Badmashulu : ‘బద్మాషులు’ మూవీ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తాగుబోతుల కామెడీ..

ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్, కామెడీ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బద్మాషులు సినిమా కూడా అదే కోవలోకి చెందింది.

Badmashulu : ‘బద్మాషులు’ మూవీ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తాగుబోతుల కామెడీ..

Mahesh Chinthala Vidyasagar Karampuri Badmashulu Movie Review and Rating

Updated On : June 6, 2025 / 7:35 PM IST

Badmashulu Movie Review : మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బద్మాషులు’. బాలకృష్ణ, రామశంకర్ నిర్మాణంలో శంకర్ చేగూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో ట్రైలర్ తిరుపతి(మహేశ్‌ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్‌ కారంపురి) క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ వాళ్ళ పనులు సరిగ్గా చేయకుండా మందు తాగుతూ జల్సా చేస్తూ ఉంటారు. భార్య, పిల్లలను కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ తాగుతూ ఉండటంతో ఊరంతా వీళ్ళని బద్మాషులు అని తిడుతూ ఉంటుంది. ఓ సారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్‌లో ఓ ఇనుప వైర్ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోతారు. చిన్న దొంగతనమే కదా అని ఓ నాలుగు రోజుల తర్వాత వదిలేస్తారు పోలీసులు.

ఆ తర్వాత స్కూల్‌లో కంప్యూటర్‌ మిస్‌ అవుతుంది. ఆ కంప్యూటర్ లో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. దీంతో ఆ కేసు తిరుపతి, ముత్యాలు మీదకు వస్తుంది. అసలు ఆ కంప్యూటర్‌ ని ఎవరు దొంగతనం చేసారు? ఎందుకు దొంగతనం చేసారు? దొంగను పట్టుకోడానికి కానిస్టేబుల్‌ రామచందర్‌(మురళీధర్‌ గౌడ్‌)కు తిరుపతి, ముత్యాలు ఎలా సహాయపడ్డారు? వీళ్ళు దొంగతనం చేయలేదని ఎలా తెలిసింది? తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి కారణం ఏంటి? చివరకు మందు మానేసారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Gamblers : ‘గ్యాంబ్లర్స్’ మూవీ రివ్యూ.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ సినిమా ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ.. ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్, కామెడీ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బద్మాషులు సినిమా కూడా అదే కోవలోకి చెందింది. సినిమాలో అక్కడక్కడా పరేషాన్, జాతి రత్నాలు ఛాయలు కనిపిస్తాయి. ఊళ్ళో పని సరిగ్గా చేయకుండా ఎంతసేపు తాగుతూ తిరుగుతూ ఉండే ఓ రెండు పాత్రల చుట్టూ, వాళ్ళు చేసే పనుల చుట్టూ కథ సాగుతుంది. అయితే ఎక్కువగా కామెడీ మీదే ఫోకస్ చేసారు. నవ్విస్తూనే చివర్లో ఓ మెసేజ్ ఇచ్చారు. తెలంగాణలో వాడే బద్మాషులు అనే తిట్టుని టైటిల్ గా తీసుకొని దానికి తగ్గట్టే సినిమాలోని పాత్రలను డిజైన్ చేసుకున్నారు.

అయితే సినిమా అంతా వీరిద్దరి చుట్టే తిరగడం, సెకండ్ హాఫ్ లో కూడా దొంగతనం చుట్టే కథంతా తిరగడంతో కాస్త సాగదీత అనిపిస్తుంది. వీరిద్దరితో మరిన్ని కామెడీ సీన్స్, మరింత బెటర్ గా రాసుకునే స్కోప్ కూడా ఉంది. రాసుకున్నంతవరకు కామెడీ సీన్స్ తో బాగానే నవ్వించే ప్రయత్నం చేసారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ విలేజ్ కథ, అక్కడి లాంగ్వేజ్ కావడంతో కొన్ని కొన్ని డైలాగ్స్ అందరికి అర్ధం కాకపోవచ్చు. కాసేపు నవ్వుకోడానికి అయితే ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.

badmashulu

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ నగరానికి ఏమైంది , కీడా కోలా, సత్తిగాని రెండెకరాలు.. లాంటి పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మహేష్ చింతల ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా బాగా నటించి నవ్వించాడు. బలగం, రామన్న యూత్‌.. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్‌ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నవ్విస్తూనే నటనతో మెప్పించాడు. ఈ ఇద్దరూ నిజమైన తాగుబోతుల్లాగే కనిపించారు.

వీరి భార్యల పాత్రల్లో దీక్ష కోటేశ్వర్, కవిత అక్కడక్కడా కనిపించినా బాగానే మెప్పించారు. మురళీధర్‌ గౌడ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయారు. బలగం సుధాకర్ రెడ్డి, అంజయ్య.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Sri Sri Sri Raja Vaaru : ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. షూట్ అంతా రియల్ తెలంగాణ విలేజ్ లొకేషన్స్ లో తీయడంతో కథకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఓ సింపుల్ కథని నవ్విస్తూ చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘బద్మాషులు’ సినిమాతో తెలంగాణ పల్లెటూళ్ళో ఓ ఇద్దరు తాగుబోతుల కథను కామెడీగా చూపిస్తూనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.