తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై కేసు నమోదు

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ చిక్కుల్లో పడ్డారు. ద్రావిడ పితామహుడు, సంఘ సంస్కర్త.. పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన్న ఇబ్బందుల్లో పడేశాయి. జనవరి నెల 14 న జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన పెరియార్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ద్రావిడర్ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ప్రవేశం కోసమే రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్ విడుదలై కళగం అధ్యక్షుడు కొళత్తూర్ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనెల14న తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో రజనీ కాంత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్ సీతా రాముల ప్రతిమలను అభ్యంతరకరంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు. ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని…. ఈ వార్త ఒక తమిళ మ్యాగజైన్ లో మాత్రమే వచ్చిందని తెలిపారు.
అంతేకాక ‘ మురసోలి పత్రిక చేతిలో ఉంటే డీఎంకే పార్టీ కార్యకర్తగా పరిగణిస్తారని….అదే తుగ్లక్ పత్రిక ఉంటే మేధావి అంటారని కూడా రజనీ చెప్పుకొచ్చారు. ఆ సభలో రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలు పెరియార్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ద్రావిడర్ విడుదలై కళగం నేతలు మండిపడ్డారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.