Mad Movies Fame Sangeeth Shobhan Gamblers Movie Review
Gamblers Movie Review : మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఫుల్ గా నవ్వించిన హీరో సంగీత్ శోభన్ తాజాగా గ్యాంబ్లర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాణంలో కేఎస్‌కే చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గ్యాంబ్లర్స్ నేడు జూన్ 6న థియేటర్స్ లో రిలీజయింది. ప్రశాంతి చారులింగ, రాకింగ్ రాకేశ్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జశ్విక, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూధనా రావు, ఛత్రపతి శేఖర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే.. CCC (కార్డ్ క్యాజిల్ క్లబ్)లో పేకాట ఆడతుంటారు. ఆంటోనీ(మధుసూధనరావు) కొంతమందితో పేకాట ఆడి అన్ని పోగొట్టుకొని తన వంశ గౌరవం అయిన లేడీ బర్డ్ అనే డైమండ్ ని కూడా పోగొట్టుకొని సూసైడ్ చేసుకుంటాడు. కానీ లేడీ బర్డ్ మిస్ అవుతుంది. దాంతో యాంటోని కొడుకు ఏంజిల్(సంగీత్ శోభన్) ని చిదంబరం(శ్రీకాంత్ అయ్యంగార్) తన చేతుల్లో పెట్టుకుంటాడు.
కొన్నేళ్ల తర్వాత CCC కి లంగడి(రాకింగ్ రాకేష్), సమీరా(సాయి శ్వేతా), పార్థు(పృథ్వీరాజ్ బన్న), రమేష్, ఓ పోలీస్, గాయత్రీ(ప్రశాంతి) వస్తారు. గాయత్రీ తన చెల్లి కృప(జశ్విక)ని ఫేక్ బాబా ఏంజల్ నుంచి కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొస్తుంది. లంగడి పేకాట ఆడి డబ్బులు సంపాదించాలని వస్తాడు. రమేష్, గాయత్రి, పోలీస్ లేడీ బర్డ్ డైమండ్ కోసం వస్తారు. పార్థు అక్కడ CCC లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. కృపని వెతుక్కుంటూ ఏంజల్ CCCకి వస్తాడు. CCC లోకి రావడానికి, వెళ్ళడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏజిల్ CCC కి రావడంతో అతనికి కొన్ని విషయాలు తెలుస్తాయి. అసలు ఈ CCC ఏంటి? అక్కడ ఉండే రూల్స్ ఏంటి? అక్కడికి వచ్చిన వాళ్ళందరి బ్యాక్ గ్రౌండ్స్ ఏంటి? ఆ డైమండ్ కథేంటి? ఏంజిల్ కి తెలిసిన విషయాలు ఏంటి? వాళ్లంతా CCC నుంచి బయటపడ్డారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. మ్యాడ్ సినిమాలతో ఫుల్ గా నవ్వించిన సంగీత్ శోభన్ సినిమా అనగానే ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా మ్యాడ్ సినిమాల కంటే ముందు తీసిందని తెలుస్తుంది. ఒక వ్యక్తి చనిపోయి డైమండ్ మిస్ అయితే ఆ ఆ డైమాండ్ కోసం కొంతమంది వెతుక్కుంటూ వచ్చే థ్రిల్లర్ కథ, అలాగే రివేంజ్ స్టోరీ కూడా. ఈ కథని సింపుల్ గా చెప్పొచ్చు. కానీ డైరెక్టర్ హాలీవుడ్ స్టైల్ లో చెప్దామని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, వాళ్లంతా CCC కి రావడంతోనే బాగా సాగదీసారు. అసలు వీళ్లంతా ఎవరు? ఎందుకు అలా చేస్తున్నారు అనే ప్రశ్నలు బోలెడు తలెత్తుతాయి. ఇంటర్వెల్ కూడా సింపుల్ గానే ఉన్నా సెకండ్ హాఫ్ ఏదో ఉండబోతుంది అనే లెవల్లో బిల్డప్ ఇచ్చారు.
అయితే సెకండ్ హాఫ్ లో అందరి బ్యాక్ గ్రౌండ్ స్టోరీలు, డైమండ్ స్టోరీలతో కాస్త ఎమోషనల్ గా సాగుతూనే కాస్త థ్రిల్లింగ్ అనుభవం ఇచ్చారు. సినిమా అంతా డైమండ్ కోసం తిప్పి చివరకు దాన్ని వదిలేసి ఇచ్చిన క్లైమాక్స్ మాత్రం ఆ కథకి సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కొంతమందిని ఒకే లొకేషన్ లో ఉంచి వాళ్ళతో గేమ్ ఆడించడం, ఎంక్వైరీ చేయడం లాంటి సినిమాలు గతంలో కొన్ని వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లో నేరేషన్ తో సాగుతుంది. సినిమా అంతా పేకాట గేమ్ చుట్టూ తిప్పి పేకాట ఆడొద్దు, ఆ ఆటలో ఏమి పోగొట్టుకోవద్దు అనే మెసేజ్ అయితే ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నెగిటివ్స్ షేడ్స్ ఉన్న పాత్రలో సంగీత్ శోభన్ మెప్పించాడు. సాయి శ్వేత తన తింగరితనం పాత్రతో అక్కడక్కడా నవ్విస్తుంది. ప్రశాంతి, పృథ్వీరాజ్ బన్న, జశ్విక, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూధనా రావు, ఛత్రపతి శేఖర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. రాకింగ్ రాకేశ్ తో కామెడీ ట్రై చేసినా పెద్దగా పండలేదు.
Also Read : Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. సినిమా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్ లో తీశారు. ఒక చిన్న పేకాట క్లబ్ లాంటి సెటప్ బాగా డిజైన్ చేసారు. ఇందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మెచ్చుకోవచ్చు. కథ బాగున్నా కథనం కొత్తగా చెప్దామని ట్రై చేసాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్. బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా మెప్పించదు. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని నిర్మించినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘గ్యాంబ్లర్స్’ సినిమా పేకాట, ఓ డైమండ్ చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ సినిమా.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.