KA Movie : కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ.. అదిరిందిగా.. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించలేరు..

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కు కర్మ అనే అంశం జోడించి సరికొత్తగా చూపించారు క సినిమాని.

KA Movie : కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ.. అదిరిందిగా.. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించలేరు..

Kiran Abbavaram KA Movie Review and Rating

Updated On : October 31, 2024 / 7:00 AM IST

KA Movie Review : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా తెరకెక్కిన సినిమా ‘క’. తన్వి రామ్, అచ్యుత్ రామ్, రెడిన్ కింగ్స్ లీ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్. KA ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై చింతా గోపాల కృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘క’ అనే సింగిల్ లెటర్ తో ముందు నుంచి ఆసక్తి పెంచిన ఈ సినిమా నేడు దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజయింది. ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు కూడా వేశారు.

కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) ని ఎవరో కొట్టి కిడ్నాప్ చేసి ఒక చీకటి రూమ్ లో బంధిస్తారు. అతను గతం మర్చిపోవడంతో ఓ మిషన్ చూపించి అతని కథ అంతా చెప్పించుకుంటారు పెద్ద సర్. ఆ పక్క గదిలోనే రాధ(తన్వి రామ్)ని కూడా అలాగే బంధిస్తారు.

ఎవరు లేని అనాథ అయిన అభినయ వాసుదేవ్ చిన్నప్పుడు అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు వేరే వాళ్ళ ఉత్తరం చదువుతాడు. అందులో అమ్మ ప్రేమ కనిపిస్తుంది. అప్పట్నుంచి వేరే వాళ్ళ ఉత్తరాలు దొంగచాటుగా చదవడం అలవాటయి ఆ ఉత్తరాల్లో తన బంధాలని చూసుకుంటాడు. అలా పెద్దయ్యాక ఉత్తరాల కోసమే క్రిష్ణగిరి అని ఓ ఊరిలో పోస్ట్ మ్యాన్ గా కూడా చేరతాడు. చుట్టూ కొండల మధ్య ఉండే ఆ ఊళ్ళో మూడు గంటలకే చీకటి పడిపోతుంది. ఆ ఊరి పోస్ట్ ఆఫీస్ హెడ్ అయిన రంగారావు కూతురు సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు వాసుదేవ్. అయితే ఆ ఊళ్ళో అప్పుడప్పుడు అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దొంగతనంగా వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే వాసుదేవ్ కి ఓ ఉత్తరం వల్ల ఈ అమ్మాయిల మిస్సింగ్ క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడ్నుంచి వాసుదేవ్ ఈ మిస్సింగ్ కేసు వెనకాల పడతాడు. ఈ క్రమంలో వాసుదేవ్ ఎదుర్కున్న సమస్యలు ఏంటి? సత్యభామతో వాసుదేవ్ ప్రేమ ఫలించిందా? అసలు రాధ ఎవరు? రాధను, వాసుదేవ్ ని ఎవరు బంధించారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Jai Hanuman first look : ‘జై హ‌నుమాన్’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..

సినిమా విశ్లేషణ.. ముందు నుంచి ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉంటుందని, ఈ సినిమాలో కొత్తదనం లేకపోతే, నా నటన నచ్చకపోతే సినిమాలు మానేస్తానని సంచలన ప్రకటన చేసాడు కిరణ్ అబ్బవరం. సింగిల్ లెటర్ ‘క’ అనే టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి పెంచగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న కిరణ్ ఇలాంటి ప్రకటన చేయడంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. అయితే కిరణ్ చెప్పినట్టే సినిమా క్లైమాక్స్ ని ఎవరూ ఊహించలేనంత కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు.

వాసుదేవ్, రాధ అనే ఇద్దర్ని బంధించి వాళ్ళతోనే వాళ్ళ కథలు చెప్పించడంతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. వాసుదేవ్ గురించి, సత్యభామతో అతని ప్రేమాయణం, పోస్ట్ మ్యాన్ జాబ్, ఊళ్ళో అమ్మాయిల మిస్సింగ్ కేసులతో సాగి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో అని ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ అమ్మాయిల మిస్సింగ్ కేసుని సాల్వ్ చేయడం కూడా వాసుదేవ్ తో చెప్పిస్తారు. ఈ క్రమంలో వాసుదేవ్ ఎదుర్కున్న సమస్యలు ఏంటి? రాధ ఎవరు? వీళ్లిద్దరికున్న సంబంధం ఏంటి అనేది ఆసక్తికరంగా చూపించారు. ఇక క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. తెలుగు సినిమాల్లో అయితే ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటివరకు రాలేదనే చెప్పొచ్చు.

ముఖ్యంగా మన కర్మ ఫలం గురించి, మన రుణానుబంధాల గురించి చాలా చక్కగా చూపించారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కు కర్మ అనే అంశం జోడించి సరికొత్తగా చూపించారు క సినిమాని. ఇక క అంటే అర్ధం ఏంటో తెరపైనే క్లైమాక్స్ లో తెలుసుకోండి. అయితే ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కొంత సాగదీసినట్టు అనిపించినా ఇంటర్వెల్ నుండి మాత్రం నెక్స్ట్ ఏంటి అని ఆసక్తిగా కథ పరిగెడుతుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయినా ఎక్కడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూపించారు.

Image

నటీనటులు.. మొదట్లో బాగానే మెప్పించిన కిరణ్ అబ్బవరం మధ్యలో కొన్ని మాస్ సినిమాలు అంటూ వెళ్లి విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. ఇప్పుడు క సినిమాలో అదిరిపోయే నటనతో, రియల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టేసాడు. కిరణ్ కు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని అనుకోవచ్చు. నయన్ సారిక తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పించింది. కొన్ని సన్నివేశాలలో కళ్ళతోనే చక్కగా నటించింది. మలయాళం సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న తన్వి రామ్ కూడా తన నటనతో అలరించింది. తమిళ్ కమెడియన్ రెడిన్ కింగ్స్ లీ, అచ్యుత్ కుమార్.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా ప్లస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ అందంగా చూపించడమే కాక కొత్త సినిమాటిక్ షాట్స్ తో మెప్పించారు. ఇక 1977 సెటప్ కోసం ఊరు, పోస్టాఫీస్, జాతర, ఇళ్ళు, ఎద్దులబండి, సైకిల్.. ఇలా అన్నిటిని చక్కగా డిజైన్ చేసారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా ఆ కాలానికి తగ్గట్టు అందరి బట్టలు పర్ఫెక్ట్ గా డిజైన్ చేసారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి.

ఒక మాములు వుమెన్ ట్రాఫికింగ్ కథ, లవ్ స్టోరీ కథకు కర్మఫలం అని ఓ కొత్త పాయింట్ జతచేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో సరికొత్తగా చూపించారు దర్శక ద్వయం సుజీత్, సందీప్. మొదటి సినిమాతోనే దర్శకులుగా 100 శాతం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న కిరణ్ అబ్బవరంపై ఇంత భారీ బడ్జెట్ పెట్టి, ఇంత పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకువచ్చారంటే నిర్మాతలు రిస్క్ చేసి సక్సెస్ అయినట్టే.

మొత్తంగా.. ‘క’ సినిమా ఓ అనాథ అయిన హీరో తాను పోస్ట్ మ్యాన్ గా పనిచేసే ఊళ్ళో అమ్మాయిలు మిస్ అవుతుంటే ఏం చేసాడు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే పాయింట్ ని కర్మఫలం అనే అంశం జోడించి కొత్తగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.