Love OTP Review : ‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ.. వామ్మో గర్ల్ ఫ్రెండ్ టార్చర్ మాములుగా లేదుగా..

లవ్ ఓటీపీ సినిమా నవంబర్ 14న కన్నడ, తెలుగులో రిలీజవుతుంది. (Love OTP Review)

Love OTP Review : ‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ.. వామ్మో గర్ల్ ఫ్రెండ్ టార్చర్ మాములుగా లేదుగా..

Love OTP Review

Updated On : November 13, 2025 / 1:21 PM IST

Love OTP Review : అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘లవ్ ఓటీపీ’. శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ ఎం రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. జాన్విక, ఆరోహి నారాయణ్ హీరోయిన్స్ గా రాజీవ్ కనకాల, ప్రమోదిని, నాట్యరంగ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన లవ్ ఓటీపీ సినిమా నవంబర్ 14న కన్నడ, తెలుగులో రిలీజవుతుంది. ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.(Love OTP Review)

కథ విషయానికొస్తే.. కాలేజీలో ఉన్నప్పుడు అక్షయ్(అనీష్)ని చూసి సన(ఆరోహి నారాయణ్)ఇష్టపడుతుంది. అనీష్ కి క్రికెటర్ అవ్వాలని గోల్. అనీష్ తండ్రి(రాజీవ్ కనకాల) ఒక పోలీసాఫీసర్. అతనికి లవ్ అంటే అస్సలు పడదు. లవ్ కేసులను స్పెషల్ గా తీసుకుంటాడు. తండ్రి అంటే అక్షయ్ కి చాలా భయం. అందుకే ఎవర్ని లవ్ చేయడు. సన మొదట ఫ్రెండ్ అని చెప్పి అక్షయ్ లైఫ్ లోకి వచ్చి బాగా దగ్గరయి ప్రపోజ్ చేస్తుంది. ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తోంది. దీంతో తప్పక సన లవ్ ని ఒప్పుకుంటాడు అక్షయ్.

అక్కడ్నుంచి సన అక్షయ్ కి చుక్కలు చూపిస్తుంది. అనుమానం, ఎక్కువ ప్రేమ, గొడవ అయితే కళ్ళు తిరిగి పడిపోవడం.. ఇలా రకరకాలుగా అనీష్ ని టార్చర్ పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ లో తనకు దెబ్బ తగిలినప్ప్పుడు ఫిజియోథెరఫిస్ట్ నక్షత్ర(జాన్విక)పరిచయం అవుతుంది. నక్షత్ర నచ్చి తనతో ప్రేమలో పడతాడు అక్షయ్. సన వల్ల పడుతున్న బాధల గురించి చెప్పడంతో నక్షత్ర కూడా లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రెండు ప్రేమలను ఒకేసారి డీల్ చేస్తూ తన తండ్రికి తెలియకుండా అక్షయ్ కష్టాలు పడుతూ ఉంటాడు. నక్షత్రతో అక్షయ్ ప్రేమాయణం తెలిసి సన ఏం చేస్తుంది? చివరకు అక్షయ్ ఎవరితో ఉంటాడు? తన తండ్రికి ప్రేమ విషయం చెప్తాడా? లవ్ లో అక్షయ్ పడ్డ బాధలేంటి ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Jigris Review : ‘జిగ్రీస్’ మూవీ రివ్యూ.. హీరోయిన్ లేకుండానే సినిమా.. సందీప్ వంగ ఫ్రెండ్ తీసిన సినిమా ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ..

లవ్ లో ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఎలా విసిగిస్తుంది, టార్చర్ చేస్తుంది అని గతంలో అనేక సినిమాల్లో చూసాం. ఈ లవ్ ఓటీపీ కూడా అలాంటింది. అయితే ఆ టార్చర్ అంతా కామెడీగా చూపించారు. గర్ల్ ఫ్రెండ్ పెట్టే టార్చర్ కి మనకు ఫుల్ గా నవ్వొస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అక్షయ్ పాత్ర, సనతో లవ్ స్టోరీతోనే సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వరకు వీళ్ళ లవ్ స్టోరీ, మధ్యలో హీరో ఫ్రెండ్ కామెడీతో ఫుల్ గా నవ్వుకుంటాం. ఇంటర్వెల్ ముందు నక్షత్ర అక్షయ్ లైఫ్ లోకి వచ్చాక ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఈ విషయం సనకి తెలియడంతో ఏం చేస్తుంది అనే ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచారు.

సెకండ్ హాఫ్ లో రెండు ప్రేమలు ఒకేసారి నడిపే సీన్స్ బాగుంటాయి. అలాగే సెకండ్ హాఫ్ మొదలయిన 20 నిమిషాల నుంచి కథ ఎమోషనల్ గా మారిపోతుంది. సనని వదిలేయలేక నక్షత్రతో ఫుల్ ప్రేమలో ఉండలేక నలిగిపోతూ అక్షయ్ బాధపడుతూ ఉంటాడు. సన, నక్షత్రతో ఎవరితో ఉంటాడు అని సెకండ్ హాఫ్ మొదట్లోనే క్లారిటీ ఇచ్చేస్తారు. అయితే ఈ సినిమాకు క్లైమాక్స్ ముందు వరకు పాజిటివ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. సినిమా కథకు, అప్పటివరకు సాగిన కథనంపై అదే కరెక్ట్. కానీ అక్కడితో సినిమా ఆపేయకుండా ఇంకా సాగదీసి మళ్ళీ బాధాకరమైన క్లైమాక్స్ తో ముగించడం గమనార్హం.

దీంతో ఈ సాగదీత ఎందుకు అనిపిస్తుంది. సినిమా అంతా కామెడీ, మంచి లవ్ ఎమోషన్ తో నడిపించి చివర్లో చెడగొట్టారు అనే ఫీలింగ్ వస్తుంది. టైటిల్ లో లవ్ OTP అంటే ఓవర్ – టార్చర్ – ప్రెజర్ అని పెట్టి దానికి తగ్గట్టే సినిమాని నడిపించారు. ఇక సినిమా కథ అంతా బెంగుళూరులోనే జరుగుతుంది. కన్నడ వాళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళని పెట్టుకొని ఈ సినిమా తీశారు. తెలుగు డబ్బింగ్ లో కూడా చాలా వరకు కన్నడలోనే డైలాగ్స్ ఉండటంతో కన్నడ సినిమా చూస్తున్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది. అక్కడక్కడా కొంత రొమాన్స్ కూడా ఉంది. ఎవరూ తెలియని కొత్తవాళ్లతో తీసినా ఈ సినిమా బాగానే ఉన్నా, ప్రమోషన్స్ ఇంకొంచెం చేస్తే జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

Love OTP Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఓ పక్కన డైరెక్షన్ చేస్తూనే మరో పక్క హీరోగా అనీష్ తన పర్ఫార్మెన్స్ తో బాగానే మెప్పించాడు. ఫ్రస్టేషన్ తో గర్ల్ ఫ్రెండ్ చేతిలో నలిగిపోయే అబ్బాయి పాత్రలో బాగానే మెప్పించాడు అనీష్. ఇక బాయ్ ఫ్రెండ్ ని టార్చర్ పెట్టే పాత్రలో ఆరోహి నారాయణ్ ఫుల్ యాక్టివ్ గా నటించింది కానీ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది.

ఇక క్యూట్ గా కనిపించే ఫిజియోథెరఫిస్ట్ పాత్రలో జాన్విక బాగా మెప్పించింది. ఇద్దరు హీరోయిన్స్ ఎమోషనల్ సీన్స్ లో కూడా చక్కగా నటించారు. రాజీవ్ కనకాల పోలీసపాత్రలో ఫుల్ గా నవ్వించారు. ఫ్రెండ్ పాత్రలో నటించిన నాట్య రంగ ఫుల్ గా నవ్విస్తూనే చివర్లో ఎమోషనల్ చేస్తాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Yenugu Thondam Ghatikachalam : 25 ఏళ్ళ యువతి 64 ఏళ్ళ ముసలోడు.. శోభనం రాత్రి బిగ్ ట్విస్ట్.. ‘ఏనుగుతొండం ఘటికాచలం’ రివ్యూ..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సాంగ్స్ యావరేజ్. డబ్బింగ్ లో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. కథ పాతదే అయినా కథనం కొత్తగా నడిపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఎడిటింగ్ లో క్లైమాక్స్ మారిస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘లవ్ OTP’ సినిమా ప్రేమలో గర్ల్ ఫ్రెండ్ పెట్టే టార్చర్ తో ఇబ్బంది పడిన అబ్బాయి ఏం చేసాడు అని కామెడీ ఎమోషన్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.