Sri Sri Sri Raja Vaaru : ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
నార్నె నితిన్ వీటన్నిటికంటే ముందు మొదట అనౌన్స్ చేసిన సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా నేడు జూన్ 6న థియేటర్స్ లో రిలీజయింది.

Narne Nithiin Satish Vegesna Sri Sri Sri Raja Vaaru Movie Review and Rating
Sri Sri Sri Raja Vaaru Movie Review : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఇప్పటికే మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ సినిమాలతో హిట్స్ కొట్టాడు. అయితే నార్నె నితిన్ వీటన్నిటికంటే ముందు మొదట అనౌన్స్ చేసిన సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా నేడు జూన్ 6న థియేటర్స్ లో రిలీజయింది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు నిర్మాణంలో శతమానం భవతి ఫేమ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్, సంపద జంటగా ఈ సినిమా తెరకెక్కింది. రావు రమేష్, నరేష్, రచ్చ రవి, ప్రవీణ్, సుదర్శన్, సరయు, రఘుకుంచె, శుభలేఖ సుధాకర్, భద్రం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే.. సుబ్బరాజు(నరేష్), కృష్ణమూర్తి(రావు రమేష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఆత్రేయపురంలో తమ బిజినెస్ లు చేసుకుంటూనే రాజకీయాల్లో ఉంటారు. సుబ్బరాజుకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు పుడతాడు. పుట్టగానే చనిపోతాడు కానీ సిగరెట్ పొగ పీల్చడంతో బతుకుతాడు. సుబ్బరాజు కొడుకు రాజా(నార్నె నితిన్) కాలేజ్ ఏజ్ నుంచి సిగరెట్ కి బాగా అడిక్ట్ అవుతాడు. రాజా, కృష్ణమూర్తి కూతురు నిత్య(సంపద) ఇద్దరూ చిన్నప్పట్నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరిద్దరూ పెద్దయ్యేసరికి సుబ్బరాజు – కృష్ణమూర్తి MPTC సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. కృష్ణమూర్తికి రాజా – నిత్యల ప్రేమ విషయం తెలుస్తుంది. రాజా మంచివాడైనా సిగరెట్ తాగడం కృష్ణమూర్తికి నచ్చదు. దీంతో మొదట పెళ్లి వద్దని చెప్పినా తర్వాత ఎంపీటీసీ సీట్ దక్కించుకోవచ్చని ఒప్పుకుంటాడు.
కానీ నిశ్చితార్థం రోజు రాజా ఎంగేజ్మెంట్ రింగ్ సిగరెట్ ప్యాకెట్ లో పెట్టి తీసుకురావడంతో గొడవ అవుతుంది. కృష్ణమూర్తి – సుబ్బరాజు కలవకూడదని అనుకుంటున్న వాళ్ళు ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని నిశ్చితార్థం, పెళ్లి చెడగొట్టేలా చేస్తారు. కానీ కొడుకు బాధ చూడలేక సుబ్బరాజు కృష్ణమూర్తితో మాట్లాడటానికి పార్టీ ఆఫీసుకి వెళ్తే అక్కడ మాట మాట పెరిగి రాజా సిగరెట్ మానేస్తే నిత్యనిచ్చి పెళ్లి చేయమని, మానేయకపోతే ఎంపీటీసీ సీటు నువ్వే తీసుకోమని కృష్ణమూర్తితో ఛాలెంజ్ చేస్తాడు. దీనికి కృష్ణమూర్తి కూడా ఒప్పుకుంటాడు. మరి రాజా సిగరెట్ మానేశాడా? రాజా – నిత్య పెళ్లి జరుగుతుందా? ఎంపీటీసీ సీట్ ఎవరికీ వస్తుంది? అసలు సుబ్బరాజు – కృష్ణమూర్తి కలవకూడదు అని ఎవరు అనుకుంటారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Shine Tom Chacko : దసరా విలన్ చాకోకి భారీ యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రాణనష్టం.. కానీ..
సినిమా విశ్లేషణ.. ఎన్టీఆర్ బామ్మర్ది ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసాడు అన్నప్పుడు ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఈ సినిమా పలు కారణాలతో బాగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా అధికారిక రీమేక్ కాకపోయినా మలయాళం తీవెండి సినిమా కథని ప్రేరణగా తీసుకొని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. సిగరెట్ పొగతో పిల్లాడు బతకడం ఒక నిజ జీవితంలో జరిగిందని ఉదాహరణ చెప్పి జస్టిఫై చేసారు. ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని ఫ్రెండ్స్ సీన్స్, కొన్ని లవ్ సీన్స్ తో రొటీన్ పాత సినిమాలాగా సాగిపోతుంది. నిత్య – రాజా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి ఛాలెంజ్ తో రాజా సిగరెట్ మానేస్తాడా లేదా అనే ఓ ఆసక్తి నెలకొంటుంది.
ఇక సెకండ్ హాఫ్ అంతా రాజా సిగరెట్ మానేసి ఉండగలడా లేదా అనే చుట్టే తిరుగుతుంది. సిగరెట్ మానేసి రాజా పడే కష్టాలు, అతన్ని సిగరెట్ తగ్గించడానికి కృష్ణమూర్తి, అతని మనుషులు చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఆసక్తిగా సాగుతాయి. అయితే సెకండ్ హాఫ్ మొత్తం కేవలం హీరో సిగరెట్ తాగుతాడా లేదా అనే పాయింట్ చుట్టూనే తిప్పినా అది ప్రేక్షకుల్లో ఒక టెన్షన్ వచ్చేలా చేస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషనల్ డ్రామాగా టర్న్ తీసుకుంటుంది. ప్రేమ, కుటుంబం ఎమోషన్స్ తో కంటతడి కూడా పెట్టిస్తారు. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించినా ప్రీ క్లైమాక్స్ నుంచి మాత్రం బాగానే నడిపించారు. గతంలో ప్రేమ కోసం ఛాలెంజ్ చేయడాలు అనేక సినిమాల్లో చూసాం. ఇందులో ఆ ఛాలెంజ్ సిగరెట్ అవ్వడం, దాని చుట్టూనే కథ నడిపించడం కొత్తగా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్ ఉన్నా అవి న్యాచురల్ గా అనిపించవు. సినిమా అంతా సిగరెట్ చుట్టూ తిప్పి అది ఆరోగ్యానికి హానికరం, తాగొద్దా తాగాలా అనే జడ్జిమెంట్ మాత్రం ఇవ్వకపోవడం కొసమెరుపు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నార్నె నితిన్ మాస్ లుక్ లో బాగానే మెప్పించాడు. ఇది మొదటి సినిమా అయినా యాక్షన్స్, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే నటించి మెప్పించాడు. సంపద పల్లెటూరి అమ్మాయిలా క్యూట్ గా కనిపించి అలరించింది. రావు రమేష్, నరేష్ ఇద్దరూ పోటాపోటీగా అదరగొట్టారు. రచ్చ రవి, ప్రవీణ్, సుదర్శన్, భద్రం.. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. హాట్ పాత్రల్లో కనిపించే సరయు పంచాయితీ ప్రసిడెంట్ గా మంచి పాత్రలో కనిపించింది. రఘు కుంచె, శుభలేఖ సుధాకర్, అనంత ప్రభు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Akhil Akkineni :అక్కినేని అఖిల్ పెళ్లైపోయింది.. రిసెప్షన్ ఎప్పుడు అంటే..
సాంకేతిక అంశాలు.. సినిమా అంతా గోదావరి పల్లెటూళ్ళో జరగడంతో సినిమాటోగ్రఫీ లొకేషన్స్ అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించినా పాటలు మాత్రం వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండు, సాగదీసిన ఫీలింగ్ ఉండదు అనిపిస్తుంది. రెగ్యులర్ కథే అయినా కొత్త ఛాలెంజ్ తో లవ్ ఎమోషన్, యాక్షన్ సీన్స్ తో బాగానే రాసుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా ప్రేమ కోసం, నాన్న కోసం సిగరెట్ తాగడం మానేసే ఛాలెంజ్ ని ఓ యువకుడు గెలిచాడా లేదా అనేది లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.