Rudramkota : రుద్రంకోట సినిమా రివ్యూ.. శ్మశానంలో పెరిగిన యువకుడి ప్రేమ కథ..
అనిల్ ఆర్కా(Anil Arka), విభీష, అలేఖ్య, సీనియర్ నటి జయలలిత(Jayalalitha) ముఖ్య పాత్రల్లో రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా నిర్మాణంలో తెరకెక్కిన సినిమా రుద్రంకోట

Anil Arka Jayalalitha Rudramkota Movie Review and Audience rating
Rudramkota Movie Review : అనిల్ ఆర్కా(Anil Arka), విభీష, అలేఖ్య, సీనియర్ నటి జయలలిత(Jayalalitha) ముఖ్య పాత్రల్లో రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా నిర్మాణంలో తెరకెక్కిన సినిమా రుద్రంకోట. ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి(Koti) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నేడు సెప్టెంబర్ 22న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. రుద్రంకోట ఊరిలో కోటమ్మ(సీనియర్ నటి జయలలిత)చెప్పిందే వేదం. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే.. స్త్రీలకు కూడా శిక్ష విధిస్తుంది. ఆ ఊరికి కాపాలాగా రుద్ర(అనిల్ ఆర్కా కండవల్లి) ఉంటాడు. ఆయన కళ్లుగప్పి ఎవరూ ఊరు దాటలేరు. కోటమ్మ తప్ప మిగతా ఏ మహిళను కూడా రుద్ర కన్నెత్తి చూడడు. మాట్లాడడు. స్మశానంలోనే ఉంటూ ఊరికి కాపాలా కాస్తుంటాడు. అదే ఊరికి చెందిన శక్తి(విభీష)కు రుద్ర అంటే చచ్చేంత ప్రేమ. పట్నం నుంచి ఊరికి వచ్చిన కోటమ్మ మనవరాలు ధృతి(అలేఖ్య) రుద్రపై మోజు పడుతుంది. కానీ రుద్ర ధృతి కోరికను తిరస్కరించడంతో అతనిపై పగ పెంచుకొని అంతు చూస్తానంటుంది. రుద్రని ప్రేమించే శక్తి ప్రేమ ఏమైంది? అసలు రుద్ర నేపథ్యం ఏంటి? అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? రుద్రపై పగ పెంచుకున్న ధృతి ఏం చేసింది? అనేది తెరపై చూడాల్సిందే.
శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి చిత్రమిది. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాము కోన. కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనేది ఈ చిత్రంలో చూపించారు. ఈ తరహా కథలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. శ్మశానంలో ఉండే హీరో పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. కొత్తవాడైనా ఆ పాత్రలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు అనిల్. కథనం మాత్రం అక్కడక్కడా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మొదటి హాఫ్ లో ముఖ్యమైన పాత్రలు, వాటి నేపథ్యాన్ని రొటీన్ సన్నివేశాలతో చూపించారు. సెకండాఫ్ మొదట్లో లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి మాత్రం కాస్త కలిగించారు.
Also Read : Agent Movie : ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అయ్యగారి ‘ఏజెంట్’.. ఎప్పుడు? ఎక్కడ?
శక్తి, రుద్ర మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు, అక్కడ కోటి గారు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. డైలాగ్స్ ఎక్కువగా ఉండవు, ఉన్నవి కూడా అంత కొత్తగా ఏమి ఉండవు. కోటమ్మ పాత్రకు సీనియర్ నటి జయలలిత న్యాయం చేశారు. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న ధృతి పాత్రని అలేఖ్య పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు 2.5 వరకు రేటింగ్ ఇవ్వొచ్చు. మొత్తంగా శ్మశానంలో ఉంది ఊరికి కాపలా కాసే ఓ కుర్రాడి కథ రుద్రంకోట.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే