Manoj Vs Manchu Family : పండగ పూట మరోసారి ‘మంచు’ వివాదం.. తిరుపతిలో మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ..
పండగ పూట తిరుపతిలో మంచు ఫ్యామిలీ వివాదంతో హైడ్రామా నెలకొంది.

Manchu Manoj Vs Manchu Family in Tirupati at Mohan Babu Vidyanikethan School
Manoj Vs Manchu Family : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ కుటుంబ కలహాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంచు మనోజ్ అతనిపై, తన భార్యపై మోహన్ బాబు(Mohanbabu) దాడి చేయించారని ఆరోపిస్తూ పోలీస్ కేస్ పెట్టిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు కూడా మనోజ్ పై కేసు పెట్టారు. హైదరాబాద్ లో మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అంటూ కొన్ని రోజుల క్రితం హైడ్రామానే నడిచింది. అయితే గత కొన్ని రోజులుగా అందరూ సైలెంట్ అవ్వగా మళ్ళీ నేడు మంచు వివాదం రేగింది.
తిరుపతిలో మోహన్ బాబు విద్యానికేతన్ స్కూల్ లో ప్రతి సంవత్సరం మంచు ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకుంటున్నారు. అయితే మంచు మనోజ్ నేడు స్కూల్ వద్దకు వస్తున్నాడని తెలిసి పోలీసులను సెక్యూరిటీ పెట్టారు. మనోజ్ స్కూల్ దగ్గరకు రావడంతో పోలీసులు మనోజ్ ని అడ్డుకొని లోపలికి అనుమతి లేదన్నారు. దీంతో మనోజ్ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. పర్మిషన్ లేదని, వెళ్లిపోవాలని పోలీసులు మనోజ్ ని కోరారు.
అయితే మనోజ్ తన తాత సమాధికి నివాళి అర్పించి వెళ్ళిపోతాను అని చెప్పారు. అయినా పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో తిరుపతి విద్యానికేతన్ స్కూల్ వద్ద హైటెన్షన్ నెలకొంది. స్కూల్ సిబ్బంది కూడా మనోజ్ ని లోపలికి అనుమతించలేదు. దీంతో చాలా సేపు స్కూల్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన తాత సమాధి ఇక్కడే ఉందని, తన తాతకి నివాళులు అర్పించి వస్తాను అని చెప్పినా ఒప్పుకోలేదు. మంచు మనోజ్ వెంబడి వచ్చిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా మనోజ్ పోలీసులతో మరింత గొడవకు దిగాడు. మనోజ్ వెంబడి వచ్చిన బౌన్సర్లు, స్కూల్ వద్ద మోహన్ బాబు ఫ్యామిలీ ఏర్పాటు చేసిన బౌన్సర్ల మధ్య కూడా గొడవ జరిగింది.
పండగ పూట తిరుపతిలో మంచు ఫ్యామిలీ వివాదంతో హైడ్రామా నెలకొంది. ఈ ఘటనతో మరోసారి మంచు ఫ్యామిలీ వర్సెస్ మనోజ్ అని అందరికి అర్ధమవుతుంది. ఈ గొడవలకు పలు కారణాలు వినిపిస్తున్నా అసలు కారణం ఏంటో ఆ ఫ్యామిలీకి తెలియాలి. ఇక మనోజ్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలు నిన్న తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.