మన పక్కింటి కుర్రాడే ‘నేచురల్ స్టార్’ – హ్యాపీ బర్త్‌డే నాని

ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు..

  • Published By: sekhar ,Published On : February 24, 2020 / 10:39 AM IST
మన పక్కింటి కుర్రాడే ‘నేచురల్ స్టార్’ – హ్యాపీ బర్త్‌డే నాని

Updated On : February 24, 2020 / 10:39 AM IST

ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు..

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 24).. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి రేడియో జాకీగా ఆపై హీరోగా టర్న్ అయ్యి.. విభిన్నకథాంశాలతో సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి సహజసిద్ధమైన నటనతో, మన పక్కింటి కుర్రాడే అనే భావన కలుగచేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమాన గణాన్నీ సంపాదించుకుని నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం..

హైదరాబాద్ పోరడే..
1984 ఫిబ్రవరి 24న జన్మించిన నాని పెరిగింది హైదరాబాద్‌లోనే. పాఠశాల విద్యాభ్యాసం సెయింట్ అల్ఫోన్సాస్ హై స్కూల్‌లో జరిగింది. ఆ తరువాత ఎస్.ఆర్.నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో చదివారు. ఆ తరువాత డిగ్రీ కోసం వెస్లీ కాలేజీలో చేరాడు.

మణిరత్నం సినిమాలంటే మస్త్ ఇష్టం..
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం సినిమాల ప్రభావం నానిపై ఎక్కువగా పడింది. దాంతో, సినిమాలు చూడడం నానికి బాగా అలవాటైంది. మొదట దర్శకుడు కావాలని అనుకుని.. దూరపు బంధువు అయిన నిర్మాత అనిల్ కుమార్ కోనేరు ‘రాధా గోపాలం’ సినిమాకు క్లాప్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ‘అల్లరి బుల్లోడు’, ‘ఢీ’, ‘అస్త్రం’ సినిమాలకు కూడా నాని తెర వెనుక పనిచేసిన నాని, ఆ తరువాత సినిమా స్క్రిప్ట్‌పై వర్క్ చేయడానికి కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకొన్నాడు. నాని స్నేహితురాలు నందిని రెడ్డి అప్పట్లో వరల్డ్ స్పేస్ శాటిలైట్‌కి రేడియో జాకీగా వర్క్ చేసేవారు. స్నేహంతో నానికి కూడా ఆర్జేగా అవకాశం ఇప్పించారు నందిని రెడ్డి. ఒక సంవత్సరం పాటు ‘నాన్ స్టాప్ నాని’ పేరుతో ఓ ప్రోగ్రాంని నిర్వహించి లిజనర్స్‌ను ఆకట్టుకున్నాడు నాని.

NANI

‘అష్టాచమ్మా’తో ‘అలా మొదలైంది’..
నానిని ఒక ప్రకటనలో చూసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన ‘అష్టాచమ్మా’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కలర్స్ స్వాతి కూడా నటించారు. ‘అష్టా చమ్మా’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అలాగే నాని నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. రెండవ సినిమా ‘రైడ్’లో తనీష్, శ్వేతా బసు ప్రసాద్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు నాని. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘అలా మొదలైంది’ నాని కెరీర్‌ను మలుపుతిప్పింది. తర్వాత ‘పిల్లజమీందార్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి సినిమాలతోనూ ఆకట్టుకున్నాడు. 

‘ఈగ’ గానూ ఇరగదీశాడు..
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమాలో లవర్ బాయ్‌గా నాని నటనకు మంచి పేరొచ్చింది. చిన్న పాత్రే అయినా నాని తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. హిందీ, మలయాళంలో కూడా ఈ సినిమా డబ్ అవడం విశేషం.
నిర్మాతగా నాని..
‘డి ఫర్ దోపిడి’ సినిమాతో నాని నిర్మాతగా మారాడు. తర్వాత వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి ‘అ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. నాని నిర్మించిన ‘హిట్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.

వరుస సినిమాలు.. హ్యాట్రిక్ హిట్స్..
‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘పైసా’, ‘జండాపై కపిరాజు’, ‘భలే భలే మొగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’, ‘జెంటిల్ మెన్’, ‘మజ్ను’, ‘నేను లోకల్’, ‘నిన్ను కోరి’, ‘MCA’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలలో నటించి మెప్పించిన నాని ప్రస్తుతం ‘వి’, ‘టక్ జగదీష్’, తో పాటు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

NANI BIRTHDAY