Hansika: గృహ హింస కేసుపై హైకోర్టుకు హీరోయిన్ హన్సిక.. ఆమె ఏం చెప్పారంటే?
ప్రతీకారం తీర్చుకునేందుకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని హన్సిక అన్నారు.

Hansika
సినీ హీరోయిన్ హన్సికా మోత్వానీ, ఆమె తల్లి జ్యోతి మోత్వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించి.. తమపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని కోరారు. వారిద్దరిపై హాన్సిక సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే.
హన్సిక, జ్యోతి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ మోదక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ముస్కాన్ జేమ్స్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై జులై 3న కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.
హాన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీని 2020 డిసెంబర్‌లో ముస్కాన్ జేమ్స్ అనే టీవీ నటి వివాహం చేసుకున్నారు. ఈ జంట 2022 డిసెంబర్‌లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 2024 డిసెంబర్‌లో హన్సిక, జ్యోతి, ప్రశాంత్ మోత్వానీపై ముస్కాన్ ఫిర్యాదు చేశారు. 498 ఏ, 323, 504, 506 సెక్షన్ల కింద నేరారోపణలు చేశారు.
హన్సిక, జ్యోతికి ముంబై సెషన్స్ కోర్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో ముందస్తు బెయిల్ వచ్చింది. ఇప్పుడు వారిద్దరు కలిసి తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు.
పిటిషన్‌లో హన్సిక ఏమన్నారు?
తనపై ప్రతీకారం తీర్చుకునేందుకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని హన్సిక అన్నారు. తన సోదరుడు, జేమ్స్ పెళ్లి కోసం తాను రూ.27 లక్షలు ఖర్చు చేశానని, తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై కేసు పెట్టారని చెప్పారు.
తాను వారి పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్లకు ఆ డబ్బు ఇచ్చానని వివరించారు. ఇంతవరకు ఆ డబ్బును తన సోదరుడుగానీ, జేమ్స్ కానీ ఇవ్వలేదని తెలిపారు.
తనపై చెడు ఉద్దేశాలతో కేసు పెట్టారని చెప్పారు. కుటుంబంలోని విభేదాల కారణంగా తనపై ఆరోపణలు ప్రారంభమయ్యాయని, దీన్ని తీవ్రమైన నేరంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
జేమ్స్, ఆమె భర్త మధ్య వివాదం తలెత్తితే దానిపై వారు మితిమీరి స్పందిస్తూ తనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిగేలా చేస్తున్నారని, ఇటువంటి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఆమె కోరారు.