కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి, నాగార్జున

  • Publish Date - November 23, 2020 / 06:13 PM IST

KCR – Chiranjeevi: తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పలు అంశాలతో పాటు టాలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టిన కేసీఆర్ చిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.


థియేటర్ల యాజమాన్యం వారి అభ్యర్థన మేరకు, మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా గల సినిమా హాళ్లకు విద్యుత్ బిల్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. టాలీవుడ్‌కి కల్పించిన రాయితీలకు గానూ మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్ నాగార్జున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.‘‘కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం శ్రీ కేసీఆర్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి..


అలాగే మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకి ఎంతో తోడ్పాటుగా ఉంటాయి.


శ్రీ కేసీఆర్‌ గారి నేతృత్వంలో, ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిరు ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేసిన రామ్‌ చరణ్‌.. తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాలతో త్వరలోనే తెలుగు సినిమా పరిశ్రమ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు.