Vaaradhi Review : ‘వారధి’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్..
అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన మూవీ వారధి.

Anil Arka Viharika Chowdary Vaaradhi Movie Review
అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన మూవీ వారధి. శ్రీ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై పెయ్యాల భారతి, ఎం.డి.యూనస్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు డిసెంబర్ 28 (శుక్రవారం)న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భార్యభర్తల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం అని పలు సందర్భాల్లో చిత్ర బృందం తెలిపింది. టీజర్, ట్రైలర్‌లతో అంచనాలను పెంచేసిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ విషయానికొస్తే..
చంద్రు (అనిల్ ఆర్కా), నక్షత్ర (విహరిక చౌదరి) లు పెళ్లి చేసుకుంటారు. సజావుగా వీరి కాపురం సాగుతూ ఉంటుంది. అయితే.. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. అదే సమయంలో వినయ్ (ప్రశాంత్)తో నక్షత్రకు పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. చంద్రు యాసిడ్ దాడికి గురి అవుతాడు. నక్షత్ర జీవితంలోకి ప్రవేశించిన నకిలీ వ్యక్తి ఎవరు ? ప్రమాదకర పరిస్థితిలో ఆమె ఎలా చిక్కుకుంటుంది? తిరిగి ఆమె భర్తకు దగ్గరైందా వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్..
హీరోగా చేసిన అనిల్ అర్కా తన నటనతో ఆకట్టుకున్నాడు. చంద్రు పాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు. నక్షత్ర పాత్రలో విహారిక చౌదరి ఒదిగిపోయింది. భావోద్వేగాల సహజంగా పలికించారు. ప్రతి నాయకుడు ప్రశాంత్ పాత్రలో నటించిన ప్రశాంత్ మడుగుల కఠినత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిధి కీలక పాత్రలో కథానుగుణంగా నటించింది.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అన్ని పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది. స్ర్కిప్ట్ ఈ సినిమాకు ప్రధాన బలం. దర్శకుడు, కథా రచయిత శ్రీకృష్ణ తాను చెప్పాలనుకున్న విషయాలను ఖచితత్వంతో చెప్పారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
విశ్లేషణ ..
దర్శకుడు శ్రీకృష్ణ తాను రాసుకున్న కథను తెరపై చూపించడంతో సక్సెస్ అయ్యాడు. ఈతరం యువ జంటలు చేసే తప్పులు, పొరబాట్లను చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు యువతను ఆకట్టుకుంటాయి. ఎమోషన్ సీన్లు కూడా చక్కగా పండాయి. ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందిస్తుంది.
రేటింగ్ : 2.5 / 5
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.