Satya Master : ఇంటి సమస్య బయటపడింది.. అందుకే మేం మాట్లాడుతున్నాం.. సత్య మాస్టర్ కామెంట్స్..
కొందరి వ్యవహారాల కారణంగా మొత్తం సంఘానికి సమస్యలు వస్తున్నాయని సత్య మాస్టర్ (Satya Master) ఆరోపించారు.
Dance Artists Association Row Satya Master comments
Satya Master : డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై సీనియర్ డాన్సర్లు, మాస్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌లో సుమారు 600 మంది డాన్సర్లు ఉండగా, కొందరి వ్యవహారాల కారణంగా మొత్తం సంఘానికి సమస్యలు వస్తున్నాయని సత్య మాస్టర్ ఆరోపించారు.
అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్‌లో అనేక సమస్యలు ఉన్నాయని, సంఘాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నందునే తాము మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఫెడరేషన్ తమకు తల్లి లాంటిదని, ఫెడరేషన్తో అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు.
సుమలత విభజించి పాలించడం వల్లే ప్రస్తుత సమస్యలు తలెత్తాయని సత్య మాస్టర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సభ్యుల నుంచి మైకులు లాక్కున్నారని, అధ్యక్షురాలిగా ఆమె వారిని నియంత్రించాల్సింది పోయి సమర్థించడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చాలా మంది డాన్సర్లు సమస్యలపై మాట్లాడేందుకే భయపడుతున్నారని, అందుకే సీనియర్లుగా తాము వారి తరఫున మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. యూనియన్‌కు సమస్య వచ్చినప్పుడు తాము తప్పకుండా స్పందిస్తామన్నారు. ఇటీవల జరిగిన బాడీ సమావేశంలో సుమలత మినిట్స్ బుక్ తీసుకునే ప్రయత్నం చేశారని, పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందనే ఉద్దేశంతో తాము అక్కడికి వెళ్లామన్నారు. అయితే.. ఆమె తమపై కేసులు పెట్టారని ఆరోపించారు.
సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నామని, డాన్సర్లకు న్యాయం జరగాలంటే ఎన్నికలు జరగాల్సిందేనని సత్య మాస్టర్ తెలిపారు.
రాజన్న మాస్టర్ మాట్లాడుతూ, సుమలత తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ డాన్సర్లు అక్టోబర్ 11న ఎన్నికలకు మద్దతు తెలిపారన్నాడు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై సుమలత చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని చెప్పారు.
