రాజధానిని విడగొట్టినంత మాత్రాన అభివృద్ధి జరగదు…మూడు రాజధానులపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు పవన్ కళ్యాణ్. గతంలో గాంధీ నగర్‌ను మోదీ తనతో ప్రస్తావించారని..ముంబై నుంచి విడిపోయిన తర్వాత గాంధీ నగర్ అభివృద్ధికి చాలా సమయం పట్టింది. అదే రెండు, మూడు వేల ఎకరాల్లో చక్కని రాజధాని కట్టుకోవచ్చని అప్పుడే చెప్పారని పవన్ అన్నారు. అలాంటిది టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పు ఒక్కటే…అన్ని వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించడం. సింగపూర్ తరహా రాజధాని కట్టాలంటే అలాంటి వ్యవస్థ ఉండాలి. అదేమంత సులభం కాదు. మొదటి నుంచి తన వైఖరి అదేనని స్పష్టం చేశారు. సింగపూర్ అన్న కాన్సెప్ట్‌ను అమ్మడానికే వేల ఎకరాలు సేకరించారుతప్ప…అంత అవసరం లేదన్నారు. అప్పుడు అందరూ మద్దతిచ్చారు. ఇప్పుడు రైతులు నష్టపోతున్నారు. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.
టీడీపీ సింగపూర్ అంటే, వైసీపీ మూడు రాజధానులు అని చెప్పడం కూడా కలను అమ్మడం లాంటిదేనని అన్నారు. అదేం రూపుదాల్చదు. మూడు రాజధానులు రావు. ఇవన్నీ ఆపేయండి. రైతులకు వైసీపీ అండగా నిలవాలి. తాము బతికే భూములను నమ్మి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు.. ఇప్పుడు వ్యవసాయం చేసుకోలేరు, భూములు తిరిగి ఇవ్వలేరు. వాళ్లు నిరసన చేద్దామంటే 200 రోజులుగా పోలీసులతో వాళ్లపై దాడులు చేయించారు, లాఠీలతో కొట్టించారు. చాలా బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకున్న భయం ఒక్కటే. ఇది మరో నందిగ్రామ్ కాకూడదని అన్నారు. ప్రభుత్వం చిన్న సమస్యని అనుకొంటే ఇది రగులుతుందన్న భయాన్ని వ్యక్తం చేశారు పవన్. టీడీపీ, వైసీపీ ఆధిపత్యపోరులో రైతులు నలిగిపోతున్నారని అన్నారు. వాళ్లిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అందుకే అన్నిపార్టీలు రైతులకు మద్దతివ్వాలి. రైతుల ఊసురు వద్దు. ఇదో సున్నితమైన సమస్య. దీన్ని జాత్రత్తగా డీల్ చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.