Pottel : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ.. కథ మంచిదే.. కానీ కథనమే..

కూతురు చదువు కోసం తండ్రి చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటానికి ఊరి పొట్టేల్ కి లింక్ ఏంటి అని 80వ దశకంలో కథతో చూపించారు.

Pottel : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ.. కథ మంచిదే.. కానీ కథనమే..

Ananya Nagalla Ajay Pottel Movie Review and Rating

Updated On : October 25, 2024 / 7:34 AM IST

Pottel Movie Review : అనన్య నాగళ్ళ, యువచంద్ర, నోయల్, అజయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా పొట్టేల్. సురేష్ కుమార్, నిషాంక్ రెడ్డి నిర్మాణంలో సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పొట్టేల్ సినిమా నేడు అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. సినిమా సంగతేమో కానీ కొత్త కొత్త ప్రమోషన్స్ చేసి సినిమాను జనాల్లోకి అయితే బాగానే తీసుకెళ్లారు మూవీ టీమ్.

కథ విషయానికొస్తే.. 1980వ దశకంలో తెలంగాణ – మహారాష్ట్ర బోర్డర్ లో ఉండే గుర్రం గట్టు అనే ఓ గ్రామంలో ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు ప్రతి పన్నెండేళ్లకు ఓ పొట్టేల్ ని బలి ఇచ్చి జాతర చేయాలి. ఆ పొట్టేల్ ని ఊరి పశువుల కాపరి జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. అలా వంశపారంపర్యంగా పొట్టేల్ ని కాపాడే బాధ్యత నాన్న(ఛత్రపతి శేఖర్) చనిపోవడంతో పెద్ద గంగధారి(యువచంద్ర)కి వస్తుంది. ఇక ఆ ఊరి పటేల్ వంశంలో పటేల్ కి తరతరాలుగా బాలమ్మ పూనుతుంది. అయితే పటేల్(అజయ్) కి చిన్నప్పట్నుంచి బాలమ్మ పూనదు. కానీ గ్రామంలో తన ఆధిపత్యం చెలాయించడానికి, బలహీన వర్గాలను చదవకుండా చేయడానికి బాలమ్మ పూనినట్టు నాటకం ఆడతాడు పటేల్. ఇది గంగధారికి మాత్రమే తెలుసు. గంగధారి పటేల్ ఆడేది నాటకం అని ఊళ్ళో ఎవరికీ చెప్పినా నమ్మరు. బాలమ్మ పూనకం అడ్డుపెట్టుకొని పటేల్ బలహీన వర్గాలను ఎదగనీయకుండా గ్రామంలో అందరూ తన కిందే ఉండేలా చేసుకుంటాడు.

అయితే తన తమ్ముడు చదువు లేకపోవడం వల్లే చనిపోయాడని, తన చదువు కోసం తన తండ్రి చనిపోయాడని, చదువు చాలా ముఖ్యమని గంగధారి తన కూతురు(తనస్వి)ని ఎలాగైనా చదివించాలని పట్టుపడతాడు. ఆ ఊరి టీచర్ దుర్యోధన్(శ్రీకాంత్ అయ్యంగార్)కి ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చి కూతురుకి సీక్రెట్ గా చదువు చెప్పిస్తూ ఉంటాడు గంగధారి. ఈ విషయం తెలిసి గంగధారి జాగ్రత్తగా చూసుకుంటున్న ఆ ఊరి బాలమ్మ పొట్టేల్ ని జాతర దగ్గరికి వచ్చే సమయంలో పటేల్ మాయం చేస్తాడు. మరి బాలమ్మ పొట్టేల్ దొరికిందా? గంగధారి కూతురు చదువుకుంటుందని తెలిసి పటేల్ ఏం చేసాడు? గంగధారి తండ్రి, తమ్ముడు ఎలా చనిపోయారు? పటేల్ ఎందుకు బాలమ్మ పూనినట్టు నాటకం ఆడతాడు? గంగధారి భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ళ) తో ప్రేమ కథ, పెళ్లి సంగతి ఏంటి? కూతురి చదువు కోసం గంగధారి ఏం చేసాడు? బాలమ్మ పొట్టేల్ పోయిందని తెలిసి ఊరి ప్రజలు గంగధారిని ఏం చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Suriya – Balakrishna : బాల‌య్య బాబుతో సూర్య షూటింగ్ ఫినిష్‌..! అన్‌స్టాప‌బుల్‌లో సింహాతో సింగం

సినిమా విశ్లేషణ.. 1970, 80 దశకాల్లో తెలంగాణ గ్రామాల్లో ఉండే పటేల్ వ్యవస్థ, వాళ్ళు బలహీన వర్గాలను చదువుకోనివ్వలేదు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. చదువు చాలా ముఖ్యం అనే పాయింట్ మీద ఈ కథని నడిపించారు. కానీ ఆ పాయింట్ ని చెప్పడానికి సినిమాని చాలా హింసాత్మకంగా చూపించారు. ఎందుకు ఇంత హింస అనిపిస్తుంది జనాలకు. డైరెక్టర్ ఏదో తన అనుభవాలో, తనకున్న కోపమో చూపించడానికి తీసినట్టు ఉంటుంది సినిమా. ఇక సినిమా చాలా చాలా సాగదీశారు. కొన్ని చోట్ల నిరాశ, నీరసం కూడా వచ్చేస్తుంది చూసే ఆడియన్ కి. సినిమా అంటే లాజిక్స్ ఆలోచించకూడదు కానీ చిన్న చిన్న లాజిక్స్ కూడా వదిలేసారు. ఈ కథకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అవసరం లేకపోయినా డైరెక్టర్ తన తెలివితేటలు అని చెప్పుకోడానికి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడాడేమో అనిపిస్తుంది. నార్మల్ ఆడియన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఏ సీన్ ముందు జరిగింది, ఏ సీన్ తర్వాత జరిగింది అని కచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు.

కూతురు చదువు కోసం తండ్రి పోరాటం అని ఒక సింపుల్ లైన్ లో కథ బాగానే ఉన్నా చూపించడంలో మాత్రం దర్శకుడు చాలా తడబడ్డాడు. ఒకప్పుడు కొన్ని తెలంగాణ గ్రామాల్లో జరిగింది ఇదేనేమో అనే విధంగా దర్శకుడు చూపించడానికి ప్రయత్నం చేసాడు. ఓ వర్గానికో, ఓ ప్రాంతం వాళ్ళకో మాత్రం పొట్టేల్ సినిమా కథ పరంగా నచ్చొచ్చు ఏమో కానీ సినిమా పరంగా చూడటం కష్టమే. కుల వివక్ష, చదువుతో పాటు మూఢ నమ్మకాలు, దేవుడి పేరు చెప్పుకొని కొంతమంది చేసే మోసాలు, కులాంతర వివాహం వంటి అంశాలు కూడా చూపించారు. గతంలో కూడా కుల వివక్షపై, ఒకప్పటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చినా అవి స్క్రీన్ ప్లే పరంగా, అలాగే కొన్ని హై మూమెంట్స్ తో ఆసక్తిగా తెరకెక్కించారు. కానీ ఈ సినిమాలో ఆ ఆసక్తి, హై మూమెంట్స్ మిస్ అయ్యాయి. ఇక ఇటీవల వచ్చే సినిమాల్లో చివర్లో దేవుళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వచ్చి విలన్ ని చంపేయడం అనేది ఇందులో కూడా వాడుకున్నారు. సినిమాలో క్యారెక్టర్స్ ఎమోషనల్ అయినా, ఎమోషనల్ సీన్స్ ఉన్నా ప్రేక్షకులకు మాత్రం ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం కష్టమే. ఈ సినిమాకు ఏదైనా ప్లస్ ఉంది అంటే అది మేకింగ్, ఆర్టిస్టుల నటన మాత్రమే.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే అది యాక్టింగ్ మాత్రమే. అందరూ తమ యాక్టింగ్ తో అదరగొట్టేసారు. కొత్త హీరో యువచంద్ర అయితే ఓ గ్రామీణ యువకుడిగా, పశువుల కాపరిగా, కూతురి చదువు కోసం పోరాటం చేసే తండ్రిగా అదరగొట్టేసాడు. ఒక కొత్త హీరో ఇంత బాగా చేస్తాడా అనిపించేలా చేసాడు. పటేల్ పాత్రలో అజయ్ తన విశ్వరూపం చూపించాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన అజయ్ ఇందులో చాలా బాగా నటించి మెప్పించాడు.

బుజ్జమ్మ పాత్రలో అనన్య నాగళ్ళ కూడా మొదట క్యూట్ గా మెప్పించి ఆ తర్వాత భార్య పాత్రలో ఎమోషనల్ గా మెప్పిస్తుంది. అనన్య అన్న పాత్రలో నోయల్ శీను కూడా చాలా బాగా నటించాడు. చిన్న పాప తనస్వి కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించింది. టీచర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా అదరగొట్టేసారు. జీవన్, ప్రియాంక శర్మ, ఛత్రపతి శేఖర్, రియాజ్.. ఇలా మిగిలిన నటీనటులంతా వారి వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు మరో ప్లస్ ఆర్ట్ డిపార్ట్మెంట్. మంచి మంచి లొకేషన్స్ ని పట్టుకొని అప్పటి ఊరి సెటప్, చుట్టూ పరిసరాలు, వాడిన ప్రాపర్టీలు కూడా 1980 దశకంలా అనిపించేలా చాలా బాగా డిజైన్ చేసారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఓ మెయిన్ సన్నివేశంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో కాపీ కొట్టి దాన్ని మార్చినట్టు అనిపిస్తుంది. మంచి కథే అయినా కథనంలో మాత్రం చాలా తడబడ్డాడు దర్శకుడు. అవసర్లేని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, అక్కర్లేని హింసాత్మక సన్నివేశాలు జోడించి సాంకేతికంగా మాత్రం పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు సాహిత్ మోత్కూరి. ఇక నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా పొట్టేల్ సినిమా కూతురు చదువు కోసం తండ్రి చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటానికి ఊరి పొట్టేల్ కి లింక్ ఏంటి అని 80వ దశకంలో కథతో చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు..

 

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.