Kaantha Review : ‘కాంత’ మూవీ రివ్యూ.. సినిమాలో సినిమా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..

'కాంత' మూవీ రివ్యూ.. సినిమాలో సిని(మా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..Kaantha ReviewKaantha Review)

Kaantha Review : ‘కాంత’ మూవీ రివ్యూ.. సినిమాలో సినిమా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..

Kaantha Review

Updated On : November 13, 2025 / 11:40 PM IST

Kaantha Review : దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. అయ్య(సముద్రఖని) ఓ డైరెక్టర్. అనాథ అయిన TK మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని తీసుకొచ్చి పెద్ద నటుడ్ని చేస్తాడు. కానీ మహదేవన్ కి తను స్టార్ అయ్యాను అనే అహంకారం వస్తుంది. వీరిద్దరూ మొదలుపెట్టిన, డైరెక్టర్ ఎంతో ఇష్టంగా రాసిన ఓ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది. ఓ సంఘటనతో వీరిద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు. ఓ సమయంలో గతంలో వీరిద్దరి కాంబోలో ఆగిపోయిన శాంత సినిమా మళ్ళీ మొదలవుతుంది. అయితే మహదేవన్ దాని క్లైమాక్స్ మార్చి, టైటిల్ కాంత అని పెట్టి సెట్ లో డైరెక్టర్ అయ్య ని పట్టించుకోకుండా తనే తీస్తుంటాడు.

ఈ సినిమాలో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెని కూడా అయ్య తీసుకువచ్చారు. కుమారి మహదేవన్ కి ఆల్రెడీ పెళ్లి అయిందని తెలిసినా ప్రేమించి అతనితో శారీరికంగా కూడా దగ్గరవుతుంది. సినిమా చివరి రోజు షూట్ లో డైరెక్టర్ – మహదేవన్ కి పెద్ద గొడవ అయి సినిమా షూట్ ఆగిపోతుంది. అదే రోజు రాత్రి కుమారి చనిపోతుంది. అసలు మహదేవన్ – డైరెక్టర్ అయ్య మధ్య గొడవ ఏంటి? వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడుకోవట్లేదు? డైరెక్టర్ తీయాలన్న శాంత కథేంటి? కుమారి ఎలా చనిపోయింది? ఎవరు చంపారు? పోలీసాఫీసర్ ఫీనిక్స్(రానా) ఈ కేసుని ఎలా డీల్ చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Love OTP Review : ‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ.. వామ్మో గర్ల్ ఫ్రెండ్ టార్చర్ మాములుగా లేదుగా..

సినిమా విశ్లేషణ..

1950 బ్యాక్ డ్రాప్ లో అప్పట్లో ఉన్న తమిళ్ స్టార్ హీరో ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవిత కథలో కొన్ని అంశాలను తీసుకొని ఓ కల్పిత కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఓ డైరెక్టర్ ఏమి లేని ఓ అబ్బాయిని తీసుకొచ్చి స్టార్ ని చేసి పలు సంఘటనలతో వీరిద్దరి మధ్య దూరం పెరిగితే ఈగో, అహంకారంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? వీరిద్దరి మధ్య హీరోయిన్ కుమారి ఎలా నలిగింది అనే కథతో ఈ కాంత సినిమాని తెరకెక్కించారు.

ఫస్ట్ హాఫ్ అంతా సినిమా షూటింగ్, డైరెక్టర్ – హీరో మధ్య విబేధాలు, అసలు వీళ్లిద్దరి కథేంటి అనే పాయింట్స్ తో పాటు హీరో – హీరోయిన్ ప్రేమకథతో సింపుల్ గా అక్కడక్కడా ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి కుమారి మరణంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ రానా పోలీసాఫీసర్ గా వచ్చి హంతకుడు ఎవరు అనేది ఎలా కనిపెట్టారు అని సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ లా సాగుతుంది. మొదట్నుంచి సినిమా సీరియస్ గా సాగినా రానా వచ్చాక కాస్త అక్కడక్కడా డైలాగ్స్ తో నవ్వించారు.

హంతకుడు ఎవరు అనేది మనం గెస్ చేసేయొచ్చు. కానీ ఎందుకు అనేది ఆసక్తిగా రాసుకున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. అవి ఊహించలేము. దుల్కర్ గతంలో మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు మహానటిని గుర్తకు తెస్తాయి. 1950లో సినిమాలు, అప్పటి మనుషులు, సెట్స్, అప్పటి సినిమా షూటింగ్స్.. అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చూసుకున్నారు. అయితే ఈ సినిమా కేవలం క్లాస్ సినిమాలు చూసే ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కాంత కి రావద్దు. ఒక పాత సినిమా చూసిన అనుభవం రావాలంటే చూడొచ్చు. డైలాగ్స్ అన్ని అచ్చ తెలుగులో స్పష్టంగా చాలా బాగా రాసుకున్నారు.

Kaantha Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోర్సే, సముద్రఖని ఒకరికొకరు పోటీ పడి మరీ నటించారు. దుల్కర్ ఎంత గ్రేట్ యాక్టర్ అనేది ఆల్రెడీ నిరూపించుకున్నాడు. మరోసారి ఈ కాంత సినిమాతో 1950 లో నటులు ఎలా ఉండేవాళ్ళు, సినిమాలో సినిమా కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు తన నటనతో అదరగొట్టేసాడు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో అందాల ప్రదర్శన చేసిన భాగ్యశ్రీ భోర్సే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో, హావభావాలతో చాలా బాగా మెప్పించింది. అప్పట్లో హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళో అదే లుక్స్ లో కనిపించి అలరించింది.

సీనియర్ నటుడు సముద్రఖని మరోసారి తన నటనతో మెప్పించారు. రానా పోలీసాఫీసర్ గా బాగానే నటించినా కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Yenugu Thondam Ghatikachalam : 25 ఏళ్ళ యువతి 64 ఏళ్ళ ముసలోడు.. శోభనం రాత్రి బిగ్ ట్విస్ట్.. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రివ్యూ..

సాంకేతిక అంశాలు.. ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి. ఒక్కో ఫ్రేమ్ చూడటానికి పాత సినిమాలు చూసినట్టే అందంగా ఉంది. సినిమాలో సినిమా షూటింగ్, సినిమా రీల్స్ ప్లే చేయడం ప్రతి ఫ్రేమ్ వేరియేషన్ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. సస్పెన్స్, లవ్, సీరియస్ నెస్.. అన్ని కలగలిపి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. రిపీటెడ్ మోడ్ లో వినొచ్చు.

ఎడిటింగ్ కి ఇంకాస్త పనిచెప్పి చాలా సీన్స్ షార్ప్ కట్ చేస్తే బాగుండేది. కథ కొత్తది తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గానే రాసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూసినట్టు ఉంటుంది. దర్శకుడు సాంకేతకంగా మాత్రం సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలంకు చెందిన సెట్స్, సెటప్ చాలా బాగా డిజైన్ చేసారు.

మొత్తంగా ‘కాంత’ సినిమా ఓ హీరో – డైరెక్టర్ మధ్య ఈగో, అహంకారంతో వచ్చే సమస్యలు, వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగింది అని సస్పెన్స్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమాకు రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.