Pritam and Pedro : ‘ప్రీతమ్ అండ్ పెద్రో’ వెబ్ సిరీస్ రివ్యూ.. బాలీవుడ్ క్రైమ్ కామెడీ.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కొడుకు..
బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తన కొడుకు వీర్ హిరానీ ని హీరోగా పరిచయం చేస్తూ తన సొంత నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కించారు. (Pritam and Pedro)
Pritam and Pedro Review
Pritam and Pedro Review : వీర్ హిరానీ, అర్షద్ వర్శి, విక్రాంత్ మెస్సి, బొమన్ ఇరానీ, సత్యదేవ్ మిశ్ర.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రీతమ్ అండ్ పెద్రో. బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తన కొడుకు వీర్ హిరానీ ని హీరోగా పరిచయం చేస్తూ తన సొంత నిర్మాణంలో అవినాష్ అరుణ్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కించారు. ప్రీతమ్ అండ్ పెద్రో వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
కథ విషయానికొస్తే..
పెద్రో గన్సాల్వేస్(అర్షద్ వార్సీ) గోవాలో క్రిమినల్ బ్రాంచ్ పోలీస్. ప్రీతమ్ పార్కర్(వీర్ హిరానీ) ఓ సేల్స్ మెన్. తన తాతయ్య టేప్ రికార్డర్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ ఓ ATM దొంగతనం జరిగింది అనే హడావిడిలో ప్రీతమ్ ని పట్టించుకోకుండా సెల్లో వేస్తారు. ఆ ATM ఎవరు దొంగతనం చేసారో తాను కనిపెడతాను అని తన సైబర్ హ్యాకింగ్ ఉపయోగించి కనిపెడతాడు. దీంతో పోలీసాఫీసర్ పెద్రో.. ప్రీతమ్ ని మెచ్చుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. స్పోర్ట్స్ మినిస్టర్(సత్యదేవ్ మిశ్ర) భార్య ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇవ్వడంతో పెద్రో వాళ్ళింటికి వెళ్లి విచారణ చేసి అది వాళ్ళ అబ్బాయే దొంగతనం చేసాడని చెప్తే స్పోర్ట్స్ మినిస్టర్(సత్యదేవ్ మిశ్ర) తిడతాడు. దాంతో ఫేక్ దొంగ, ఫేక్ ఫోన్ తీసుకొస్తే నిజాయితీగా లేవు, ఫోన్ మా అబ్బాయి దగ్గరే ఉందని పెద్రోని క్రైమ్ బ్రాంచ్ నుంచి సైబర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు మినిస్టర్.
అసలు పెద్రోకి కంప్యూటర్ గురించి ఏమి తెలియదు. దాంతో సైబర్ బ్రాంచ్ లో కష్టాలు పడుతుంటే ఒక రెండు కేసులు సాల్వ్ చేస్తే మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ కి పంపిస్తాను అని పై అధికారి పెద్రోకి చెప్తాడు. దీంతో ప్రీతమ్ సహాయం తీసుకొని పెద్రో ఓ మర్డర్, సూసైడ్ జరగకుండా ఆపుతాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ అవుతాడు. కిడ్నాపర్ ఓ హ్యాకర్(విక్రాంత్ మస్సె) తో ఈ పని చేయిస్తాడు. ఈ కేసు పెద్రోకి రావడంతో ప్రీతమ్ సహాయం తీసుకుంటాడు. ప్రీతమ్ ని చూసిన ఆ హ్యాకర్ కి గతం గుర్తొచ్చి ప్రీతమ్ ని టార్గెట్ చేస్తాడు. అసలు ప్రీతమ్ గతం ఏంటి? ప్రీతమ్ – హ్యాకర్ మధ్య సంబంధం ఏంటి? మినిస్టర్ కొడుకుని కనిపెట్టారా? అసలు కిడ్నాప్ ఎవరు చేయిస్తారు? పెద్రోని మళ్ళీ క్రైమ్ బ్రాంచ్ కి పంపిస్తారా? ప్రీతమ్ తాతయ్య టేప్ రికార్డర్ దొరుకుతుందా.. ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
Also Read : Nagavamsi : చరణ్ ఫ్యాన్స్ కి భయపడి మంచి సినిమాకు లాభాలు పోగొట్టుకున్న నిర్మాత..?
సిరీస్ విశ్లేషణ..
ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా తెరకెక్కించారు. క్రైమ్ సస్పెన్స్ కామెడీగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఆసక్తిగా అక్కడక్కడా కామెడీగా సాగుతుంది ఈ సిరీస్. ప్రీతమ్ అనే సైబర్ ఎక్స్పర్ట్, పెద్రో అనే ఓ పోలీస్ ఆఫీసర్ కలిసి కేసు ఎలా డీల్ చేసారు, ఈ మధ్యలో వీరు ఎదుర్కున్న సంఘటనలు ఏంటి అని ఈ సిరీస్ సాగుతుంది.
ఫస్ట్ ఎపిసోడ్ లో ATM దొంగలను కనిపెట్టే సీన్ ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. మినిస్టర్ తప్పు ఉండి పెద్రో బ్రాంచ్ మార్చడం సిల్లీగా అనిపిస్తుంది. సైబర్ బ్రాంచ్ లో పెద్రో పడే కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. ఫస్ట్ కేసు సింపుల్ గా సస్పెన్స్ గా బాగా డీల్ చేసారు. ఇక మినిస్టర్ కొడుకు కిడ్నాప్ మాత్రం కాస్త సాగదీశారు. ఈ కేసులో ట్విస్టులు, ఆ కేసు ఇంకో వైపుకు తిరగడం, హ్యాకర్ పర్సనల్ రివెంజ్, ప్రీతమ్ ఫ్లాష్ బ్యాక్.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగుతాయి.
పెద్రో కొడుకు ఎమోషన్ కూడా మెప్పిస్తుంది. చాన్నాళ్ల తర్వాత ఒకప్పుడు అందర్నీ భయపెట్టిన బ్లూ వేల్ ప్రమాదకరమైన ఆటని ఇందులో చూపించారు. ఆ సీన్స్ పాత సినిమాల్లో చూపించినట్టు రొటీన్ సింపుల్ గానే అనిపిస్తాయి. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం ఉత్కంఠగా సాగుతుంది. చివరికి పెద్రోని చూస్తే పాపం అనిపిస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయినా దీనికి సీజన్ 2 లీడ్ కూడా ఇచ్చారు. అక్కడక్కడా కిడ్నాప్ కేసులో కొంత సాగదీత తప్పితే ఈ సిరీస్ ని హ్యాపీగా చూసేయొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తనయుడే వీర్ హిరానీ. ఈ వెబ్ సిరీస్ తోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు వీర్. మొదటి సిరీస్ లోనే బాగానే మెప్పించాడు. వీర్ హిరానీ భవిష్యత్తులో మంచి నటుడు అయ్యే అవకాశం ఉంది. అర్షద్ వార్సీ నవ్విస్తూనే సిన్సియర్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు.
బాలీవుడ్ స్టార్ హీరో విక్రాంత్ మస్సె నెగిటివ్ షేడ్స్ లో కనిపించి మెప్పిస్తాడు. స్పోర్ట్స్ మినిస్టర్ పాత్రలో సత్యదీప్ మిశ్ర, ఆయన భార్య పాత్రలో శృతి మరాఠీ మెప్పించారు. మోనా సింగ్, రాజేష్ శర్మ, నైనా సరేన్.. మిగిలిన బాలీవుడ్ నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ.. గెస్ట్ పాత్రల్లో కనిపించి మెప్పించారు.
Also See : Naga Shaurya : భార్యతో కలిసి జపాన్ వెకేషన్లో హీరో నాగశౌర్య.. ఫొటోలు..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కథ పరంగా గోవా అని చూపించినా చాలా వరకు వేరే లొకేషన్స్ లోనే ఈ సిరీస్ ని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. తెలుగు డబ్బింగ్ అక్కడక్కడా సెట్ అవ్వలేదు. ఓ పోలీస్, ఓ సైబర్ ఎక్స్పర్ట్ కలిసి కేసుల్ని ఎలా డీల్ చేసారు అని సస్పెన్స్ కామెడీగా ఈ సిరీస్ ని బాగానే రాసుకొని తెరకెక్కించారు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘ప్రీతమ్ & పెద్రో’ సస్పెన్స్ కామెడీతో సాగిన ఆసక్తికర వెబ్ సిరీస్. ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు.
గమనిక : ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
