సేవ్ నల్లమల : యురేనియం కోసం అడవిని బలి చేయొద్దు

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 11:43 AM IST
సేవ్ నల్లమల : యురేనియం కోసం అడవిని బలి చేయొద్దు

Updated On : August 27, 2019 / 11:43 AM IST

ద‌ట్ట‌మైన అడవుల సుంద‌ర‌మైన‌ న‌ల్ల‌మ‌లలో యురేనియం చిచ్చు ర‌గులుతోంది. నల్లమలను తవ్వడమంటే ప్రకృతి విధ్వంసానికి పాల్పడటమే. న‌ల్ల‌మ‌ల‌లో కురిసే ప్ర‌తీ వాన చినుకూ కృష్ణా న‌దిలోకి వెళుతుంది. ఒక‌వేళ యురేనియం త‌వ్వ‌కాలు జ‌రిపితే కృష్ణా న‌ది కూడా క‌లుషిత‌మ‌వుతుంద‌ని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం యురేనియం తవ్వకాలపై సోషల్ మీడియాలో ‘సేవ్ నల్లమల’ అనే పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌ చేస్తున్నారు. 
 
తాజాగా ప్రముఖ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల కూడా ఈ విషయంపై ట్విట్ చేస్తూ.. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది.

కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు.