విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Vishal Acton Movie: మాస్ హీరో విశాల్, మిల్కీబ్యూటి తమన్నా హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు, నటి ఖుష్బు భర్త సుందర్. సి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘యాక్షన్’ సినిమా విషయంలో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఆ చిత్ర నిర్మాతకు అతను నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది.
అసలేం జరిగిందంటే ‘యాక్షన్’ మూవీ గతేడాది నవంబర్ లో విడుదలై అనుకున్నంతగా ఆడలేదు. ముందుగా తక్కువ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. కట్ చేస్తే ఖర్చు పెరిగింది.. సినిమా రూ.20 కోట్లు కనుక కలెక్ట్ చేయకపోతే ఆ నష్టాన్ని నేను భరిస్తాను అని విశాల్ నిర్మాత R. Ravindran కు హామి ఇవ్వడంతో రూ.44 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా పూర్తి చేశారు.
తీరా విడుదలయ్యాక విశాల్ కు ఊహించని షాక్ తగిలింది.. తమిళనాట రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడేంటి పరిస్థితి అని నిర్మాత అడగ్గా.. నా నెక్స్ట్ సినిమా మీ బ్యానర్ లోనే చేస్తానని మళ్లీ మాటిచ్చాడు విశాల్. కానీ తర్వాతి సినిమాను తన సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో చేస్తుండడంతో నిర్మాత వేరే దారిలేక మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ‘యాక్షన్’ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతకు విశాల్ పరిహారం చెల్లించాల్సిందేనని, ఈ మేరకు రూ.8.29 కోట్ల నష్టాన్ని భర్తీ చేసే విధంగా విశాల్, నిర్మాతకు హామీ ఇవ్వాలని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.