Lopaliki Ra Chepta : ‘లోపలికి రా చెప్తా’ మూవీ రివ్యూ.. ఢీ కంటెస్టెంట్ అనాల సుస్మిత నటించిన రొమాంటిక్ థ్రిల్లర్..

లోపలికి రా చెప్తా సినిమా నేడు జులై 5న థియేటర్స్ లో రిలీజయింది.

Anala Susmitha Lopaliki Ra Chepta

Lopaliki Ra Chepta Movie Review : మాస్ బంక్ మూవీస్ బ్యానర్ పై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర నిర్మాణంలో కొండా వెంకట రాజేంద్ర మెయిన్ లీడ్ లో నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘లోపలికి రా చెప్తా’. మనీషా జష్నాని, సుస్మిత అనాల, సాంచిరాయ్ లు హీరోయిన్స్ గా నటించారు. లోపలికి రా చెప్తా సినిమా నేడు జులై 5న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. రామ్(కొండా వెంకట రాజేంద్ర) ఫస్ట్ నైట్ రోజు తన భార్య ప్రియ(సుస్మిత అనాల)లోకి దయ్యం వచ్చి రామ్ ని కొట్టి తనని ముట్టుకోనివ్వదు. దీంతో రామ్ తన భార్యని పట్టుకొని బాబాలు, దయ్యాలు వదిలించే వాళ్ళ దగరికి తిరుగుతాడు. చివరగా బ్లాక్ స్పారో(వంశీధర్) దగ్గరికి వెళ్తే అసలు నీ లైఫ్ లో ఏం జరిగిందో చెప్పమంటాడు. దీంతో రామ్ నాలుగేళ్ళ క్రితం తన లైఫ్ లో జరిగిన కథ చెప్తాడు.

రామ్ బిటెక్ చేసి జాబ్ రాకపోవడంతో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు రుక్మిణి(సాంచి రాయ్) పరిచయం అయి రాత్రికి ఇంటికి రమ్మంటుంది. ఎవరికీ తెలియకూడదు అని తన విల్లా నెంబర్ 21 కాకుండా వేరే విల్లా నంబర్ 19 చెప్పి లోపలి రమ్మంటుంది. విల్లా నెంబర్ 19లో ఉండే విక్కీ తన భార్యని అన్నిటికి అనుమానిస్తాడు. సెక్యూరిటీ దగ్గర తన విల్లాకు ఎవరో డెలివరీ బాయ్ వచ్చాడని తెలిసుకొని భార్య నైనిక(మనీషా జష్నాని)ని అనుమానించి ఇంట్లోంచి పంపించేస్తాడు. దీంతో నైనిక అసలు ఇదంతా రామ్ వల్లే జరిగిందని రామ్ ని తీసుకొచ్చి తన భర్త ముందు మాట్లాడించినా భర్త నమ్మడు. పైగా వీళ్ళను చంపుతానంటాడు. దీంతో అర్ధరాత్రి ఏం చేయాలో తెలియక నైనిక రోడ్డు మీద ఉండటంతో రామ్ తనని తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉంచుతాడు. నైనిక తన భర్తని కలవడానికి ఎంత ప్రయత్నించినా ఇంట్లో ఎవరు ఉండరు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ క్రమంలో నైనిక – రామ్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఓ నాలుగు రోజుల తర్వాత విక్కీ వచ్చి నైనికని తీసుకెళ్తాడు. మరి నైనికని విక్కీ ఏమైనా చేశాడా? నైనిక చెప్పకుండా వెళ్లిపోవడంతో రామ్ ఏం చేసాడు? అసలు ప్రియ శరీరంలో ఉన్న ఆత్మ ఎవరిది? రుక్మిణి ఎందుకు ఇంటికి రమ్మంటుంది? అసలు రుక్మిణి ఏమయిపోయింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : 3BHK Movie : ‘3BHK’ మూవీ రివ్యూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ..

సినిమా విశ్లేషణ.. మొదటి అరగంట ఫస్ట్ నైట్, దయ్యం రావడం, బాబాల దగ్గరికి తిప్పడం.. కాస్త బోర్ కొడుతుంది. బ్లాక్ స్పారో దగ్గర ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. విక్కీ వచ్చి నైనికని తీసుకెళ్లడంతో ఇంటర్వెల్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం కథ ఊహించినదానికి భిన్నంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం ఎవరి ఆత్మ ఉంటుందో అని గెస్ చేస్తుంటే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తారు. అసలు వాళ్ళ ఆత్మనా అని ఆశ్చర్యపోతారు? అయితే ఎందుకు ఆత్మ ప్రియ శరీరంలోకి దూరింది అనే పాయింట్ తో ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు.

నాలుగేళ్లు ఆగి ఇప్పుడే ప్రియ శరీరంలోకి ఎందుకు దూరింది ఆత్మ అనేదానికి సమాధానం ఇవ్వలేదు. ఇక రుక్మిణి ఏమైందో మళ్ళీ చూపించలేదు. హీరోకి ఒక ఫ్యామిలీ ఉన్నట్టు ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి రెండు సార్లు చూపించి వదిలేసారు. అక్కడక్కడా కామెడీ బాగా ట్రై చేసారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. రొమాంటిక్ సీన్స్, డబల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం చాలానే ఉన్నాయి. హారర్ జానర్లో ప్రమోట్ చేసారు కానీ హారర్ అనుభవం ఏమి ఉండదు. హారర్ సీన్స్ కి స్కోప్ ఉన్నా సరిగ్గా రాసుకోలేదు అనిపిస్తుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా పర్వాలేదనిపిస్తుంది. చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేయడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇటీవల ఢీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అనాల సుస్మిత ఈ సినిమాలో కాసేపే కనిపించినా దయ్యం పట్టిన పాత్రలో బాగానే నటించింది. కొండా వెంకట రాజేంద్ర ఓ పక్క దర్శకత్వం చేస్తూ హీరోగా బాగానే మెప్పించాడు. మనీషా జష్నాని ఓ పక్క అందాలు ఆరబోస్తూ మరో పక్క నిజాయితీ భార్య పాత్రలో బాగానే సెట్ అయింది. సాంచి రాయ్ కూడా తన అందాలతో కాసేపు అలరిస్తుంది. బ్లాక్ స్పారోగా వంశీ చేసే యాక్టింగ్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Solo Boy : ‘సోలో బాయ్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ సినిమా ఎలా ఉంది?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా పాటలు మాత్రం అన్ని వినడానికి బాగున్నాయి. గ్రాఫిక్స్ విషయంలో ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. కథ కొత్తగా ఉన్నా రొటీన్ కథనంతో ఓ మెసేజ్ ఇస్తూ తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘లోపలి రా చెప్తా’ సినిమా ఓ డెలివరీ బాయ్ అనుకోకుండా చేసిన తప్పుకి జరిగిన పరిణామాలు ఏంటి అని రొమాంటిక్ థ్రిల్లర్ లా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.