Sharathulu Varthisthai : ‘షరతులు వర్తిస్తాయి’ రివ్యూ.. మధ్యతరగతి జీవితాల కథ..

'షరతులు వర్తిస్తాయి' సినిమా ఓ మధ్యతరగతి కుటుంబాల కథ. సాఫీగా సాగిపోతున్న మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బుల ఆశ రావడంతో వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది తెరపై చూడాలి.

Chaitanya Rao Bhoomi Shetty Sharathulu Varthisthai Movie Review and Rating

Sharathulu Varthisthai : చైతన్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి జంట‌గా కుమార‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు ఈ సినిమాని నిర్మించారు. నేడు మార్చ్ 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ముందు నుంచి కూడా ఇది సామాన్యుల కథ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ అంటూ ప్రమోట్ చేసారు.

కథ విషయానికొస్తే.. చిరంజీవి(చైతన్య రావు) నీటిపారుదల శాఖలో క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక మాములు మిడిల్ క్లాస్ వ్యక్తి. ఇంట్లో నాన్న లేకపోవడంతో తమ్ముడు, చెల్లి, అమ్మ ఇల్లు బాధ్యతని తనే చూసుకుంటాడు. విజయశాంతి(భూమిశెట్టి) ఓ స్టేషనరీ షాప్ లో పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య చిన్నప్పట్నుంచి స్నేహం ప్రేమగా మారుతుంది. వేరు కులాలు అయినా, విజయశాంతి తండ్రి ఒప్పుకోకపోయినా చిరంజీవి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుంటారు.

అదే సమయంలో ఆ ఏరియాలోకి చైన్ సిస్టమ్ లాంటి చిట్టీల బిజినెస్ వస్తుంది. మీరు కొంత డబ్బు కట్టి ఇంకో నలుగుర్ని జాయిన్ చేపిస్తే బోలెడు డబ్బులు వస్తాయని ఆ కంపెనీ ఆశ చూపిస్తుంది. ఆ ఏరియా పెద్దమనిషి, అందరికి సహాయంగా ఉంటూ కార్పొరేటర్ గా గెలవడానికి ప్రయత్నిస్తున్న శంకరన్నని ప్రమోషన్స్ కి వాడుకొని గోల్డెన్ ప్లేట్ అనే చిట్టీల కంపెనీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. చిరంజీవి ఇలాంటివి అన్ని బోగస్ అని ఎవరు ఎంత చెప్పినా కట్టడు. చిరంజీవి తన అప్పులు తీర్చేయడానికి, తన భార్యతో ఓ స్టేషనరీ షాప్ పెట్టించడానికి తాను కూడబెట్టిన డబ్బు తెచ్చి భార్యకి ఇస్తాడు. ఆ తర్వాత ఒకసారి ఫీల్డ్ వర్క్ పనిమీద చిరంజీవి బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వచ్చేస్తాడు. అదే సమయానికి తల్లి, భార్య చిట్టీల కంపెనీలో డబ్బులు పెట్టారని చిరంజీవికి తెలుస్తుంది. ఆ కంపెనీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తుంది. దీంతో చిరంజీవి కుటుంబంతో సహా ఆ ఏరియా వాసులంతా రోడ్డున మీద పడ్డట్టు అవుతారు.

మరి ఆ కంపెనీ ఎవరిది? అంత డబ్బు పోవడంతో చిరంజీవి ఏం చేసాడు? ఆ ఏరియా పెద్దమనిషి శంకరన్న ఏం చేసాడు? తనవల్ల డబ్బులు పోయాయనే బాధలో విజయశాంతి ఏం చేసింది? మరోవైపు కార్పొరేటర్ ఎన్నికల సంగతి ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Save The Tigers 2 Review : మగజాతి ఆణిముత్యాలు మళ్ళీ వచ్చేశారు.. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 రివ్యూ..

సినిమా విశ్లేషణ.. షరతులు వర్తిస్తాయి సినిమా యూనిట్ ముందు నుంచి చెప్తున్నట్టే ఇది మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథే. కష్టపడి పని చేస్తూ సాగుతున్న మిడిల్ క్లాస్ కుటుంబాల్లోకి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వాళ్ళని మోసం చేసి బోర్డు తిప్పేసి కంపెనీలు, వాటి వల్ల బాధపడ్డ కుటుంబాలు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా చిరంజీవి, విజయశాంతి ప్రేమ, వారి కుటుంబాలు, వారి చుట్టూ ఉన్న కుటుంబాల మిడిల్ క్లాస్ జీవితాలని చాలా చక్కగా మంచి ఎమోషన్ తో చూపిస్తూనే గోల్డెన్ ప్లేట్ అనే చిట్ కంపెనీ లాంటిది రావడం అందరూ ఎగబడి డబ్బులు కట్టడం చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకులని కంటతడి పెట్టేంత ఎమోషన్ ఉంది. ఇంటర్వెల్ కి కంపెనీ బోర్డు తిప్పేయడంతో వీళ్ళ పరిస్థితి ఏంటో అనే బాధతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచారు.

ఇక సెకండ్ హాఫ్ లో పోయిన డబ్బులు ఎలా కట్టించారు. కార్పొరేటర్ ఎన్నికలు, హీరో ఏం చేసాడు అని సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఎమోషన్ తో మెప్పించి సెకండ్ హాఫ్ మొదట్లో బానే ఉన్నా క్లైమాక్స్ మాత్రం చాలా సినిమాల్లో లాగే సోషల్ మీడియా వాడి చకచకా సీన్స్ వేసి, ఓ ట్విస్ట్ రివీల్ చేసి అయిపొయింది అనిపించారు. ఫస్ట్ హాఫ్ లో చూపించినంత మిడిల్ క్లాస్ రియాలిటీ సెకండ్ హాఫ్ లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాని రియల్ లొకేషన్స్ లో, చాలా రియాల్టీగా, తెలంగాణ నేటివిటీతో మన ఫ్యామిలీలు కూడా ఇలాగే ఉంటాయి కదా అన్నట్టు చూపించారు. అలాగే హీరో ఈ సినిమాలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నట్టు చూపించడంతో తెలంగాణలోని పలు జలయశయాలని కూడా చూపించడం గమనార్హం.

Also Read : Lambasingi Review : లంబసింగి మూవీ రివ్యూ.. పోలీస్ కానిస్టేబుల్‌కి, లేడీ నక్సలైట్‌కి మధ్య ప్రేమ కథ..

నటీనటుల విషయానికొస్తే.. ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని నడిపే వ్యక్తిగా చైతన్య రావు ఒదిగిపోయాడు. సినిమా అంతా తన భుజాలపై మోశాడు. భూమి శెట్టి కూడా ప్రేమికురాలిగా, మిడిల్ క్లాస్ గృహిణిగా మెప్పించింది. నందకిషోర్, రాధికా, వెంకీ, పెద్దింటి అశోక్.. ఇలా చాలా మంది నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక విషయాలు.. సినిమా అంతా రియల్ లొకేషన్స్ లో తీయడం విశేషం. కరీంనగర్, చుట్టు పక్కల ప్రాంతాల్లోనే సినిమా షూట్ అంతా చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఎమోషన్స్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటల్లో ఒక్క పెళ్లి సాంగ్ తప్ప మిగిలినవి యావరేజ్ అనిపిస్తాయి. చిట్టీ మోసాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల చుట్టూ కథ రాసుకోవడం, దాన్ని మంచి ఎమోషన్ తో నడిపించడం విశేషం. దర్శకుడిగా కుమార స్వామి మెప్పించారు.

మొత్తంగా ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ఓ మధ్యతరగతి కుటుంబాల కథ. సాఫీగా సాగిపోతున్న మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బుల ఆశ రావడంతో వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది తెరపై చూడాలి. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.