఒక సమస్య రావడంతో పాపం అనిపిస్తుంది. చాలావరకు సినిమా పరిశ్రమలో జరిగే రియాల్టీని చూపించారు. ఈ సినిమా చూసి సినీ పరిశ్రమ వాళ్ళు ఆశ్చర్యపోక తప్పదు. దర్శకుడు, రచయిత తమకు ఎదురైన, చూసిన సంఘటనలను సినిమాలో రాసుకొని ఉండొచ్చు. నేనింతే సినిమా బాగున్నా అది కమర్షియల్ గా ఆడలేదు. ఈ మాలీవుడ్ టైమ్స్ కూడా అంతే. సినిమా బాగుంది అని అభినందనలు వచ్చినా కమర్షియల్ గా యావరేజ్ గానే నిలిచింది. సినిమాలు అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వొద్దు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
దర్శకుడు అవ్వాలి అని ఓడిపోతున్నా ప్రయత్నాలు చేసే హీరో పాత్రలో నస్లేన్ అదరగొట్టాడు. కొన్ని సీన్స్ లో పాపం అని ఆ పాత్రని చూస్తే అనిపిస్తుంది. అంత బాగా ఈ పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రేమలు సినిమాలో ఫుల్ గా నవ్వించిన సంగీత్ ప్రతాప్ ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా మెప్పిస్తాడు. మళయాళం స్టార్ హీరో, దర్శకుడు బసిల్ జోసెఫ్ గెస్ట్ పాత్రలో మెప్పిస్తాడు. షరాఫ్ ఉద్దీన్ సచిన్ డేవిడ్ పాత్రలో బాగానే నటించాడు.
సినిమా హీరోయిన్ పాత్రలో గోపిక రమేష్ బాగానే మెప్పిస్తుంది. అప్పుని శశి నెగిటివ్ షేడ్స్ లో నిర్మాతగా బాగా నటించారు. రోషన్ హీరో ఫ్రెండ్ పాత్రలో నవ్విస్తూనే చివర్లో మోసం చేసే పాత్రలో చాలా బాగా నటించి మెప్పించాడు. వినీత్ శ్రీనివాసన్, జగదీశ్, ప్రశాంత్ అలెగ్జాండర్, బాలచంద్రన్, ఆర్ష చాందిని బైజు.. మిగిలిన మలయాళ నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.
Also See : Lenin Pre Release Event : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి.. ఫొటోలు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు యావరేజ్. ఈ సినిమా కలర్ ప్యాలెట్ కొత్తగా సినిమా కథకు తగ్గట్టు చాలా బాగుంది. దర్శకుడు అవ్వాలి అని కలలు కన్న ఓ వ్యక్తికి సినీ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లపై చాలా బాగా రాసాడు రచయిత. దాన్ని సాంకేతికంగా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు. VFX షాట్స్ బాగున్నాయి. చైల్డ్ ఎపిసోడ్స్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ అప్పటి కెమెరాలు, డీవీడీలు సెటప్ కోసం బాగానే కష్టపడింది.
మొత్తంగా ‘మాలీవుడ్ టైమ్స్’ దర్శకుడు అవ్వాలనుకునే ఓ యువకుడికి సినీ పరిశ్రమలో ఉండే రియాల్టీ ఏంటి, అక్కడ ఎదురయ్యే సమస్యలను తట్టుకొని ఎలా నిలబడ్డాడు అనే కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించారు.
గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
