Officer on Duty : ‘ఆఫీసర్ – ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ.. హత్యలు, ఆత్మహత్యలతో సాగే థ్రిల్లర్ సినిమా..
'ఆఫీసర్ - ఆన్ డ్యూటీ' సినిమా హత్యలు, ఆత్మహత్యలతో ఎవరు చేసారు అని కనిపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.

Kunchacko Boban Priyamani Officer on Duty Movie Review and Rating
Officer on Duty Movie Review : కుంచకో బోబన్, ప్రియమణి జంటగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘ఆఫీసర్’. ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్కిట్ ప్రకట్, రెంజిత్ నాయర్, శిబి చవరా నిర్మాణంలో షాహీ కబీర్ కథను అందించగా జీతూ అష్రాఫ్ దర్శకత్వంలో ఈ ఆఫీసర్ సినిమా తెరకెక్కింది. మలయాళంలో ఫిబ్రవరి 20న రిలీజయి అక్కడ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయి మార్చ్ 14న రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. CI హరిశంకర్(కుంచకో బోబన్) కొన్ని కారణాలతో సస్పెండ్ అయి మళ్ళీ తిరిగి జాబ్ లో జాయిన్ అవుతాడు. అతను జాయిన్ అయిన రోజే ఓ ఫేక్ బంగారం తాకట్టు కేసు వస్తుంది. దాన్ని విచారిస్తుంటే ఆ కేసు ఓ ఆత్మహత్య కేసుకి, ఓ డ్రగ్స్ కేసుకి, అమ్మాయిల వీడియోల కేసుకి లింక్ అవుతుంది. అలాగే ఈ కేసు తన కూతురు ఆత్మహత్యకి కూడా లింక్ ఉందని తెలుస్తుంది. దీంతో ఈ కేసు నుంచి పై అధికారులు ఇతన్ని తప్పించాలని చూస్తారు. కానీ హరిశంకర్ కేసు వదలను అంటాడు.
విచారణలో అనుకోకుండా ఓ అమ్మాయి సూసైడ్ చేసుకోవడంతో ఆమె తండ్రి హరిశంకర్ వల్లే తన కూతురు చనిపోయింది అని కేసు పెడతాడు. వరుసగా మరో రెండు హత్యలు జరుగుతాయి. దీంతో ఈ హత్యలు, ఆత్మహత్యలు అన్నిటికి ఒకటే లింక్ ఉందని హరిశంకర్ కి అర్థమయి అటు వైపుగా విచారించడంతో కొంతమంది గ్రూప్ గా ఇవన్నీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి హరిశంకర్ ఈ కేసుని ఎలా డీల్ చేసాడు? ఈ హత్యలు, ఆత్మహత్యల వెనక ఉన్న కామన్ లింక్ ఏంటి? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని ఎలా పట్టుకున్నారు? హరిశంకర్ కూతురు ఎలా చనిపోయింది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Pelli Kani Prasad : సప్తగిరి ‘పెళ్ళికాని ప్రసాద్’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు..
సినిమా విశ్లేషణ.. మలయాళం వాళ్ళు సస్పెన్స్ థ్రిల్లర్స్, ముఖ్యంగా మర్డర్ మిస్టరీలు బాగా డీల్ చేస్తారని తెలిసిందే. ఈ సినిమా కూడా అలాంటిందే. ఫస్ట్ హాఫ్ అంతా ఫేక్ బంగారం తాకట్టు కేసుతో మొదలయి, వేరు వేరు హత్యలు, ఆత్మహత్యలు చూపిస్తారు. వాటిని హరిశంకర్ ఎలా డీల్ చేసాడు, నిందితులను ఎలా పట్టుకున్నాడు అనేది సెకండ్ హాఫ్ అంతా సాగుతుంది. అయితే వాళ్ళు ఎందుకు హత్యలు చేస్తున్నారు, అన్నిటికి ఉన్న కామన్ లింక్ ఏంటి అనే ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. క్లైమాక్స్ రొటీన్ గా హీరో విలన్ల మధ్య ఫైట్ లాగా సాగుతుంది.
అన్ని మర్డర్ థ్రిల్లర్స్ లాగే ఇది కూడా కాస్త ట్విస్టులతో, కాస్త స్క్రీన్ ప్లేతో బాగానే ఉంటుంది. అయితే ఇదంతా ఓ యంగ్ డ్రగ్స్ ముఠా చేస్తున్నారు అని ఆ ముఠా చేసే పనులు మాత్రం కొన్ని సీన్స్ లో మరీ ఓవర్ గా చూపిస్తారు. సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా చాలా చోట్ల సాగదీసినట్టు ఉంటుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కుంచకో బోబన్ పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. ఈ సినిమాలో ఓ తండ్రిగా, ఓ సీరియస్ పోలీసాఫీసర్ గా చాలా బాగా నటించాడు. హీరో భార్య పాత్రలో ప్రియమణి అక్కడక్కడా కనిపించి పర్వాలేదనిపించింది. DSP పాత్రలో వైశాఖ్ శంకర్ మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ లో నటించిన 5 గురు యువ యాక్టర్స్ చాలా బాగా మెప్పిస్తారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Sankranthiki Vasthunam : టీఆర్పీల దుమ్ముదులిపిన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా డిజైన్ చేసినా ఎక్కువ సేపు సాగదీశారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద మైనస్. హెవీ సౌండ్ తో, అక్కర్లేనిచోట కూడా లౌడ్ గా బీజీఎమ్ ఇచ్చారు. కొన్ని చోట్ల సస్పెన్స్ కి హారర్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారు. తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల సెట్ అవ్వలేదు. కథ, కథనం మాత్రం కొత్తగా ఉన్నాయి. డైరెక్టర్ బాగా డీల్ చేసాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఆఫీసర్ – ఆన్ డ్యూటీ’ సినిమా హత్యలు, ఆత్మహత్యలతో ఎవరు చేసారు అని కనిపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.