Ala Ninnu Cheri Review : ‘అలా నిన్ను చేరి’ ఎలా ఉంది..? థియేటర్స్ వద్ద మూవీ టాక్ ఏంటి..?

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అలా నిన్ను చేరి’ సినిమా ఎలా ఉంది..?

Ala Ninnu Cheri Review : ‘అలా నిన్ను చేరి’ ఎలా ఉంది..? థియేటర్స్ వద్ద మూవీ టాక్ ఏంటి..?

Dinesh Tej Hebah Patel Payal Radhakrishna Ala Ninnu Cheri movie review

Updated On : November 10, 2023 / 12:03 PM IST

Ala Ninnu Cheri Review : హుషారు, ప్లే బ్యాక్, మెరిసే మెరిసే సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ‘దినేష్ తేజ్’. ఈ యాక్టర్ నటించిన తాజా చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాని నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, హెబ్బా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. నేడు నవంబర్ 10న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే..
చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి (దినేష్ తేజ్) సినిమా డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటాడు. అలాంటి అబ్బాయి లైఫ్ లోకి హీరోయిన్ (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు తెలియకుండానే ప్రేమలో పడతారు, ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ తల్లి ఆల్రెడీ ఆమెకు ఒకరితో పెళ్లి ఫిక్స్ చేసుకొని ఉంటుంది. వీరిద్దరి ప్రేమ విషయం తెలియగానే హీరోయిన్ కి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధం చేస్తుంది. దీంతో హీరోయిన్, హీరో దగ్గరకి వచ్చి జరిగిన విషయం చెప్పి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ హీరో ఏమో డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ఉండడంతో.. ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో ఉంటాడు.

Ala Ninnu Cheri Review

ఇంతలో పెళ్లి పీటలు వరకు చేరడం, ఆ సమయంలో హీరో అండ్ పెళ్ళికొడుకు మనుషులు మధ్య ఫైట్ జరగడం, ఆ ఫైట్ లో గాయపడిన హీరో మూడు నెలలు కోమాలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. కోమా నుంచి బయటకి వచ్చాక.. హీరోయిన్ కి పెళ్లి అయ్యిపోయిందని తెలుసుకొని హైదరాబాద్ డైరెక్టర్ లక్ష్యం వైపు పయనం సాగిస్తాడు. ఈ ప్రయాణంలో ఎదురైన మరో అమ్మాయి (హెబ్బా పటేల్) ఎవరు..? అసలు హీరో ప్రేమించిన హీరోయిన్ ఏమైంది..? చివరికి హీరో డైరెక్టర్ అయ్యాడా..? అనేది థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా విశ్లేషణ..
గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో కథని కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ స్టోరీ సీన్స్, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ పెద్దగా ఏం లేదు. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి కొంచెం ల్యాగ్ అనిపించింది. అయితే మధ్యలో వచ్చే ఐటెం సాంగ్ కొంచెం ఊపు ఇచ్చేలా ఉంది.

Ala Ninnu Cheri Review

ఇక కథ మొత్తం 15 ఏళ్ళ క్రిందట జరుగుతుండడంతో కీప్యాడ్ ఫోన్స్ తో స్మార్ట్ టెక్నాలజీ లేని రోజులను చూపించారు. కాగా హీరో దినేష్ తేజ్, నటుడు శివ కుమార్ మధ్య వచ్చే గొడవలను సరిగ్గా చూపించలేదు. ఏదో ఆ సన్నివేశంలో ఫైట్ అవసరం కాబట్టి వారిద్దరి మధ్య గొడవ సీన్ చూపించినట్లు ఉంది. అలాగే కొన్ని కొటేషన్ డైలాగ్స్ షార్ట్ ఫిలిమ్స్ స్టైల్ లో ఉన్నట్లు అనిపించింది.

టెక్నికల్ అంశాలకు వస్తే..
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది.  స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ప్లస్ చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక లవ్ సాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్ బాగా ఆకట్టుకుంటున్నాయి.

నటీనటులు విషయానికి వస్తే..
మిడిల్ క్లాస్ అబ్బాయిగా, లక్ష్యం కోసం పోరాడే యువకుడిగా, ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేని ప్రేమికుడిగా దినేష్ తేజ్ మెప్పించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పాయల్ రాధాకృష్ణ తన అందాలతో, పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్ హెబ్బా పటేల్ మరింత అందాలు ఒలికిస్తూనే హీరోని మోటివేట్ చేసే పాత్రలో కనిపించారు. అలాగే హీరోయిన్ తల్లి పాత్రలో కంచు కనకమ్మగా ఝాన్సీ, కాసేపు విలన్ గా శత్రు మెప్పించారు. రంగస్థలం మహేష్, బాషా, అనశ్వి వారి మేరకు కామెడీ చేశారు.

రేటింగ్..
పాత ప్రేమ కథే అయినా చివరిలోని ఒక ట్విస్ట్ కొంచెం ఆకట్టుకునేలా ఉంటుంది. థియేటర్ లో ఒకసారి చూడొచ్చు. మొత్తం మీద ఈ సినిమాకు 2.75 రేటింగ్ వరకు ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..