హీరోయిన్‌గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ కన్‌ఫర్మ్.. ఇంతకముందు ఆమె ఏ సినిమాలో నటించిందంటే?
జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రవేశం గురించి తల్లి మంజుల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Mahesh Babus Niece Jahnavi Swaroop
తెలుగు సినీ ప్రపంచంలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపైకి రాబోతోంది. ఆమె మరెవరో కాదు, సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ప్రిన్స్ మహేష్ బాబు మేనకోడలు, నటి-నిర్మాత మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల గారాల కూతురు జాన్వీ స్వరూప్. ఇటీవల జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రవేశం గురించి తల్లి మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో మహేష్ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం జాన్వీ అందమైన ఫోటోలతో కూడిన మంజుల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“నా చిన్నారి జాన్వీ ఎంత వేగంగా ఎదిగిపోయిందో! ఇప్పుడు ఆమె రంగుల ప్రపంచమైన సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. జాన్వీకి మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆమె ప్రతిభను ప్రపంచం త్వరలోనే చూడబోతోంది. నా డార్లింగ్… వెండితెర నీకోసం ఎదురుచూస్తోంది. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్‌డే మై జాను” అంటూ కూతురి పుట్టినరోజు సందర్భంగా మంజుల ఘట్టమనేని భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.
జాన్వీ స్వరూప్‌కు నటన రంగం కొత్తేమీ కాదు. 2018లోనే ఆమె తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. అంతేకాదు, ఈ సినిమాకు ఆమె మేనమామ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో ఒక విశేషం.
జాన్వీ తల్లిదండ్రులు ఇద్దరూ సినీ రంగానికి చెందినవారే. తల్లి మంజుల ఘట్టమనేని నటిగా అనేక చిత్రాల్లో మెప్పించారు. అంతేకాకుండా, ఆమె ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటారు. నిర్మాతగా ఆమె స్థాపించిన ‘ఇందిరా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ‘పోకిరి’, ‘ఏ మాయ చేశావె’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. తండ్రి సంజయ్ స్వరూప్ కూడా పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు.
ప్రస్తుతం జాన్వీ మొదటి సినిమాకు సంబంధించిన కథ, అలాగే నిర్మించే సంస్థ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఘట్టమనేని కుటుంబం నుంచి పూర్తిస్థాయి కథానాయికగా అడుగుపెడుతున్న జాన్వీ స్వరూప్‌కు సినీ రంగంలో గొప్ప విజయం లభించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
