Uppu Kappurambu : ‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ.. స్మశానం నిండినది..
ఉప్పు కప్పురంబు అని టైటిల్ కూడా కొత్తగా ఉండటం, స్మశానంలో ఖాళీ లేదు అనే కొత్త కాన్సెప్ట్ తో ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Suhas Keerthy Suresh Babu Mohan
Uppu Kappurambu Movie Review : సుహాస్, కీర్తి సురేష్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మాణంలో వసంత్ మారింగంటి కథ రాయగా అని ఐ.వి. శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఉప్పు కప్పురంబు డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది. అమెజాన్ ప్రైమ్ లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ముందు రోజే పలువురు సెలబ్రిటీలకు, మీడియాకు ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. చిట్టి జయపురం అనే ఊళ్ళో ఊరి పెద్ద(శుభలేఖ సుధాకర్) చనిపోవడంతో వంశపారపర్యం అంటూ భయస్తురాలు, అమాయకురాలు అయిన ఆయన కూతురు అపూర్వ(కీర్తి సురేష్)ని ఊరిపెద్దని చేస్తారు. ఆ ఊళ్ళో బాగా డబ్బున్న కుటుంబాలు మధుబాబు(శత్రు), భీమయ్య(బాబు మోహన్) ఊరి పెద్ద పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అపూర్వ ఊరిపెద్ద అయ్యాక మొదటిసారి రచ్చబండ పెట్టి ఊరి సమస్యలు అడగ్గా అందరూ ఏదో ఒకటి అడుగుతుంటే ఏదో ఒకటి సమాధానం చెప్తూ తప్పించుకుంటుంది. కానీ ఆ ఊరి కాటి కాపరి చిన్నా(సుహాస్) వాళ్ళ ఊరి స్మశానంలో చనిపోతే పూడ్చిపెట్టడానికి ఇంకా నాలుగే స్థలాలు ఖాళీ ఉన్నాయి, ఎవరైనా చనిపోతే ఏంటి పరిస్థితి అనే సమస్యని ప్రస్తావిస్తాడు.
దీంతో ఆ మిగిలిన నాలుగు స్థలాలు మాకు కావాలి మాకు కావాలి అంటూ అందరూ కొట్టుకుంటారు. చిన్నా వాళ్ళ అమ్మ కూడా ఓ రోగంతో బాధపడుతూ చావుకు దగ్గర్లో ఉంటుంది. సరే అని లాటరీ తీసి ఒక నలుగురికి మిగిలిన నాలుగు స్థలాలు ఇస్తుంది అపూర్వ. కానీ ఒకే రోజు వేరే నలుగురు చనిపోవడంతో మళ్ళీ సమస్య మొదటికొస్తుంది. దీంతో అపూర్వ, చిన్ని కలిసి ఆ ఊరి సమస్యని ఎలా తీర్చారు? మనుషులు చనిపోతే పూడ్చిపెట్టడానికి స్థలం ఎక్కడినుంచి తెచ్చారు? ఆ ఊళ్ళో శవాలను కాల్చకుండా ఎందుకు పూడ్చిపెడుతున్నారు? చిన్నా వాళ్ళ అమ్మ చనిపోతే ఆమె చివరి కోరిక తీర్చాడా? ఊరిపెద్దగా అపూర్వని తప్పిస్తారా? ఒకేరోజు నలుగురు ఎలా చనిపోయారు.. వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. సుహాస్ సినిమాలు అంటే మెప్పిస్తాయి అని ప్రేక్షకులకు ఒక అభిప్రాయం ఉంది. ఉప్పు కప్పురంబు అని టైటిల్ కూడా కొత్తగా ఉండటం, స్మశానంలో ఖాళీ లేదు అనే కొత్త కాన్సెప్ట్ తో ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. వ్యంగ్య హాస్యంతో కూడిన కథతో ఈ సినిమా ఉంటుంది అని ప్రమోషన్స్ లో ముందు నుంచే చెప్పారు. కథ అంతా 90వ దశకంలో జరుగుతుంది. అపూర్వ ఊరి పెద్ద అయి, స్మశానం సమస్య తీసుకురావడం, అది తాత్కాలికంగా తీర్చాం అనుకునేలోపు నలుగురు చనిపోయి స్మశానం ఫుల్ అవ్వడంతో ఆ సమస్యని ఎలా తెరుస్తారు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు. సెకండ్ హాఫ్ లో చిన్నా – అపూర్వ కలిసి ఆ సమస్యని ఎలా పరిష్కారం చేసారు అని చూపించారు.
సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా నటీనటుల హావభావాలు ఫుల్ గా నవ్విస్తాయి. చివర్లో సమస్య తీర్చిన విధానం బాగానే రాసుకున్నారు కానీ ప్రతిదానికి అడ్డం చెప్పిన ఊరివాళ్ళు, పంతులు దానికి ఎలా ఒప్పుకున్నారు అనే లాజిక్ వదిలేసారు. మొదట్నుంచి చిన్నా తల్లి చనిపోతుంది అని హింట్స్ ఇస్తుండటంతో చనిపోయాక ఆ ఎమోషన్ అంతగా కనెక్ట్ అవ్వలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. కీర్తి సురేష్ తో సహా కొన్ని కొన్ని పాత్రలు సడెన్ గా ఓవర్ యాక్టింగ్ చేస్తాయి, ఎందుకో అర్ధం కాదు. కొత్త పాయింట్ రాసుకున్నా క్లైమాక్స్ లో కాస్త తడబడి హడావిడిగా ముగించేసినట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా కామెడీగా సాగిన సినిమా సడెన్ గా సీరియస్ టోన్ లోకి మారిపోవడంతో కన్ఫ్యూజ్ అవుతారు. రానా వాయిస్ ఓవర్ బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో మాత్రం ఫుల్ గా పడీ పడీ నవ్వుకోవాల్సిందే. ఉప్పు కప్పురంబు టైటిల్ కి తగ్గట్టు ఆ పద్యాన్ని ఓ రెండు సార్లు వాడి టైటిల్ జస్టిఫికేషన్ బాగానే ఇచ్చారు. ఎంత డబ్బున్నవాడైనా చనిపోయాక ఓ ఆరు అడుగుల స్థలం కావాల్సిందే, అందులోకి వెళ్లాల్సిందే అనే కాన్సెప్ట్ ని చెప్పడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. చివర్లో సీక్వెల్ కి హింట్ ఇచ్చారు కానీ సీక్వెల్ తీస్తారో లేదో చూడాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆల్రెడీ మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న పర్ఫార్మర్ కీర్తి సురేష్ ఈ సినిమాలో అమాయక పాత్రలో చాలా బాగా నటించింది కానీ కొన్ని సీన్స్ లో అక్కర్లేకపోయినా బాగా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా సింపుల్ గా నటిస్తూ ప్రతి సినిమాతోనూ అందర్నీ మెప్పిస్తున్న సుహాస్ ఈ సినిమాలో కాటి కాపరి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయి తన నటనతో మెప్పిస్తాడు. క్లైమాక్స్ లో కాస్త ఎమోషన్ కూడా పండించాడు.
బాబు మోహన్ కు కాస్త గ్యాప్ వచ్చినా చాన్నాళ్లకు మళ్ళీ కనిపించి అలరించారు. ఈ సినిమా తర్వాత బాబు మోహన్ సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశాలు వస్తాయేమో చూడాలి. దువ్వాసి మోహన్ కూడా చాన్నాళ్ళకి ఒక మంచి పాత్రలో పలు సీన్స్ లో ఫుల్ గా నవ్వించాడు. రవితేజ తింగరి పాత్రలో బాగానే నటించాడు. శత్రు డబ్బున్న యువకుడు పాత్రలో అక్కడక్కడా నవ్విస్తాడు. శుభలేఖ సుధాకర్, తాళ్లూరి రామేశ్వరి, ప్రభావతి వర్మ, విష్ణు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Tollywood : టాలీవుడ్ కి 3700 కోట్ల నష్టం.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆ కాలానికి తగ్గట్టు బాగానే చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి. సినిమా అంతా రెండు మూడు లొకేషన్స్ లోనే సింపుల్ గా తీసేసారు. సుహాస్, కీర్తి సురేష్ కాస్త్యుమ్ డిజైనర్స్ ని ఆ పాత్రకు తగట్టు పర్ఫెక్ట్ గా కాస్త్యుమ్స్ డిజైన్ చేసినందుకు మెచ్చుకోవలసిందే. డెబ్యూట్ డైరెక్టర్ కొత్త పాయింట్ తీసుకున్నా క్లైమాక్స్ ఇంకాస్త క్లారిటీతో రాసుకొని తెరకెక్కించాల్సింది. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ఉప్పు కప్పురంబు’ సినిమా స్మశానంలో శవాలు పూడ్చిపెట్టడానికి స్థలం లేకపోతే ఊరిపెద్ద, కాటి కాపరి కలిసి ఆ సమస్యని ఎలా పరిష్కరించారు అని కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.