Sing Geetham Review: ‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ.. 94 ఏళ్ళ వయసులో సింగీతం శ్రీనివాసరావు చేసిన సినిమా ఎలా ఉందంటే..
ఈ సినిమాకు అసలు హీరో దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి. (Sing Geetham Review)
Sing Geetham Review
Sing Geetham Review: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో డైరెక్ట్ చేసిన సినిమా ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మించారు. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి.. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ లో నటించారు. ‘సింగ్ గీతం’ సినిమా నేడు జూన్ 12న థియేటర్స్ లో రిలీజవ్వగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
ప్రతాప్(అయాన్) అనాధ. జైలు నుంచి బయటికి రాగానే ఓ లాయర్ వచ్చి తన తండ్రి కొన్ని ఆస్తి పేపర్స్ ఇచ్చారని ఇవ్వడంతో ఆ ఆస్తి పేపర్లు పట్టుకుని కుబేరపురం అనే ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే తన తండ్రి ఓ ప్రైవేట్ గోల్డ్ మైన్ కి ఓనర్ అని తెలుస్తుంది. అక్కడ ఇంకో ఓనర్ కూతురు రేణు(షాలిని కొండేపూడి) ఇతని వాటా కూడా కొట్టేసి గోల్డ్ మైన్స్ ఓ ఫారిన్ వ్యక్తికి అమ్మేయాలని చూస్తుంది. ఆ ఊర్లో ఆల్మోస్ట్ అందరూ మైన్స్ లోనే పనిచేస్తారు. కేవలం డబ్బుల కోసమే వెళ్ళిన ప్రతాప్ అక్కడ గోల్డ్ బయటికి తీసి అమ్మి తను కూడా వాటా తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో ఆ ఊర్లో మిగిలి ఉన్న ఒకే ఒక్క చెట్టును కూడా కొట్టేయాలనుకుంటే దాన్ని కాపాడుతున్న గౌరీ(అహల్య బమ్రూ) అడ్డుపడుతుంది.
కానీ ఆ చెట్టుని కొట్టేయడంతో ఆమె కుబేరుడి గుహలోకి అనుకోకుండా పడటంతో ఆ ఊరి వాళ్ళ మీద శాపాలు పెడుతూ తిడుతుంది. ఆ తెల్లారి నుంచి ఊర్లో ఎవరు మాట్లాడినా పాటలాగానే వస్తుంది. దీంతో అందరూ తమకు ఏమైంది, ఏం రోగం వచ్చింది, లేకపోతే ఏదైనా శాపం వచ్చిందని కంగారు పడుతూ ఉంటారు. మరి ఆ ఊరి జనాలు అందరూ ఈ పాట రోగం ఎలా పోగొట్టుకుంటారు? ఒక్క చెట్టు కూడా లేని ఆ ఊరిలో ఒక్క చెట్టు అయినా మొలుస్తుందా? అసలు ఊరి కథ ఏంటి? ప్రతాప్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ గోల్డ్ మైన్స్ కథేంటి? మధ్యలో ప్రతాప్ – గౌరి ప్రేమకథ ఏంటి? ఆ బంగారం కొట్టేయడానికి రేణు, ఆమె తండ్రి ఏం చేస్తారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Pawan Kalyan : OG 2 అప్డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్.. విదేశాల నుంచి రాగానే..
సినిమా విశ్లేషణ..
లెజెండరీ దర్శకుడు, ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ళ వయసులో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అని ప్రకటించడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. అలాగే ఇందులో మాటలు అన్ని పాటలుగా పాడతారు, మాట్లాడుకోవడం తక్కువ అంతా పాడుకోవడమే, మొదటిసారి ప్రయోగం చేస్తున్నాము అని చెప్పడంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సింగీతం కథ, మాటలు, కథనం రాయించి, ప్రీ ప్రొడక్షన్ చేయించి, వర్క్ షాప్ చేయించి నాగ్ అశ్విన్ చేతిలో ఈ సినిమా బాధ్యతలు పెట్టి ఆయన వీడియో కాల్స్ లో పర్యవేక్షణ, దర్శకత్వం చేసారని మూవీ యూనిట్ తెలిపారు.
ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్, విలన్ పాత్ర పరిచయం, ఆ ఊరు, అక్కడి గోల్డ్ మైన్స్ పరిచయంతో సాగుతుంది. హీరోయిన్ దేవుడ్ని తిడుతూ కోరుకోగానే అక్కడ అందరికి మాటలు పాటల రూపంలోకి మారే సీన్స్ తో సాగుతుంది. మొదటి 20 నిమిషాల్లో సింపుల్ గా కథ చెప్పేసి అందరూ మాట్లాడే ప్రతి మాట పాట రూపంలోకి ఎందుకు మారుతుంది, అది పోవాలంటే ఏం చేయాలి అనే ఓ సస్పెన్స్ బాగా మెయింటైన్ చేసారు. మాట్లాడుకునే మాటలే పాటలుగా మారడంతో కామెడీగా ఫస్ట్ హాఫ్ అంతా నడిపించారు. మరీ ఎక్కువ సేపు ఉండటంతో కొంత సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగుంటాయి. సినిమా చివరి వరకు కూడా మాటలు పాటల రూపంలోనే ఉండటం గమనార్హం. క్లైమాక్స్ మరీ ఓవర్ డ్రమాటిక్ అయినట్టు అనిపిస్తుంది. మనిషిలో ఉన్న ఆశ, దాని కోసం ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నాడు, చుట్టూ ఉన్న మనుషులను ఎలా చూస్తున్నాడు అనే మెసేజ్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.
లేడీ విలన్ – ఆమె తండ్రికి మధ్య చిన్నప్పటి సీన్స్ చూపించి, ఏదో ఎమోషన్ ఉంది అన్నట్టు హింట్ ఇచ్చారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. అసలు ప్రతాప్ జైలుకు ఎందుకు వెళ్ళాడు, ప్రతాప్ తండ్రి ఏం చేశాడు అవి ఏమి చెప్పలేదు. ఇక అంత పెద్ద గోల్డ్ మైన్ పెట్టుకొని ఈ కాలంలో గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, ఊళ్ళో ఇంత జరుగుతున్నా బయట ప్రపంచంతో సంబంధం లేకపోవడం అనేది లాజిక్ కి దూరంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు ఉంటాయి. కుబేరుడిని ఆ ఊరి దేవుడిగా చూపించడం, ఆయన చుట్టూ రాసుకున్న సీన్స్ బాగుంటాయి. ఇక సింగ్ గీతం అనే టైటిల్ కథకు సెట్ అవ్వదు కానీ సింగీతం గారిని దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్స్ కి పనికొస్తుందని, క్యాచీగా ఉందని పెట్టినట్టు అనిపిస్తుంది. ఒక కొత్త ప్రయోగం అయితే చేశారు. మాటలు పాటలుగా వచ్చినంతసేపు అయితే ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సినిమాకు అసలు హీరో దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి. అసలు సినిమాలో అరగంట తప్ప మిగతా అంతా మాటలు పాటల రూపంలోనే ఉంటాయి. దానికి తగ్గట్టు సినిమా అంతా మ్యూజిక్ ఉంది. ఆర్టిస్టులందరి చేత అంత లయబద్దంగా డైలాగ్స్ ని పాడించడం, దానికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం పెద్ద పని. దాన్ని దేవిశ్రీ చాలా కష్టపడి చేసాడని చెప్పొచ్చు. నాగ్ అశ్విన్ కూడా సినిమా చివరి నిమిషం వరకు లేట్ అవ్వడానికి దేవిశ్రీ కష్టమే కారణం అని చెప్పారు. ఈ సినిమాని దేవిశ్రీనే నిలబెట్టాడని చెప్పొచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్..
కొత్త హీరోయిన్ అహల్య అయితే అదరగొట్టేసింది. క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో మెప్పిస్తూనే కొన్ని సీన్స్ లో హీరోయిజం చూపించింది. కొత్త హీరో అయాన్ కూడా బాగా నటించారు. కాస్త నెగిటివ్ షేడ్స్ లో షాలిని కొండేపూడి మెప్పిస్తుంది. తులసి కీలక పాత్రలో బాగా నటించారు. బెనర్జీ కూడా నెగిటివ్ షేడ్స్ లో వీల్ చైర్ లోనే ఉండే పాత్రలో బాగానే నటించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్, విజయ్ దేవరకొండ, అనుదీప్ గెస్ట్ అప్పిరెన్స్ ఇచ్చి మెరిపించారు. వంశీ కనపడిన ప్రతిసారి నవ్వించాడు. రచ్చ రవి,మహేష్, శివన్నారాయణ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఊరి సెట్, గోల్డ్ మైన్స్ సెట్స్, గుహ.. వీటన్నిటికోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా పని చేసింది. సినిమా అంతా పాటల రూపంలోనే కాబట్టి దేవిశ్రీప్రసాద్ కి బాగా పని పడింది. సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. కాకపోతే కొన్ని చోట్ల తన పాత సినిమాల ట్యూన్స్ నే కాస్త మార్చి వాడాడు. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్, క్లైమాక్స్ లో కొంత ఎడిట్ చేస్తే బాగుండేది. ఇలాంటి సినిమాకు డబ్బింగ్ చాలా కష్టమే. అయినా జూనియర్ ఆర్టిస్టులతో సహా అందరిని పర్ఫెక్ట్ గా పాడించారు.
రెగ్యులర్ కథని సింగీతం శ్రీనివాసరావు ఆయన మార్క్ కి తగ్గట్టు కొత్తగా మార్చి మంచి డైలాగ్స్ తో ఓ మెసేజ్ తో బాగా రాసుకున్నారు. ఈ వయసులో కూడా ఓ మంచి సినిమాని అందించాలని ఆయన చేసిన వర్క్, ఆయన తపనని అభినందించాల్సిందే. నాగ్ అశ్విన్ సింగీతం ఆదేశాలను ఫాలో అవుతూ బాగానే తెరకెక్కించారు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘సింగ్ గీతం’ సినిమా మనిషి ఆశ, పర్యావరణం అనే మెసేజ్ ను మ్యూజికల్ కామెడీగా ఓ ఊర్లో జరిగిన కథగా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
