Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ రివ్యూ.. బోయపాటి మార్క్ సినిమాకు ప్రశాంత్ వర్మ టచ్..
ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రాస్తే బోయపాటి అసిస్టెంట్ అర్జున్ జంధ్యాల తెరకెక్కించాడు. దీంతో సినిమా బోయపాటి మార్క్ సినిమాకు ప్రశాంత్ వర్మ డివోషనల్ టచ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

Ashok Galla Devaki Nandana Vasudeva Movie Review and Rating
Devaki Nandana Vasudeva Movie Review : మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్ గా నటించగా దేవదత్త నాగ్ విలన్ రోల్ లో కనిపించారు. ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలకృష్ణ ఈ సినిమాని నిర్మించారు. నేడు నవంబర్ 22న దేవకీ నందన వాసుదేవ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. కంస రాజు( దేవదత్త)పూజలు, పునఃస్కారాలు, సాధువులు చెప్పింది నమ్ముతాడు. తన చెల్లికి పుట్టబోయే మూడో సంతానంతో తనకి ప్రాణగండం ఉందని తన చెల్లి(దేవయాని) మొదటిసారి కడుపు అయినప్పుడే ఆమె భర్తని చంపేసి చెల్లిని ఇంట్లోనే ఉంచుతాడు. కంసరాజు కొంతమందిని చంపడంతో అతనికి 21 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అదే సమయానికి కంసరాజు చెల్లి ఓ పాపకు జన్మనిస్తుంది.
21 ఏళ్ళ తర్వాత కృష్ణ(అశోక్ గళ్ళ) ఓ పెళ్ళిలో సత్యభామ(మానస వారణాసి)ని చూసి ప్రేమిస్తాడు. కొన్నాళ్ల పరిచయం తర్వాత ఇద్దరూ ప్రేమలో ఉంటారు. కంసరాజు జైలు నుంచి తిరిగొచ్చాక అనుకోకుండా కృష్ణ అతన్ని శత్రువుల నుంచి కాపాడతాడు. సత్యభామ కంసరాజు మేనకోడలు అని తెలుస్తుంది. కంసరాజు మాత్రం సత్యభామ పెళ్లి తన దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తి కొడుకు రంగ(శత్రు)తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కంసరాజు జైలు నుంచి వచ్చాడని తెలిసి అతని శత్రువులు అతన్ని చంపడానికి చూస్తుంటారు. సత్య – కృష్ణల ప్రేమ ఏమైంది? చెల్లెలికి ఒక్కటే కూతురు అయినప్పుడు కంసరాజుకు మరణం ఎలా వస్తుంది? కంసరాజు శత్రువులు ఏం చేసారు? కృష్ణకు కంసరాజుకి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథకు కృష్ణుడి విగ్రహానికి సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Mechanic Rocky : ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ.. చూపించే కథ ఒకటి.. మాట్లాడేది ఇంకోటి..
సినిమా విశ్లేషణ.. ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రాస్తే బోయపాటి అసిస్టెంట్ అర్జున్ జంధ్యాల తెరకెక్కించాడు. దీంతో సినిమా బోయపాటి మార్క్ సినిమాకు ప్రశాంత్ వర్మ డివోషనల్ టచ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇది చాలా రెగ్యులర్ కథే. కాకపోతే దాంట్లోకి సాధువులు, దేవుడు తీసుకొచ్చి ప్రశాంత్ వర్మ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. మన పురాణాల్లో కృష్ణుడు తన మామ కంసుడిని చంపుతాడు. కానీ ఇక్కడ పాత్రల పేర్ల ప్రకారం సత్యభామ మామయ్య కంసరాజుని కృష్ణుడు చంపాల్సి వస్తుంది. పాత్రల పరంగా చూస్తే కథనే మార్చేశారు. కథని ఏదో రాసుకొని పాత్రల పేర్లు మాత్రం ఇవి పెట్టుకున్నారు అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా విలన్ క్యారెక్టర్ గురించి, హీరో – హీరోయిన్ ప్రేమ చూపించి ఇంటర్వెల్ ముందు విలన్ జైలు నుంచి బయటకు రావడంతో పాటు ఓ ట్విస్ట్ ఇస్తారు. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా సాగదీతగా రెగ్యులర్ స్టోరీలా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ కంటిన్యూ చేస్తూ ఏమవుతుందా అనే ఆసక్తితో నడిపించారు. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఇచ్చినా సింపుల్ గా ముగించడంతో పాటు ప్రశాంత్ వర్మ డివోషనల్ టచ్ ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అశోక్ గల్లా మాత్రం బాగానే నటించాడు. డ్యాన్సులు మాత్రం అదరగొట్టాడు. కొన్ని ఫ్రేమ్స్ లో వాళ్ళ మామయ్య మహేష్ ని గుర్తుచేస్తాడు. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి క్యూట్ గా మెప్పిస్తునే నటనతో కూడా అలరిస్తుంది. దేవయాని, ఝాన్సీ ఇద్దరూ అమ్మ ఎమోషన్ తో ప్రేక్షకులని మెప్పిస్తారు. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడిగా నటించిన దేవదత్త ఈ సినిమాలో విలన్ గా పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఫ్యూచర్ లో తెలుగు సినిమాల్లో దేవదత్తకు మరిన్ని అవకాశాలు రావొచ్చు. గెటప్ శ్రీను, శత్రు.. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు.
సాంకేంతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సాంగ్స్ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. రెగ్యులర్ కథకు డివోషనల్ టచ్ ఇచ్చి ఓ చిన్న ట్విస్ట్ తో ప్రశాంత్ వర్మ రాయగా అర్జున్ జంధ్యాల మాత్రం పర్ఫెక్ట్ గానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా దేవకీ నందన వాసుదేవ రెగ్యులర్ కమర్షియల్ కథకు డివోషనల్ టచ్ ఇచ్చారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రేటింగ్ & రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.