Samantha: అందాల సమంత ఫిట్‌నెస్, ఫుడ్, లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయాయ్.. “టీనేజ్‌లో చాలా సన్నగా ఉండేదాన్ని” అని చెప్పిన సామ్
ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకున్న హీరోయిన్ సమంత.. తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటో తెలుసా?

Samantha Ruth Prabhua
హీరోయిన్ సమంత రూత్ ప్రభు కేవలం తన అద్భుతమైన నటనతోనే కాదు, ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్‌నెస్‌పై చూపించే అంకితభావంతో కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల ఆమె తన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల గురించి, తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు పెరిగిందనే విషయం గురించి అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం సమంత యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ (Anti-inflammatory Diet)ను ఫాలో అవుతున్నారు. ఈ డైట్ తన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో, ఆరోగ్యం విషయంలో తన ఆలోచనలు ఎలా మారాయో ఆమె వివరించారు.
ఆహారపు అలవాట్లు మారిపోయాయ్..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రాయన్ ఫెర్నాండోతో సమయంలో ఒక ప్రత్యేక చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. సమంత తన డైట్ ఆప్షన్స్, ఆహార ప్రణాళిక గురించి పూర్తిగా వివరించారు. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్నే తీసుకుంటున్నానని తెలిపారు.
ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు.. ఇవన్నీ సరైన మోతాదులో ఉండేలా తన డైట్ ను ప్లాన్ చేసుకుంటున్నట్లు సమంత చెప్పారు. నీటిని ఎక్కువగా తాగడం, తక్కువ మోతాదులో నాణ్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా తినడం వంటి మంచి అలవాట్లను తన జీవనశైలిలో భాగం చేసుకున్నానన్నారు. ఈ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, తాను ఎదుర్కొన్న కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఎంతో సహాయపడ్డాయని కూడా సమంత వెల్లడించారు.
టీనేజ్‌లో చాలా సన్నగా ఉండేదాన్ని..
సమంత మాట్లాడుతూ, “నేను టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఎంత తిన్నా బరువు పెరగలేదు. అప్పట్లో నాకు తెలియని విషయం ఏమిటంటే, ఆరోగ్యం అనేది కేవలం బరువు గురించే కాదు, శరీరంలో కలిగే వాపు (inflammation) గురించి కూడా,” అని చెప్పారు.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే?
సమంత ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రధాన డైట్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శరీరానికి హాని కలిగించే పదార్థాలను గుర్తించి, వాటిని ఆహారం నుంచి పూర్తిగా తొలగించడం. “మనకు ఏవి సరిగా పడవో, శరీరానికి ఏవి పనికిరావో గుర్తించి, వాటిని మానేయడమే ఈ డైట్ లో కీలకమైన అంశం” అని సమంత వివరించారు.
‘చీట్ డే’ లేదు.. రోజూ ఒకే రొటీన్
చాలామంది వారంలో ఒక్కరోజు ‘చీట్ డే’ గా పెట్టుకుంటారు. కానీ సమంతకు ఈ అలవాటు లేదు. “నాకు చీట్ డే మీద నమ్మకం లేదు. నా భోజనాన్ని ప్రతిరోజూ ఒకేలా ఉంచుకుంటాను” అని ఆమె తెలిపారు. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ను ఒకేలా ప్లాన్ చేసుకుంటానని, ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ లో స్మూతీలు ఎక్కువగా తీసుకుంటానని చెప్పారు. ఈ విధంగా ఒకే రకమైన జీవనశైలికి అలవాటు పడి, దానిని ఇష్టపడుతున్నానని తెలిపారు.
ఇష్టమైనవి, అయిష్టమైనవి: బ్రోకలీ vs పాలకూర
తాను ఏ కూరగాయలు ఇష్టపడతారో, ఏవి వద్దనుకుంటారో సమంత స్పష్టంగా చెప్పారు. “కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బ్రోకలీ వంటివి నా ఆహారంలో భాగం. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. కానీ పాలకూర (Spinach), కేల్ (Kale) లాంటివి నాకు అంతగా నచ్చవు” అని చెప్పారు. ఆరోగ్యకరమైన డైట్లలో ఇవి తరచుగా ఉన్నప్పటికీ, తాను వాటిని ఇష్టపడటం లేదని తెలిపారు.
రోజువారీ ఆహారంలో కీలకమైనవి: సెలరీ, బెర్రీస్, నెయ్యి
సమంత తన రోజువారీ ఆహారంలో సెలరీ, అకాయ్ బెర్రీస్, పసుపు, నెయ్యి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకుంటానని తెలిపారు. ఇవి శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయని, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ లో ముఖ్యమైనవి అని చెప్పారు. తాను తినే ప్రతి పదార్థం శరీరానికి మేలు చేస్తుందా లేదా అని చూసుకుని ఎంచుకుంటానని తెలిపారు.
చాలామంది సినీ తారలు వ్యక్తిగత షెఫ్‌లను నియమించుకుని ప్రత్యేకంగా వంట చేయించుకుంటారు. కానీ సమంత మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. “నాకు వంట చేసే వ్యక్తిగా నా అసిస్టెంట్‌నే నమ్ముతాను. షూటింగ్‌లకు కూడా అతడు నాకు వంటచేసేందుకు వెంటే వస్తాడు. నా డైట్ ను ఫాలో అవ్వడంలో ఆయన నాకు చాలా సహాయపడతాడు” అని సమంత తెలిపారు.
సమంత చివరిసారిగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇది అమెరికన్ స్పై సిరీస్ ‘సిటాడెల్’కు భారతీయ వెర్షన్‌గా రూపొందింది. ఈ షోను దర్శకులు రాజ్, డీకే రూపొందించారు. ఇందులో సమంతతో పాటు వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలో నటించారు.