జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై మోహన్‌లాల్‌ కీలక వ్యాఖ్యలు.. వారికి శిక్ష తప్పదని వార్నింగ్

మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై అగ్రహీరో మోహన్‌లాల్‌ ఎట్టకేలకు స్పందించారు.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై మోహన్‌లాల్‌ కీలక వ్యాఖ్యలు.. వారికి శిక్ష తప్పదని వార్నింగ్

Mohanlal breaks silence on Hema panel report

Mohanlal on Hema panel report: మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై అగ్రహీరో మోహన్‌లాల్‌ ఎట్టకేలకు స్పందించారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని అన్నారు. మలయాళ సినీ పరిశ్రమను నాశనం చేయొద్దని ఆయన వేడుకున్నారు. దర్యాప్తునకు పూర్తిగా సహరిస్తామని, అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు.

“అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA)పై మొత్తం దృష్టి పెట్టవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దర్యాప్తు జరుగుతోంది. దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దు” అని మోహన్‌లాల్ శనివారం ANI వార్తా సంస్థతో అన్నారు. మహిళా నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్‌లో కలకలం రేగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీలోని కొంతమంది సభ్యులపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మొత్తం కమిటీని రద్దు చేశారు. మోహన్‌లాల్ అధ్యక్ష పదవికి ఈనెల 27న రాజీనామా చేశారు.

“హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఆ నివేదికను విడుదల చేయడం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం. అన్ని ప్రశ్నలకు AMMA సమాధానం చెప్పదు. ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ అడగాలి. ఇది చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. ఇందులో చాలా మంది భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన వేధింపుల ఆరోపణలపై అందరినీ నిందించలేం. బాధ్యులను శిక్షిస్తాం, దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం. మాలీవుడ్‌లో పరిస్థితులను చక్కదిద్దడానికే మేము ఇక్కడ ఉన్నాం. హేమ కమిటీ రిపోర్ట్ ఇంకా చదవలేద”ని మోహన్‌లాల్‌ వ్యాఖ్యానించారు.

Also Read: మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ఒకే ఒక రిపోర్ట్.. మాలీవుడ్‌లో హేమ కమిటీ ప్రకంపనలు!

మాలీవుడ్ ఇండస్ట్రీలో శక్తివంతమైన పురుషుల మాఫియా ఆధిపత్యం నడుస్తోందని వస్తున్న ఆరోపణలపై మోహన్‌లాల్‌ స్పందిస్తూ.. అలాంటి పవర్ గ్రూప్ గురించి నాకు తెలియదు. నేను అందులో భాగం కాదని అన్నాు. కాగా, మాలీవుడ్‌లో ఇప్పటివరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తు చేయడానికి కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.