ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. కేరళకూ బన్నీ సాయం..
కరోనా ఎఫెక్ట్ : అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ విరాళం..

కరోనా ఎఫెక్ట్ : అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ విరాళం..
కరోనా పై యుద్ధానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్ల విరాళం..
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావత్ భారతదేశం నడుం బిగించింది. దేశ ప్రధాని మోడీ ప్రకటణ మేరకు 21 రోజులు పాటు ప్రజలంతా ఇల్లకే పరిమతమవ్వడానికి సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పనులులేక ఇల్లు గడవని పరిస్థితి లేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అలానే ఎందరో పోలీస్ అధికారులు, డాక్టర్లు, హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఉన్న అధికారులు, శానిటేషన్ వర్కర్లు ఇలా ఎందరో ధైర్యంగా మన గురించి పని చేస్తున్నారు.
ఇక ఇలాంటి విపత్తులు వచ్చిన ప్రతిసారీ సాయానికి చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఈ పంధాలోనే తాజాగా కరోనా పై పోరాటానికి సంబంధించిన కార్యక్రమాలకు తన వంతు బాధ్యతగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మొత్తంలో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మరో 25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించారు అల్లు అర్జున్. కేరళ వరదల్లో చిక్కుకున్నప్పుడు 25 లక్షలు, చెన్నై వరదలు వచ్చిప్పడు 25 లక్షల విరాళాలు అల్లు అర్జున్ అందించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రుల ఆదేశాలు మేరకు 21 రోజులు లాక్‌డౌన్‌ని మనందరం కచ్చితంగా పాటిద్దాం. మనకోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానులతో పాటు ప్రజలంతా ఇల్లకే పరితమై కరోనా నివారణకు ప్రభుత్వానికి సహకరించి, ఈ ఘోర విపత్తు నుంచి అందరం బయటపడాలని’’ అన్నారు.
దర్శకులు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ & హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థల విరాళం..
ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5 లక్షలు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి.