Malayalam film industry announces shutdown
Malayalam Film Industry : దక్షిణాది పరిశ్రమలో మలయాళ సినిమాకి పెద్ద వాటా ఉంది. ఇక్కడ చాలా మంది పెద్ద స్టార్లు ఉన్నారు. వారికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినీపరిశ్రమకు పెద్ద కష్టం వచ్చిపడింది. భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సినీ పెద్దలంతా ఒకచోట చేరి పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 6, గురువారం, జూన్ 1, 2025 నుంచి సినిమాల షూటింగ్‌లు, షోలతో సహా అన్ని సినిమా కార్యకలాపాలు పూర్తిగా బంద్ చేయాలని నిర్ణయించారు. మలయాళ పరిశ్రమ ఇప్పటికే మాంద్యంలో ఉందని, బాక్సాఫీస్ వద్ద సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విఫలమవుతున్నాయని, దీని కారణంగా నిర్మాతలు భారీ నష్టాలను చవిచూసి సందిగ్ధంలో పడ్డారని ప్రకటించారు.
నటుల పారితోషకాల పెరుగుదలే కారణం :
2024లో మలయాళ చిత్ర పరిశ్రమ ‘ఆవేషం’, ‘ఏఆర్ఎమ్’, ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి అతిపెద్ద హిట్ చిత్రాలను అందించింది. కానీ, సినీ పరిశ్రమలో సంక్షోభం కారణంగా పూర్తిగా బంద్ ప్రకటించాయి. అధిక పన్నులు, పెరుగుతున్న నటుల పారితోషకాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
ప్రొడక్షన్, షోలతో సహా అన్ని సినిమా సంబంధిత కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయించారు. కేరళ చలనచిత్ర నిర్మాతల సంఘం (KFPA), కేరళ చలనచిత్ర ఉద్యోగుల సమాఖ్య (FEFKA) తో సహా వివిధ చలనచిత్ర సంస్థల సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
పన్నులు, భరించలేని ఖర్చులు పరిశ్రమను పతనం వైపు నెట్టివేస్తున్నాయని నిర్మాణ సంస్థలు నిరసన తెలుపుతున్నాయి. ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. వినోద పన్ను, వస్తువులు, సేవల పన్ను (GST) రెండింటి భారంతో పరిశ్రమ ఇబ్బంది పడుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమపై 30శాతం పన్ను విధిస్తున్నారని, అందులో అదనపు వినోద పన్నుతో పాటు జీఎస్టీ కూడా ఉందని ఆయన ఎత్తి చూపారు.
వినోద పన్ను ఉపసంహరించుకోవాలి :
ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పన్నును ఉపసంహరించుకోవాలని ఆయన వాదించారు. నటులు డిమాండ్ చేస్తున్న రెమ్యునురేషన్ గురించి నిర్మాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. సినిమా ఖర్చులో 60శాతం నటులు మింగేస్తున్నారని, ఇది నిర్మాతకు చాలా ఇబ్మందికరమని సురేష్ కుమార్ పేర్కొన్నారు.
కొత్త నటులు, దర్శకులు కూడా భారీగా పారితోషకాన్ని వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. డిమాండ్ చేసే పారితోషికం మలయాళ సినిమా భరించగలిగే దానికంటే పది రెట్లు ఎక్కువగా ఉందని సురేష్ కుమార్ వాపోయారు. వారిలో ఎవరూ ఈ ఒక్క పరిశ్రమ పట్ల ఎలాంటి నిబద్ధతను చూపుతున్నారని అనుకోరని తెలిపారు.
గతనెలలో పరిశ్రమకు రూ. 110 కోట్ల నష్టం :
ఈ సమస్యకు తోడు, పరిశ్రమ గణనీయమైన నష్టాలను చవిచూసిందని, జనవరి 2025లో విడుదలైన 28 మూవీల్లో ఒకటి మాత్రమే హిట్ అయిందని సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఆ నెలలో జరిగిన నష్టాలు రూ.110 కోట్లుగా వెల్లడించారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో 176 మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయని పేర్కొన్నారు. చాలా మంది టెక్నీషియన్లు ఇంట్లో ఆకలితో అలమటిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్నీషియన్లలో 60 శాతం కన్నా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. జూన్ 1 నుంచి అన్ని సినిమా షూటింగులు, సినిమాల ప్రదర్శనలను నిలిపివేయాలని ఫిల్మ్ సంస్థలు నిర్ణయించాయి. వినోద పన్నులో సడలింపు, నటుల పారితోషకంలో కోత విధించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో, చిత్ర సంస్థల ప్రతినిధులు తమ ఆందోళనలు, డిమాండ్లను తెలియజేసేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలవాలని యోచిస్తున్నారు.