Thammudu : ‘తమ్ముడు’ మూవీ రివ్యూ.. అక్క కోసం తమ్ముడి పోరాటం..
యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.

Nithiin Sapthami Gowda Laya Varsha Bollamma Dil Raju Thammudu Movie Review and Rating
Thammudu Movie Review : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘తమ్ముడు’. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక కీలక పాత్రలు పోషించగా ఒకప్పటి హీరోయిన్ లయ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తమ్ముడు సినిమా నేడు జులై 4 థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. వైజాగ్ లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అక్కడినుంచి వచ్చిన గ్యాస్ వల్ల కొంతమంది చనిపోతారు. ఈ ఘటనని బయటికి రానివ్వకుండా ఆ ఫ్యాక్టరీ ఓనర్ అజర్వాల్(సౌరభ్ సచ్ దేవ్) ప్రభుత్వంకు, చనిపోయిన వారికి ఎంతో కొంత డబ్బులు ఇస్తానంటాడు. కానీ చనిపోయిన వాళ్ళ తాలూకు ఫ్యామిలీలు మాత్రం మాకు న్యాయం జరగాలి, ఇది చేసిన వాళ్ళకు శిక్ష పడాలి అని నిరాహారదీక్షకు దిగుతారు. దీంతో ప్రభుత్వం ఆ పేలుడుపై నివేదిక కోసం ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరిని భయపెట్టి అజర్వాల్ తనకు అనుకూలంగా సంతకం చేయించుకుంటాడు.
ఆ కమిటీ హెడ్ ఝాన్సీ కిరణ్మయి(లయ) కూడా సంతకం పెట్టాలి కానీ కిరణ్మయి అదే సమయంలో తన ఫ్యామిలీతో కలిసి ఆంధ్ర ఛతీస్ ఘడ్ బోర్డర్ లో ఉన్న అంబర్ గొడుగు అనే ఊర్లో జరిగే పగడాలమ్మ జాతరకు వెళుతుంది. చిన్నప్పుడే అక్క(లయ)కు దూరమైన జై(నితిన్) ఆర్చరీ ఛాంపియన్ గా తయారవుతాడు. వరల్డ్ ఛాంపియన్ జరిగే ముందు అక్క గుర్తుకొచ్చి ఫోకస్ చేయలేకపోతాడు. దీంతో తన ఫ్రెండ్ చైత్ర(వర్ష బొల్లమ్మ)తో కలిసి అక్కని వెతుక్కుంటూ అంబర్ గొడుగు వెళ్తాడు. అక్కడ అక్క ప్రాణాలకు ముప్పు ఉందని తెలుస్తుంది. అక్కడ చుట్టూ ఉన్న ఊళ్లకు ఝాన్సీ ఫ్యామిలీని చంపితే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటిస్తారు. మరి జై అక్కని ఎలా కాపాడుకుంటాడు? అంతమంది ఊరి జనాల నుంచి ఫ్యామిలీని రత్న(సప్తమి గౌడ) సహాయం తీసుకొని ఎలా తపిస్తాడు? ఝాన్సీ రిపోర్ట్ మీద సంతకం పెడుతుందా? అజర్వాల్ కి శిక్ష పడుతుందా? ఫ్యాక్టరీలో పేలుడు ఎందుకు జరిగింది? అసలు జై తన అక్కకు చిన్నప్పుడే ఎందుకు దూరమవుతాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Also Read : Uppu Kappurambu : ‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ.. స్మశానం నిండినది..
సినిమా విశ్లేషణ.. నితిన్ మంచి హిట్ చూసి చాలా కాలం అయింది. తమ్ముడు ట్రైలర్ చూసిన తర్వాత అక్క సెంటిమెంట్ తో పాటు ఫుల్ యాక్షన్ కూడా ఉండటంతో సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. జై గురించి చూపించి, అక్కని వెతకడంతో పాటు అక్కకి ఉన్న సమస్యని చూపించి జై అక్క సమస్యలోకి ఎంటర్ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ సాదాసీదాగానే సాగుతుంది. ఇంటర్వెల్ కి అక్క కోసం తమ్ముడు ఎలాంటి పోరాటం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా తన అక్క, ఫ్యామిలీ అందర్నీ ఆ ఊరు దాటించడానికి తమ్ముడు ఎంత కష్టం పడ్డాడు, ఎంత మందితో పోరాటం చేసాడు అని ఫుల్ లెంగ్త్ యాక్షన్ తోనే సాగుతుంది.
గతంలో ఫ్యామిలీని కాపాడటానికి హీరోలు పోరాటం చేయడం అనేక సినిమాల్లో చూసాం. ఇందులో అక్కని కాపాడటానికి తమ్ముడు చేసే పోరాటంతో ఓ సింపుల్ కథతోనే సాగుతుంది. రొటీన్ కథ అయినా కేవలం యాక్షన్ సీన్స్, విజువల్స్ మీదే సినిమాని నడిపించినట్టు ఉంటుంది. ఇదే ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ కూడా చెప్పారు. ఓ పక్క అక్క సెంటిమెంట్ తో పాటు మామ – మేనకోడలు సెంటిమెంట్, ఓ సీన్ లో తల్లి సెంటిమెంట్ ని కూడా బాగానే చూపించి ఎమోషన్ ని వర్కౌట్ చేసారు. విలన్ క్యారెక్టర్ కొత్తగా రాసుకొని చివర్లో దానికి తగ్గ ముగింపు ఇచ్చినా అది కాస్త కామెడీగా అనిపిస్తుంది. అందరూ అడవుల్లో బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. నితిన్ కి మంచి యాక్షన్ సినిమా పడింది అని చెప్పొచ్చు. యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు. నితిన్ – సప్తమి పాత్రలు ఒక్కసారి కూడా కలుసుకోకుండా వారి మధ్య సీన్స్ బాగా రాసుకున్నారు. అయితే యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా ఫస్ట్ హాఫ్ మధ్యలో నుంచి చివరి వరకు యాక్షన్స్ తోనే సాగడంతో ఫ్యామిలీకి ఏమవుతుంది అనే థ్రిల్లింగ్ తో పాటు ఇంకెంత సేపు యాక్షన్స్ అని కూడా అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నితిన్ యాక్షన్స్ కోసం చాలానే కష్టపడ్డాడు. ఈ పాత్ర కోసం ఆర్చరీ కూడా నేర్చుకున్నాడు. వర్ష బొల్లమ్మ నితిన్ కి సపోర్ట్ ఉండే పాత్రలో బాగానే మెప్పించింది. కాంతార తో ఫేమ్ తెచ్చుకున్న సప్తమి గౌడ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం కాల్స్ మాట్లాడుతూ కూర్చునే పాత్ర అయినా క్యూట్ గా అలరిస్తూనే చివర్లో చిన్న యాక్షన్ కిక్ ఇచ్చింది. శ్వాసిక మాత్రం తన లుక్స్, రఫ్ యాక్టింగ్ తో అదరగొట్టేసింది.
ఒకప్పటి హీరోయిన్ లయ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత అక్క, తల్లి పాత్రలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లయకు అవకాశాలు రావొచ్చు. సౌండ్ అంటే పడని ఓ కొత్త తరహా పాత్రలో విలన్ గా సౌరభ్ బాగానే మెప్పించాడు. హరితేజకు కూడా మంచి పాత్రే పడింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Thammudu : ‘తమ్ముడు’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ సినిమా ఎలా ఉందో..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అడవుల్లో, రాత్రి సీన్స్ లో, యాక్షన్స్ సీక్వెన్స్ లలో విజువల్స్ అద్భుతంగా చూపించారు. అజనీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు కానీ అవసర్లేని చోట్ల కూడా మ్యూజిక్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అడవుల్లో లొకేషన్స్ మాత్రం అద్భుతంగా చూపించారు. మారేడుమిల్లి, అరకు ఫారెస్ట్ లను మొత్తం తిప్పి చూపించేసారు. యాక్షన్స్ సీక్వెన్స్ లు చాలా బాగా డిజైన్ చేసారు. కథ కథనం రొటీన్ కావడంతో దర్శకుడు ఎక్కువగా విజువల్స్ మీదే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. నిర్మాణపరంగా మాత్రం ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘తమ్ముడు’ సినిమా చిన్నప్పుడే అక్కకు దూరమైన తమ్ముడు అక్క సిన్సియర్ ఆఫీసర్ అయ్యాక ఓ సమస్యలో ఉంటే పోరాటం చేసి ఎలా కాపాడాడు అని ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..