Solo Boy : ‘సోలో బాయ్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ సినిమా ఎలా ఉంది?

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ ఇప్పుడు హీరోగా ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా గౌతమ్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Solo Boy : ‘సోలో బాయ్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ సినిమా ఎలా ఉంది?

Bigg Boss Fame Gautham Krishna

Updated On : July 11, 2025 / 7:21 PM IST

Solo Boy Movie Review : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాణంలో నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా సోలో బాయ్. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించగా పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సోలో బాయ్ సినిమా నేడు జులై 4 థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. కాలేజీలో చదివేటప్పుడు ప్రియా(రమ్య పసుపులేటి)ని ప్రేమిస్తాడు. క్యాంపస్ జాబ్స్ లో ఇతనికి చిన్న ఉద్యోగం రావడం, ప్రియకు పెద్ద ఉద్యోగం రావడంతో డబ్బు ముఖ్యమని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ బాధ నుంచి బయటకు వచ్చాక కృష్ణమూర్తి జాబ్ లో జాయిన్ అవ్వగా అక్కడ శృతి(శ్వేతా అవస్తి)తో పరిచయం అయి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కృష్ణమూర్తి తండ్రి(పోసాని కృష్ణమురళి) అనారోగ్యం పాలవడంతో చాలా ఖర్చవుతుంది. అయినా తండ్రి చనిపోతాడు. ఇలాంటి సమయంలో కృష్ణమూర్తి దగ్గర డబ్బులు లేవని శృతి విడాకులు ఇస్తానని వెళ్ళిపోతుంది. మరి కృష్ణ లైఫ్ లో ఎదుగుతాడా? డబ్బులు సంపాదిస్తాడా? శృతి మళ్ళీ కృష్ణ వద్దకు వస్తుందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : 3BHK Movie : ‘3BHK’ మూవీ రివ్యూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ..

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా కృష్ణ కాలేజీ ఎపిసోడ్, బ్రేకప్ స్టోరీ, మళ్ళీ ఆఫీస్, లవ్, పెళ్లితో సాగుతూ ఇంటర్వెల్ కి తండ్రి చనిపోవడం, భార్య వదిలేయడంతో ఒక ఎమోషనల్ బ్రేక్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో కృష్ణ ఎలా ఎదుగుతాడు? లైఫ్ లో ఎదగడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలా ఎదుగుతాడు అని చూపించారు.

ఇది ఒక రొటీన్ కథ, కథనం. ఎన్నో కష్టాలు పడి, లవ్ ఫెయిల్యూర్, ఫ్యామిలీ భాధలు పడే హీరో లైఫ్ లో ఎలా ఎదుగుతాడు అనే కథాంశం గతంలో చాలా సినిమాల్లో చూసాం. ఈ కథని కనీసం స్క్రీన్ ప్లే అయినా కొత్తగా రాసుకుంటే బాగుండేది. తండ్రి ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది. లవ్ స్టోరీలు బాగానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఉంటుంది. క్లైమాక్స్ ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ ఇప్పుడు హీరోగా తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా గౌతమ్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Solo Boy

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో గౌతమ్ కృష్ణ కామెడీ, లవ్, బాధ, యాక్షన్.. ఇలా అన్ని ఎమోషన్స్ ని బాగానే పండించాడు. తెలుగు అమ్మాయి రమ్య పసుపులేటి కాసేపే కనిపించినా క్యూట్ గా అలరిస్తుంది. శ్వేత అవస్తి బాగానే నటించింది. పోసాని కృష్ణ మురళి తండ్రి పాత్రలో అంచి పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తారు. అనిత చౌదరి తల్లి పాత్రలో ఓకే అనిపిస్తుంది. భద్రం, షఫీ, చక్రపాణి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Thammudu : ‘త‌మ్ముడు’ మూవీ రివ్యూ.. అక్క కోసం తమ్ముడి పోరాటం..

సాంకేతిక విశ్లేషణ.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు వినడానికి బాగున్నాయి. డైరెక్టర్ రొటీన్ కథను తీసుకున్నా కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘సోలో బాయ్’ సినిమా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా లైఫ్ లో ఎలా ఎదిగాడు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.