AP Nandi Awards : ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు.. సినిమా, టీవీ రంగాలకు.. అమరావతి, తిరుపతిలో.. ఎప్పుడంటే?
నేడు నంది అవార్డుల పై ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. (AP Nandi Awards)
ap nandi awards
AP Nandi Awards : ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గవర్నమెంట్ తరపున ఇచ్చే నంది అవార్డులు ఆపేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట గవర్నమెంట్ అవార్డులు సినిమా రంగానికి ఇస్తున్నారు. ఏపీలో కూడా నంది అవార్డులు ఇస్తామని ప్రచారం, చర్చలు జరగ్గా ఎట్టకేలకు ఇవ్వబోతున్నారు. నేడు నంది అవార్డుల పై ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
నంది అవార్డులపై ఎఫ్డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ.. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున – 2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్, టీవీ అవార్డులను అందించేందుకు నిర్ణయం తీసుకున్నాం. నంది ఫిల్మ్ అవార్డు ఈవెంట్ ని అమరావతి లేదా విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించాం. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా అందించేందుకు నిర్ణయించాం. ఈ అవార్డులన్నింటినీ డిసెంబర్ 2026లోగా ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : Nakshatra : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగమ్మాయి.. తెల్లకాగితం ఈవెంట్లో ‘నక్షత్ర’.. ఫొటోలు
అవార్డుల ఎంపిక ప్రక్రియ పై మాట్లాడుతూ.. అక్టోబర్లో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం. నవంబర్లో అవార్డుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తాం. డిసెంబర్లో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహిస్తాం.నంది ఫిల్మ్ అవార్డులలో.. సినిమాలు, జాతీయ సమైక్యతపై తీసిన సినిమాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై రచించిన ఉత్తమ రచనలు విభాగాల్లో అవార్డులు ఉంటాయి. ఫిల్మ్ విభాగంలో మొత్తం 46 అవార్డులను అందించనున్నాం. ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం అని ప్రకటించారు.
నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందిస్తాం. వివిధ కేటగిరీలలో 8 గోల్డ్ మెడల్స్ కూడా అందించనున్నాం. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డు పేరిట రూ.5 లక్షలు, బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు పేరిట రూ.2 లక్షలు, నాగిరెడ్డి–చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు పేరిట రూ.2 లక్షలు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు పేరిట రూ.2 లక్షలు ఇవ్వనున్నాం. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, సన్మాన పత్రంతో పాటు నగదు పారితోషికం అందిస్తాం అని తెలిపారు.
ఇక నంది టీవీ అవార్డుల్లో భాగంగా.. టెలి చిత్రాలు, టీవీ ఫీచర్స్, టీవీ మెగా సీరియల్స్, టీవీ డైలీ సీరియల్స్, టీవీ బాలల చిత్రాలు, టీవీ డాక్యుమెంటరీ చిత్రాలు, టీవీ సామాజిక సంబంధిత చిత్రాలు, టీవీ విద్యా విషయక చిత్రాలు తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం. టీవీ విభాగంలో కూడా మొత్తం 48 అవార్డులను అందించనున్నాం. ప్రథమ, ద్వితీయ ఉత్తమ టెలి ఫిల్మ్, టెలి ఫీచర్స్, మెగా టీవీ సీరియల్, డైలీ టీవీ సీరియల్, టీవీ బాలల చిత్రం తదితర విభాగాల్లో అవార్డులు అందిస్తాం. వీటిలో కూడా ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, హాస్య నటుడు, హాస్య నటి, ప్రతినాయకుడు, బాలల నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నాం. నంది టీవీ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసాపత్రం, నగదు పారితోషికం అందిస్తాం అని తెలిపారు.
