Manyam Dheerudu : ‘మన్యం ధీరుడు’ రివ్యూ.. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో..
బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథను మరోసారి 'మన్యం ధీరుడు'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Alluri Sitarama Raju Life Story Manyam Dheerudu Movie Review and Rating
Manyam Dheerudu Movie Review : బ్రిటీష్ వారికి ఎదురుగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒకరు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జీవిత కథతో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా మరోసారి అల్లూరి సీతారామరాజు జీవిత కథతో మన్యం ధీరుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థల నటుడు RVV సత్యనారాయణ తనే సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఈ సినిమాని నిర్మించారు. RCC మూవీస్ బ్యానర్ పై పార్వతిదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. అల్లూరి సీతారామరాజు కథ అందరికి తెలిసిందే. మన్యం ప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న అరాచకాలకు ఎదురు నిలబడి వారితో పోరాడి నేలకొరిగారు అల్లూరి సీతారామరాజు. అయన జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి, బ్రిటిష్ వాళ్లతో ఒంటరిగా పోరాడటం.. ఈ సన్నివేశాలన్నీ చూపించారు. అయితే ఈ కథలో ఓ ప్రేమ కథ, కొంత కామెడీ, మన్యం ప్రజలను మద్యం నుంచి విముక్తి చేయడం వంటి అంశాలు కూడా జత చేసారు. మన్యం ప్రజలపై బ్రిటిష్ వాళ్ళు వేసిన పన్నులను సీతారామరాజు ఎలా ఎదిరించాడు? దానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసారు? స్వాతంత్రం కోసం మన్యం ప్రజల్లో సీతారామరాజు ఎలా చైతన్యం తెచ్చారు? మన్యం ధీరుడు ఎలా పోరాడాడు అనేవి తెరపై చూడాల్సిందే..
Also Read : Ram Charan : ఆస్ట్రేలియాలో భార్య, పాపతో చరణ్.. క్యూట్ కంగారూలతో ఫొటోలు వైరల్..
సినిమా విశ్లేషణ.. స్వాతంత్రోద్యమ కథలపై ఒకప్పుడు సినిమాలు బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రపంచ సినిమా చూసే స్థాయికి ప్రేక్షకులు ఎదగడంతో అలాంటి కథలు రావడం కనుమరుగయ్యాయి. వచ్చినా ఆదరించడం కూడా కరువైంది. ఈ క్రమంలో తెలుగు వారి స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథని మన్యం ధీరుడు గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఇందులో అల్లూరి జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించడమే కాక కొన్ని కల్పిత అంశాలు పెట్టినట్టు అనిపిస్తాయి. ఇలాంటి కథలో ప్రేమ కథ, కామెడీ అవసరం లేకపోయినా జోడించారు అనిపిస్తుంది. చింతపల్లి స్టేషన్ పై దాడి, బ్రిటిష్ వాళ్ళని ఎదురించే సీన్స్ అయితే అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్ కొంత సాగదీసినట్టు ఉన్నా అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలయి యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది. స్వతంత్రం ఎంత అవసరమో అనే అంశాన్ని అల్లూరి పాత్రతో మన్యం ప్రజలకు తెలియచేసేలా చూపించారు. మనకు తెలిసిన అల్లూరి సీతారామరాజు కథ మరోసారి మన్యం ధీరుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అల్లూరి టైటిల్ పాత్ర పోషించిన RVV సత్యనారాయణ రంగస్థల నటుడు కావడంతో డైలాగ్స్, హావభావాలతో బాగానే మెప్పించారు. ఈ సినిమా కోసం గుర్రపుస్వారీ, కత్తియుద్దం, విలువిద్య.. ఇలాంటివి చాలా కష్టపడి నేర్చుకున్నట్టు తెలుస్తుంది. మల్లు దొర పాత్రలో జీవీ త్రినాథ్ బాగా మెప్పించారు. బ్రిటిష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ కూడా తన నటనతో మెప్పించారు. జబర్దస్త్ అప్పారావు, సత్తిపండు వారి పాత్రల్లో కాసేపు నవ్వించడానికి ప్రయత్నం చేసారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో అలరించారు.
సాంకేతిక అంశాలు.. మన్యం గూడెం సెట్ ని చాలా న్యాచురల్ గా వేశారు. అరకు, పాడేరు, హిమాచర్ల ప్రదేశ్, కశ్మీర్ వంటి లొకేషన్స్ లో సినిమాని చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ కూడా కథకు తగ్గట్టు, ఆ కాలానికి తగ్గట్టు న్యాచురల్ గా ఉంది. అల్లూరి సీతారామరాజుకు ఇచ్చిన ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగా డిజైన్ చేసారు. కథ అందరికి తెలిసిందే అయినా కథనంలో అదనంగా కొన్ని అంశాలు జోడించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సాగదీసిన సీన్స్ ని ఎడిటింగ్ లో ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక దర్శకుడిగా నరేష్ డెక్కల మెప్పించారు. నటుడిగానే కాకా నిర్మాతగా కూడా RVV సత్యనారాయణ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథను మరోసారి ‘మన్యం ధీరుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.