Junior : ‘జూనియర్’ మూవీ రివ్యూ.. జెనీలియా రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే..?

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన సినిమా 'జూనియర్'.

Junior : ‘జూనియర్’ మూవీ రివ్యూ.. జెనీలియా రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే..?

Junior Movie Review

Updated On : July 18, 2025 / 8:33 AM IST

Junior Movie Review : కర్ణాటక రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన సినిమా ‘జూనియర్’. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా, జెనీలియా, రవిచంద్రన్ కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. జూనియర్ సినిమా నేడు జులై 18న కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ అయింది. ముందు రోజే పలు చోట్ల ప్రీమియర్లు కూడా వేశారు.

కథ విషయానికొస్తే.. కోదండపాణి(రవిచంద్రన్) భార్య(సుధారాణి) 45 ఏళ్ళ వయసులో గర్భవతి అవుతుంది. చుట్టుపక్క వాళ్లంతా ఈ వయసులో తల్లి అవడం ఏంటి అని సూటి పోటీ మాటలతో బాధపెడతారు. దాంతో కోదండపాణి తన సొంతూరు విజయనగరంని వదిలేసి వెళ్లిపోతుండగా భార్య బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. కొన్నేళ్ల తర్వాత అభి(కిరీటి) నాన్న కోదండపాణి ప్రేమ తట్టుకోలేక, లైఫ్ లో ఎంజాయిమెంట్ కావాలని దూరంగా కాలేజీలో జాయిన్ అయి అక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ స్ఫూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు.

చదువు అయ్యాక మళ్ళీ నాన్న వచ్చి తీసుకెళ్లడంతో ఎలాగైనా నాన్నకు దూరంగా ఉండాలి అని, స్ఫూర్తి కోసం ఓ కంపెనీలో జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆ కంపెనీ హెడ్ విజయ సౌజన్య(జెనీలియా) చాలా స్ట్రిక్ట్. అభి చేసే పనులతో విజయకు ఇరిటేషన్ వస్తుంది. తను సీఈఓ అయ్యాక మొదట నీ జాబ్ పీకేస్తాను అని అభికి వార్నింగ్ ఇస్తుంది. దీంతో అభి విజయని సీఈఓ అవ్వకుండా చేస్తాడు. అలాగే ఆ కంపెనీలో సోషల్ సర్వీస్ ఫండ్స్ కోసం విజయనగరం ఊరికి కేటాయించే డబ్బుల్లో అవినీతి జరుగుతుందని అభి కనిపెడతాడు. విజయ సీఈఓ కాకపోవడం, అభి తండ్రి కనపడటంతో విజయ తండ్రి(రావు రమేష్) అభిని పిలిచి విజయనగరం, విజయ గురించి ఓ సీక్రెట్ చెప్తాడు. అసలు అభి ఎవరు? అభికి – విజయకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి – విజయ తండ్రిలకు ఉన్న సంబంధం ఏంటి? విజయ సీఈఓ అవుతుందా? విజయనగరంలో జరిగే అవినీతి ఏంటి? అభి తండ్రి పేమను అర్ధం చేసుకుంటాడా.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ అనౌన్స్.. ఎక్కడ? ఎప్పుడు?

సినిమా విశ్లేషణ.. గాలి జనార్దన్ రెడ్డి కొడుకుని హీరోగా గ్రాండ్ లాంచ్ ఇప్పించడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసారు. అయితే ఇది ఒక మూడేళ్ళ క్రితం సినిమా కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక జెనీలియా ఆల్మోస్ట్ 13 ఏళ్ళ తర్వాత తెలుగు, కన్నడలో ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ కథ, లవ్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ అంటూ అక్కడక్కడా కామెడీతో సరదాగా సాగిపోతుంది. హీరో జాబ్ లో జాయిన్ అయి జెనీలియా ఎంట్రీ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంటుంది. ఇంటర్వెల్ కి ఇచ్చిన ట్విస్ట్ తో కచ్చితంగా షాక్ అవుతారు. సెకండాఫ్ అభి, విజయ, వాళ్ళ టీమ్ విజయనగరంకు వెళ్లి అక్కడ ఏం చేసారు అనేది కాస్త సాగదీశారు. ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ కాస్త పండినా ఊరిని మార్చేద్దాం అంటూ చేసిన పనులు, సీన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు.

ఊరి బాగు కోసం ఇచ్చిన డబ్బులు అవినీతి చేసారని చెప్పి అసలు ఆ పాయింట్ నే పక్కన పెట్టేసారు. అభి – విజయల మధ్య ఎమోషన్ కోసం బాగానే వర్కౌట్ చేసారు. చివర్లో తండ్రి ఎమోషన్ ని వర్కౌట్ చేసి క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా కొత్తగా ఇచ్చారు. శ్రీలీల పాత్రని మధ్యలోనే వదిలేసి సరైన ఎండింగ్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ లో అసలు శ్రీలీల ఉండకపోవడంతో ఐటెం సాంగ్ కోసం ఆమెని వాడేశారు. మొదటి సినిమాకే కిరీటి పెద్ద కథని పట్టుకొని ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో కొంత, ఫ్లాష్ బ్యాక్ కొంత సాగదీశారు తప్పితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కొన్ని జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ సీన్స్ తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అయితే జూనియర్ అనే టైటిల్ ఫస్ట్ హాఫ్ వరకు సెట్ అయినా అసలు మెయిన్ కథకు ఆ టైటిల్ సెట్ అవ్వకపోయినా ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. విలన్ పాత్రకి ఎంట్రీ బిల్డప్ ఇచ్చి చివర్లో సరైన ఎండింగ్ ఇవ్వలేదు.

Junior

నటీనటుల పర్ఫార్మెన్స్.. కిరీటి మొదటి సినిమాలోనే తన బెస్ట్ డ్యాన్స్, ఎమోషన్ యాక్టింగ్, ఫైట్స్ ఇచ్చాడు. డూప్ లేకుండా ఫైట్స్ చేయడం గమనార్హం. కిరీటి డ్యాన్స్ చూస్తే చరణ్, ఎన్టీఆర్, బన్నీ రేంజ్ లో చేసాడని చెప్పొచ్చు. మంచి కథలు పడితే ఫ్యూచర్ లో కన్నడలో హీరోగా ఎదగొచ్చు. శ్రీలీల కేవలం లవ్ స్టోరీ వరకే. వైరల్ వయ్యారి ఐటెం సాంగ్ లో మాత్రం అదరగొట్టేసింది.

జెనీలియాకు రీ ఎంట్రీ ఇచ్చినందుకు మంచి పాత్రే పడింది. ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో చివర్లో ఫుల్ ఎమోషన్ తో మెప్పిస్తుంది. కన్నడ స్టార్ దర్శకుడు, నటుడు రవిచంద్రన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. వైవా హర్ష, సత్య, లక్ష్మణ్.. అక్కడక్కడా బాగానే నవ్వించారు. రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు పార్ట్ 2 పై నిధి అగర్వాల్ అప్డేట్.. పవన్ నుంచి ఇంకో సినిమా..

సాంకేతిక అంశాలు.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కాలేజీ, లవ్ ఎపిసోడ్స్ అంతా కలర్ ఫుల్ గా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగానే ఇచ్చినా అవన్నీ ఎక్కడో విన్నట్టే ఉంటుంది. ప్రతి సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫలానా సినిమాలో ఇదే ఉంది కదా కాపీ కొట్టారా అనే సందేహం రాక మానదు. ఎడిటింగ్ లో సాగదీసిన కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండేది. ఫైట్స్ కూడా బాగా డిజైన్ చేసారు. కాలేజీలో ఎంట్రీ ఫైట్, క్లైమాక్స్ లో బస్ ఫైట్ కొత్తగా డిజైన్ చేసి థ్రిల్లింగ్ అనుభవం ఇచ్చారు. రొటీన్ కథే అయినా కొత్త ఎండింగ్ తో, కొత్త స్క్రీన్ ప్లేతో చూపించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘జూనియర్’ సినిమా సరదాగా సాగుతూనే ఎమోషన్ తో మెప్పించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.