Theppa Samudram : ‘తెప్ప సముద్రం’ మూవీ రివ్యూ.. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..

'తెప్ప సముద్రం' సినిమా ఆడపిల్లల మిస్సింగ్ కేసుని ఎలా చేధించారు అని సస్పెన్స్ థ్రిల్లింగ్ గా సాగుతుంది.

Theppa Samudram : ‘తెప్ప సముద్రం’ మూవీ రివ్యూ.. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..

Bigg Boss Arjun Ambati Theppa Samudram Movie Review and Rating

Theppa Samudram Movie Review : ప్రముఖ సీరియల్ నటుడు అర్జున్ అంబటి(Arjun Ambati) బిగ్‌బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అర్జున్ అంబటి హీరోగా ‘తెప్ప సముద్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిశోరి ధాత్రక్ హీరోయిన్ గా చైతన్య కృష్ణ, రవిశంకర్ ముఖ్య పాత్రల్లో సతీష్ రాపోలు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. తెప్ప సముద్రం మూవీ నేడు ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. తెప్ప సముద్రం అనే ఊళ్ళో అప్పుడప్పుడు అనుమానాస్పదంగా ఆడ పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. ఆ ఊరికి సంబంధించిన గణేష్(చైతన్య కృష్ణ) ఆ కేసుని సాల్వ్ చేసేందుకు అదే ఊరికి పోలీసాఫీసర్ గా వస్తాడు. విజయ్(అర్జున్ అంబటి) ఆ ఊళ్ళో అనాధగా పెరిగి ఆటో తోలుకుంటూ ఊళ్ళో అందరితో మంచిగా ఉంటాడు. విజయ్, అతని ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ ఊరి మిల్లు ఓనర్ గజ(చైతన్య దాత్రిక్) దగ్గర బియ్యం రవాణా చేస్తూ, పిల్లల్ని ఆటోలో స్కూల్ కి దించుతూ లైఫ్ ని సరదాగా గడిపేస్తూ ఉంటారు. విజయ్ అదే ఊరికి చెందిన ఇందు(కిశోరి ధాత్రక్)ని చిన్నప్పట్నుంచి ప్రేమిస్తూ ఉంటాడు కాని చెప్పడు. మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయిన చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు మళ్ళీ మొదలవుతాయి. మరోవైపు గజ బియ్యం అని చెప్పి విజయ్ కి తెలియకుండా గంజాయి రవాణా చేయిస్తాడు.

పోలీస్ గణేష్ పిల్లల కేసుని సాల్వ్ చేయాలని ఆటోలో పిల్లల్ని తీసుకెళ్తున్న విజయ్, అతని ఫ్రెండ్స్ ని అనుమానించి అదుపులోకి తీసుకుంటాడు. అదే టైంలో విజయ్ తరలిస్తున్న బియ్యంలో గంజాయి కూడా దొరుకుతుంది. గజ తనకి ఏం సంబంధం లేదని చెప్తాడు. గణేష్ వాళ్ళ నాన్న లాయర్ విశ్వనాధ్(రవిశంకర్) విజయ్, అతని ఫ్రెండ్స్ ని విడిపించడంతో విజయ్ గజని చంపడానికి ఆవేశంగా వెళ్తాడు. అక్కడ జరిగిన ఫైట్ లో గజ, అతని మనుషులు విజయ్, అతని ఫ్రెండ్స్ ని చంపేస్తారు. ఆ ముగ్గురు ఆత్మలుగా మారుతారు. అసలు ఆడ పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు? ఎవరు ఆ పని చేస్తున్నారు? ఈ ముగ్గురు గజపై పగ తీర్చుకున్నారా? గణేష్ కేసు సాల్వ్ చేశాడా? విజయ్ ప్రేమ ఇందుకి తెలుస్తుందా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Paarijatha Parvam Movie Review : ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ.. సినిమా వాళ్ళు కిడ్నాప్ చేస్తే..

సినిమా విశ్లేషణ.. గతంలో తెలంగాణలో ఓ ఊళ్ళో జరిగిన వరుస ఆడపిల్లల మిస్సింగ్ కేసుల నేపథ్యంలో కథని తీసుకున్నా దానికి కమర్షియల్ అంశాలు జోడించారు. ఫస్ట్ హాఫ్ అంతా విజయ్, ఇందుల ప్రేమ, ఆ ఊరి గురించి, గణేష్, లాయర్ విశ్వనాథ్ పాత్రల ఇంట్రడక్షన్ తోనే సరిపోతుంది. మళ్ళీ కొంతమంది ఆడపిల్లలు మిస్ అవ్వడంతో విజయ్, అతని ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేయడం, వీళ్ళని గజ చంపేయడం, ఇంటర్వెల్ కి వీళ్ళు ఆత్మలుగా మారిపోవడంతో సినిమా ఆసక్తిగా మారుతుంది. ఆత్మలు అయిన వాళ్ళు పగ ఎలా తీర్చుకుంటారా అని సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు పిల్లల్ని మిస్ చేసేది ఎవరు అనే కోణంలో సాగుతుంది ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నారు. ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ అంతా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తితోనే సాగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ దగ్గరే సినిమా కథ అయిపోయినా అక్కడ ఎండింగ్ ఏం ఇవ్వాలో తెలియక డైరెక్టర్ దానిని ఇంకొంచెం కథ రాసుకొని క్లైమాక్స్ మార్చినట్టు అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు సీరియల్స్ లో మెప్పించిన అర్జున్ అంబటి హీరోగా కూడా ఓకే అనిపించాడు. కిశోరి ధాత్రక్ హీరోయిన్ పాత్రలో మెప్పించింది. పోలీసాఫీసర్ గా గణేష్, లాయర్ గా రవిశంకర్.. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించారు. తాగుబోతు రాజమౌళి అక్కడక్కడా నవ్వించాడు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. ఒక పాట బాగుంటుంది. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్స్ ని డామినేట్ చేసినట్టు ఉంటుంది. VFX కూడా ఇంకొంచెం మంచిగా చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తగా రాసుకున్నాడు దర్శకుడు. దర్శకుడిగా సతీష్ రాపోలు బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్తంగా ‘తెప్ప సముద్రం’ సినిమా ఆడపిల్లల మిస్సింగ్ కేసుని ఎలా చేధించారు అని సస్పెన్స్ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.