kaikala satyanarayana special story
kaikala satyanarayana : ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిరస్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం డిసెంబర్ 23 తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల ఇంటికి తరలివెళ్లి ఆయనకి నివాళులు అర్పించారు. నేడు శనివారం మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అయన అంత్యక్రియలు జరగనున్నాయి.
నవరసాల్ని అవలీలగా ఒలికించగల టాలెంట్ ఆయన సొంతం. ఎన్నో విభిన్నమైన కథా చిత్రాల్లో ఎన్నెన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన లెజెండ్ ఆయన. ఆ నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. విలక్షణమైన విలనిజానికి, సలక్షణమైన పాత్ర చిత్రణకు ఆయన పెట్టింది పేరు. 60 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 700కు పైగానే సినిమాల్లో నటించిన ఆయన ప్రత్యేకత గురించి చూద్దాం.
నిండైన విగ్రహం, కంచుకంఠం, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ కైకాల ప్రత్యేకతలు. ఎలాంటి క్యారక్టర్ లోనైనా జీవించడం ఆయన స్పెషలిటీ. ఎన్నో సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయే పాత్రలు పోషించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా కైకాల చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన్ని నటుడిగా శిఖరాగ్రానికి చేర్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన ఏకైక నటుడు కైకాల.
1959 లో సిపాయి కూతురుతో టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. నాటక రంగం నుండి సినిమా వైపు అడుగులు వేసిన కైకాలను బిగినింగ్ లో సీనియర్ ఎన్టీయార్ లా ఉన్నారంటూ ఆయనకి డూప్ గా కూడా వాడారు. విఠలాచార్య దర్శకత్వంలో “కనకదుర్గ మహిమ” చిత్రంలో మొదటిసారిగా ప్రతినాయకుడిగా నటించిన కైకాల కెరీర్ కు ఎన్టీయార్ తో కలిసి నటించిన ‘అగ్గి పిడుగు’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మరెన్నో జానపద సినిమాల్లో విలన్ గా నటించిన కైకాల టాలీవుడ్ లో ఇక వెనుతిరిగి చూడలేదు.
కొన్ని పాత్రలు కైకాల కోసమే పుట్టినట్టు అవి ఆయనకు మాత్రమే సరిగ్గా అతికినట్టు సరిపోయాయి. అలాంటి వాటిలో ఆయనకు బాగాపేరు తెచ్చిపెట్టిన పాత్ర యమధర్మరాజు. ‘యమగోల, యముడికి మొగుడు, యమలీల’ లాంటి సినిమాల్లో యముడిగా ఆయన నటన అద్భుతం. ఎన్టీయార్ తో కలిసి దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించారు కైకాల. రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, యముడిగా, ఘటోత్కచుడిగా కైకాల నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన “రాముడు భీముడు” సినిమాలో ఎన్టీయార్ కి డూప్ గా నటించారు కైకాల. అక్కడ నుంచి యన్టీఆర్ ప్రతీ డ్యూయల్ రోల్ మూవీలోనూ, రిస్క్ షాట్స్ లోను కైకాల ఎన్టీఆర్ కి డూప్ గా నటించారు. కమెడియన్ నగేష్ డైరెక్ట్ చేసిన మొరటోడు’, ‘నా పేరే భగవాన్’, ‘ముగ్గురు మూర్ఖులు’, ‘కాలాంతకులు’, ‘గమ్మత్తు గూడచారులు’ లాంటి సినిమాల్లో హీరోతో సమానమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ. ఆ పాత్రలకు మంచి పేరొచ్చాయి . కానీ సినిమాలు కమర్షియల్ గా అంతగా ఆడలేదు.
మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం ఆర్టిస్టులందరితోనూ నటించిన అతికొద్ది సీనియర్ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. తెలుగు భాషకు వన్నె తెచ్చిన నటుల్లో కైకాల చెప్పుకోదగ్గ నటుడు. “రమా ఫిల్మ్ ప్రొడక్షన్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘అడవిరాజా, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు.. లాంటి పలు సినిమాలను నిర్మించారు కైకాల. సీతా స్వయంవర్, శ్రీరామ్ వనవాస్ లాంటి హిందీ సినిమాలతో పాటు సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన ‘కర్మ’ మూవీలోనూ కైకాల నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర చేశారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించి మెప్పించారు.
కెరీర్ తొలిదశలోనే కైకాలకు పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. ‘లవకుశ’లో భరతుడిగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసనుడిగా నటించారు. ‘శ్రీకృష్ణపాండవీయం’లో ఘటోత్కచుడిగా, ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో దుర్యోధనుడిగా, ‘సీతాకళ్యాణం’లో రావణాసురుడిగా ‘దానవీరశూరకర్ణ’ లో భీముడిగా. ‘శ్రీ వినాయక విజయం మూషికాసురుడిగా నటించి ఆడియన్స్ ను మెప్పించారు.‘సంసారం సాగరం, రామయ్య తండ్రి, జీవితమే ఒక నాటకరంగం, దేవుడే దిగివస్తే, తాయారమ్మ- బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు, మోసగాడు, నిప్పులాంటి మనిషి’ లాంటి సినిమాల్లో సాత్విక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి కుటుంబ ప్రేక్షకులకు సత్యనారాయణ అభిమాన నటుడయ్యారు.
Kaikala Satyanarayana : అధికార లాంఛనాలతో కైకాల అంతక్రియలు..
ఒక అశోక్‌కుమార్, ఒక సంజీవ్ కుమార్, ఒక శివాజీ గణేశన్ ముగ్గురూ కలిస్తే సత్యనారాయణ అని బాలీవుడ్ డైరెక్టర్ సుభాష్ ఘాయ్ సత్యనారాయణను ప్రశంసించటం భాషలతో సంబంధం లేని ఆయన నటనా కౌశలానికి మచ్చు తునక. రఘుపతి వెంకయ్య, ఫిల్మ్ ఫేర్ అవార్డ్, నంది, యన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వారి అవార్డులు, నటశేఖర, కళాప్రపూర్ణ, నవరస నటనా సార్వభౌమ బిరుదులు కైకాలను వరించి తరించాయి. సత్యనారాయణ నటించిన ఆఖరి సినిమా మహేశ్ బాబు ‘మహర్షి’. అందులో పూజా హెగ్డే తాతగా నటించారు కైకాల.
ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు కైకాల. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో జాయిన్ అయి మచిలీపట్టణం నుంచి ఎంపీగా గెలుపొంది సేవలు అందించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్నో సేవలు చేసి తనదైన మార్క్ ని సృష్టించారు. అలాంటి మహామనిషి దూరమవడం తెలుగువారికి ఎంతో బాధకరం.