Keneeshaa : నేను ఓడిపోయాను.. అతన్ని వదిలేస్తున్నాను.. జయం రవి పై సింగర్ కెనిషా ఎమోషనల్ పోస్ట్..
అతన్ని వదిలేసి వెళ్తున్నాను, అన్ని వదిలేస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కెనిషా. (Keneeshaa)
Keneeshaa
Keneeshaa : తమిళ్ స్టార్ హీరో జయం రవి ఆమె భార్య ఆర్తి విడిపోతున్నట్టు 2024 లో ప్రకటించి ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నుంచి రవి సింగర్ కెనిషాతో ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఆమెతో కలిసి రెగ్యులర్ గా కనిపించాడు రవి. అయితే కెనిషాపై ట్రోలింగ్ చేయడంతో, ఆర్తి – రవిలని ఆమె విడగొట్టిందని వార్తలు రావడంతో అతన్ని వదిలేసి వెళ్తున్నాను, అన్ని వదిలేస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కెనిషా.
Also Read : Jayam Ravi : విడాకులు వచ్చేవరకు నటించను.. నాపై చేతబడి చేసి చంపాలని చూశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో..
సింగర్ కెనిషా తన పోస్ట్ లో.. ఈ కథలోకి చాలా ప్రేమతో అడుగుపెట్టాను కానీ ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోతున్నాను. ఈ ప్రపంచం మొత్తం అహంకారాలు, అబద్దపు వార్తలతో నిండి ఉంది. ఇక్కడ మంచితనానికి చోటు లేదు. అందుకే ప్రేమ కూడా బరువుగానే మారుతుంది. ఒకరిని రక్షించే క్రమంలో నేను చాలా కోల్పోయాను. సినిమా పరిశ్రమకు, అతనిని ప్రేమించే వారికి, అతడి జీవితంపై వాళ్లకు మాత్రమే హక్కులు ఉన్నాయనుకునే వారికి చెబుతున్నాను.. ఇకపై అతను మీ వాడే.
ఇకపై ఈ యుద్ధాలు నేను చేయలేను, పోరాడలేను, వివరణలు ఇవ్వలేను. ఓ మంచి వ్యక్తికి అండగా నిలవాలని ముందుకు వచ్చాను. అది నా మూర్ఖత్వం. ఈ ప్రపంచం కేవలం అబద్ధాల కోరులతో, మాయగాళ్లతో నిండిపోయింది. ఇకపై అతన్ని పూర్తిగా వదులుకుంటున్నాను. నేను జీవితంలో ఓడిపోయాను. చెన్నైని, నాకు ఇష్టమైన సంగీతాన్ని, నా థెరపీని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్ మీడియాని కూడా వదిలేస్తున్నా. దేవుడు సృష్టించిన దానిని కూడా మనుషులు ముక్కలు చేయగలరని అర్ధం చేసుకున్నా. ఫెమిజం గెలిచింది కానీ హ్యాపినెస్ ఓడిపోయింది అంటూ కేనీసా ఫ్రాన్సిస్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
కెనిషా తనని వదిలేసి వెళ్లిపోవడంతో జయం రవి నేడు ప్రెస్ మీట్ పెట్టి భార్యపై సంచలన ఆరోపణలు చేసాడు. నా ఆస్తి లాగేసుకున్నారు. నన్ను చంపాలని చూశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కెనిషా గురించి మాట్లాడుతూ.. నన్ను అర్ధం చేసుకొని నాకు తోడుగా నిలిచిన కెనిషాని వెళ్లిపోయేలా చేశారు. తనపై ట్రోలింగ్ చేయించారు అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో జయం రవి – కెనిషా లు తమిళనాట చర్చగా మారారు.
