గూగుల్ డూడుల్‌లో బామ్మ ఎవరో తెలుసా? ఆమె కథ ఇదే!

  • Published By: vamsi ,Published On : September 29, 2020 / 02:46 PM IST
గూగుల్ డూడుల్‌లో బామ్మ ఎవరో తెలుసా? ఆమె కథ ఇదే!

Updated On : September 29, 2020 / 2:54 PM IST

గొప్పవారిని గుర్తు చేసుకుంటూ… అప్పుడప్పుడూ గూగుల్ తన డూడుల్‌లో ప్రత్యేక సందర్భంగా వారి ఫోటోలను పెట్టడం గమనిస్తూ ఉంటాం.. దీనిని వారికి ఇచ్చే గౌరవంగా ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే గూగుల్ ఇవాళ(29 సెప్టెంబర్ 2020) భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నటి, నర్తకి జోహ్రా సెహగల్ ఫోటోను డూడుల్‌గా పెట్టి గుర్తు చేసుకుంది.

జోహ్రా సెహగల్ డూడుల్ పెట్టి ఆమెను గుర్తు చేసింది గూగుల్. కొరియోగ్రాఫర్‌‍గా అంతర్జాతీయ వేదికలలో గుర్తింపు పొందిన భారతదేశపు తొలి మహిళా కళాకారిణి ఆమె. గూగుల్ శాస్త్రీయ నృత్య భంగిమలో ఆమె చిత్రాన్ని డూడుల్‌గా తయారు చేసి, చుట్టూ రంగురంగుల పూలతో అలంకరించింది. జోహ్రా సెహగల్‌పై తయారు చేసిన ఈ ప్రత్యేక డూడుల్‌ను ఆర్టిస్ట్ పార్వతి పిళ్ళై రూపొందించారు.

గూగుల్ డూడుల్ బ్లాగ్‌లో.. “నేటి డూడుల్ ఆర్టిస్ట్ పార్వతి పిళ్ళై దిగ్గజ భారతీయ నటి మరియు నర్తకి జోహ్రా సెహగల్ పై రూపొందించబడింది. అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళ, నటి ఆమె. జోహ్రా నటించిన ‘నీచా నగర్’ మూవీ 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. దేశం దాటి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి సినిమా ఇదే. ‘నీచా నగర్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత గౌరవం, పామ్ డి ఓర్ బహుమతిని అందుకుంది.”

జోహ్రా సెహగల్ ఏప్రిల్ 27, 1912 న ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లోని ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె ఏడుగురు పిల్లలలో మూడవ సంతానంగా జన్మించింది. ఈమె తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తన తల్లి కోరికలకు అనుగుణంగా ఈమె, తన సోదరి లాహోర్లోని క్వీన్ మేరీ కాలేజీలో చదివారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత ఎడిన్బర్గ్‌లో ఒక బ్రిటిష్ నటుడి దగ్గర అప్రెంటిస్ చేసింది.

ఆమె పూర్తి పేరు షహిబ్జాది జోహ్రా బేగమ్ ముంజాత్ ఉల్లా ఖాన్. డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించినా.. తర్వాత బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా బీబీసీ టెలివిజన్ షోలలోనూ ఆమె కనిపించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేశంలో తొలితరం కళాకారులలో జోహ్రా సెహగల్ ఒకరు. 1998 లో పద్మశ్రీ, 2001 లో కాళిదాస్ సమ్మన్, 2004 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డు, 2010 లో పద్మ విభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్నారు.

ఈమె ఆగష్టు 14, 1942 న కామేశ్వర్ సెహగల్ అనే హిందువును వివాహం చేసుకుంది. వీళ్లకు కు ఇద్దరు పిల్లలు కిరణ్ సెగల్, పవన్ సెహగల్. పవన్ సెహగల్ WHOలో పనిచేస్తున్నారు. కిరణ్ సెగల్ ఒడిస్సి నర్తకి. 2012 లో, ఈమె జీవిత చరిత్రను తన కుమార్తె కిరణ్ సెగల్ “జోహ్రా సెహగల్: ఫ్యాటీ” పేరుతో రాశారు.
నిండు నూరేళ్లు జీవించిన జోహ్రా … తన 102వ ఏట 2014లో తుదిశ్వాస విడిచారు.