3BHK Movie : ‘3BHK’ మూవీ రివ్యూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ..
3BHK సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల కోసం పడే కష్టం.

Siddharth Sarath Kumar 3BHK Movie Review and Rating
3BHK Movie Review : శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మాణంలో శ్రీ గణేష్ దర్శకత్వంలో సిద్దార్థ్ మెయిన్ లీడ్లో తెరకెక్కిన సినిమా 3BHK. శరత్ కుమార్, దేవయాని, చైత్ర, మీతా రఘునాథ్.. కీలక పాత్రల్లో నటించారు. 3BHK సినిమా నేడు జులై 4న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. వాసుదేవ్(శరత్ కుమార్) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. ఒక సొంతిల్లు అతని కల. మొదటిసారి సొంతిల్లు ప్లాన్ చేసినప్పుడు కొడుకు ప్రభు(సిద్దార్థ్) కాలేజీ ఫీజ్ అడ్డొస్తుంది. తర్వాత మరోసారి రేట్లు పెరిగిపోతాయి. తర్వాత వాసుదేవ్ కి హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ కి ఖర్చు అవుతుంది. తర్వాత కొడుకు పెద్దయ్యాక అతని సపోర్ట్ తో కడదాం అంటే కొడుక్కి చదువు అవ్వగానే జాబ్ రాదు. జాబ్ చేసే స్టేజ్ కి వచ్చాక ఇల్లు కడదామని ప్లాన్ చేస్తే కూతురు ఆర్తి(మీతా రఘునాథ్) పెళ్ళికి ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఆ తర్వాత ప్రభు – ఐశ్వర్య(చైత్ర)ల ప్రేమపెళ్లితో ప్రభు వాసుదేవ్ మధ్య మాటలు కట్ అవుతాయి. అదే సమయంలో ఆర్తి భర్తతో గొడవ పడి వచ్చేస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూ అతని సొంతింటి కల వాయిదా పడుతూనే ఉంటుంది. ప్రభు కూడా తండ్రి కోసం, వాళ్ళ కోసం సొంతిల్లు కావాలని కోరుకుంటాడు కానీ జాబ్ రిజైన్ చేయాల్సి వస్తుంది. మరి వాసుదేవ్ ఫ్యామిలీ సొంతిల్లు కల ప్రభు తీర్చడా లేదా? వాసుదేవ్ – ప్రభు మాట్లాడుకున్నారా? ఆర్తి లైఫ్ ఏమైంది? ప్రభు ఇంకో జాబ్ లో జాయిన్ అయ్యాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Thammudu : ‘తమ్ముడు’ మూవీ రివ్యూ.. అక్క కోసం తమ్ముడి పోరాటం..
సినిమా విశ్లేషణ.. సినిమా అంతా ఒకే పాయింట్ మీద నడిపించారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంతింటి కల నెరవేరుతుందా లేదా అనే దాని చుట్టే కథ నడిపించారు. దీంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభు స్కూల్, కాలేజీ స్టోరీలు చూపించడం కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ కి ప్రభుకి జాబ్ రాదు నెక్స్ట్ ఏం చేస్తారు అని ఓ క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసారు.
ఇక సెకండ్ హాఫ్ మాటిమాటికి ఇల్లు కొందాము అన్నప్పుడుల్లా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుండటం ఇన్నిసార్లు వాయిదానా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగా సాగదీశారు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒక మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అని కష్టాలతోనే సాగదీశారు. తండ్రి ఎమోషన్, సొంతిల్లు ఉండాలి అనే ఎమోషన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లకు, సొంతింటి కల ఉన్నవాళ్లకు సినిమా కనెక్ట్ అయి కొన్ని సీన్స్ లో కన్నీళ్లు పెడతారు. నెరేషన్ కూడా చాలా స్లో గా ఉంది. ఒక వ్యక్తి పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి చివరి వరకు మొత్తం జీవితం చూపించేసారు. రానా వాయిస్ ఓవర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.
నటీనటుల పర్ఫార్మెన్స్.. శరత్ కుమార్ ఒక మాములు మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో అదరగొట్టేసారు. మన నాన్న కూడా ఇలాగే కదా అనిపించడం ఖాయం. దేవయాని ఒక సింపుల్ తల్లి పాత్రలో ఓకే అనిపిస్తుంది. సిద్దార్థ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే కష్టాలు, బాధ్యతలు మోసే యువకుడి పాత్రలో బాగా నటిస్తూ మంచి ఎమోషన్ పండించాడు.
మీతా రఘునాథ్ క్యూట్ గా కనిపించినా ఫ్యామిలీ బాధ్యతల్లో భాగం కావాలనుకునే కూతురి పాత్రలో మెప్పిస్తుంది. చైత్ర కాసేపే కనిపించినా భార్య పాత్రలో బాగా నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు. అందరూ కలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో ఎలా ఉంటారో అలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
Also Read : 3BHK Twitter Review : సిద్దార్థ్ 3BHK ట్విటర్ రివ్యూ..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేసి కన్నీళ్లు తెప్పిస్తుంది మ్యూజిక్. పాటలు బాగానే ఉన్నాయి. ఒక రియల్ లైఫ్ లో జరిగే కథల్ని తీసుకొని మంచి ఎమోషన్ తో రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా 3BHK సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల కోసం పడే కష్టం. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
https://www.youtube.com/watch?v=intThzZB-Yg
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.