Tuk Tuk : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ.. భలే క్యూట్ గా ఉందే సినిమా..
ఈ సినిమా అంతా ఆ మూడు చక్రాల బండి మీదే ఎక్కువగా నడిపించారు.

Harsh Roshan Karthikeyaa Dev Saanvee Megghana Tuk Tuk Movie Review and Rating Here
Tuk Tuk Movie Review : హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘టుక్ టుక్’. చిత్రవాహిని ప్రొడక్షన్స్, RYG సినిమాస్ బ్యానర్స్ పై రాహుల్ రెడ్డి నిర్మాతగా సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టుక్ టుక్ నేడు మార్చ్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. ఓ పల్లెటూళ్ళో ముగ్గురు టీనేజర్లు(హర్ష్ రోషన్, కార్తీక్ దేవ్, స్టీవెన్ మధు) కెమెరా కొనడానికి డబ్బులు ట్రై చేస్తారు. వినాయకచవితి చందాలు వసూలు చేసి, బొమ్మ పెట్టి మిగిలినవి తీసుకోండి అని ఐడియా చెప్పడంతో అదే చేస్తారు ఈ ముగ్గురు. అయితే ఆ ఊళ్ళో ఉన్న ఇద్దరు మధ్య గొడవల వల్ల వినాయకుడిని వీళ్ళ సొంత బండిలో ఊరేగించి తీసుకెళ్లాలి. వీళ్ళ దగ్గర ఓ పాత స్కూటర్ ఉంటే దాన్ని మూడు చక్రాల బండి(టుక్ టుక్)గా మార్చి నిమజ్జనం చేస్తారు.
ఆ తెల్లారి నుంచి బండి అదే కదలడం, అదే నడవడం చేస్తుంది. వీళ్ళు అడిగే ప్రశ్నలకు అవును, కాదు అని హ్యాండిల్ అటు ఇటు ఊపుతూ సమాధానాలు ఇస్తుంది. దీంతో మొదట దేవుడు అనుకోని ఊళ్ళో అందరికి చూపించి, ప్రశ్నలు అడిగించి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఆ టుక్ టుక్ లో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. దీంతో ఆ ముగ్గురు భయపడతారు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? స్కూటర్ లో ఎందుకు ఉంది? మధ్యలో శిల్ప – నవీన్ స్టోరీ ఏంటి? అసలు ఈ కుర్రాళ్లకు డబ్బులు ఎందుకు? స్కూటర్ లో ఆత్మ ఉందని తెలిసాక కుర్రాళ్ళు ఏం చేసారు.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Ram Gopal Varma : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు..
సినిమా విశ్లేషణ.. వెహికల్స్ వాటంతట అవే ఆపరేట్ అవ్వడం గతంలో చాలా సినిమాల్లో చూసాం. టుక్ టుక్ అంటే మూడు చక్రాల బండి అని. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఓ పది పదిహేనేళ్ల క్రితం కథగా చూపించారు. ఈ సినిమా అంతా ఆ మూడు చక్రాల బండి మీదే ఎక్కువగా నడిపించారు.
ఫస్ట్ హాఫ్ లో డబ్బులకోసం వినాయకచవితి, నిమజ్జనం కోసం బండి తయారుచేయడం చేసి, అది దానంతట అదే ఆపరేట్ అవ్వడంతో దేవుడు అని చెప్పి డబ్బులు సంపాదించడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అది ఆత్మ అని తెలిసి ఈ కుర్రాళ్ళు భయపడటం, ఆ ఆత్మ ఎవరు, దాని కథ ఏంటి, దానికి వీళ్ళు ఎలా హెల్ప్ చేసారు అని సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ సరదాగా అక్కడక్కడా కామెడీతో, టుక్ టుక్ చేసే విన్యాసాలతో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ స్టోరీ మాత్రం బాగా సాగదీశారు. సినిమా మొదట్నుంచి చూపిస్తున్న ఓ నెగిటివ్ పాయింట్ కి సెకండ్ హాఫ్ లో దానికి కనెక్ట్ చేసి ఓ మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే సినిమాలో చాలా సందేహాలు రావడం గ్యారెంటీ. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే సినిమా పూర్తి చేసేశారు. ఆ టుక్ టుక్ చేసే విన్యాసాలు, అది కుర్రాళ్లతో కమ్యూనికేట్ అయ్యే విధానం అంతా క్యూట్ గా ఉంటుంది. పిల్లలకు సినిమాలో టుక్ టుక్ ఉన్న సీన్స్ అన్ని బాగానే కనెక్ట్ అవుతాయి. చివర్లో మళ్ళీ ఓ క్యూట్ క్లైమాక్స్ ఇచ్చి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో మెయిన్ ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు. కోర్ట్ సినిమాతో ఇటీవలే హిట్ కొట్టిన హార్ష్ రోషన్, సలార్ లో పృథ్విరాజ్ చైల్డ్ పాత్ర చేసిన కార్తికేయ దేవ్, సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న స్టీవెన్ మధు .. ఈ ముగ్గురే సినిమా అంతా నడిపించారు. ఒక్క లవ్ స్టోరీలో తప్ప సినిమా అంతా ప్రతి ఫ్రేమ్ లోను కనిపించి మంచి ఎనర్జీతో నటించారు. శాన్వి మేఘన చాలా క్యూట్ గా, అందంగా కాసేపే కనిపించినా తన క్యూట్ నెస్ తో స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. నిహాల్ కోదాటి కూడా తన నటనతో మెప్పిస్తాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Rana Daggubati: రానాపై కేసు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్ అన్ని రియల్ లొకేషన్స్ లో పచ్చని బ్యాక్ గ్రౌండ్ తో విలేజ్ లో షూట్ చేసి అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటేజ్ సీన్స్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉంది. సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి. హీరోయిన్ డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండేది. కొంతమందికి చిత్తూరు యాస సెట్ అవ్వలేదు. టుక్ టుక్ లో ఆత్మ అనే కొత్త పాయింట్ తో కథనం కూడా కొత్తగా రాసుకున్నా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వదిలేసినా దర్శకుడు టేకింగ్ విషయంలో చక్కగా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. టుక్ టుక్ వెహికల్ ని తయారుచేసిన ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము. స్కూటర్ ని ముగ్గురు కూర్చునేలా మూడుచక్రాల బండిలా చక్కగా డిజైన్ చేసారు.
మొత్తంగా ‘టుక్ టుక్’ సినిమా తాము కొత్తగా రెడీ చేసుకున్న ఓ పాత స్కూటర్ లోకి ఆత్మ వస్తే ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు ఏం చేసారు అని సరదాగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.