Manchu Vishnu Announced good News for Children of Telugu Armed Forces People on Republic Day
Manchu Vishnu : హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మంచు విష్ణు ఓ ప్రకటన చేసారు. తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ఆ యూనివర్సిటీకి ప్రో ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మంచు విష్ణు ప్రకటించాడు.
త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు వారి పిల్లలకు మోహన్ బాబు యూనివర్సిటీలో 50 శాతం స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా మంచు విష్ణు ప్రకటించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే కాకుండా దేశంలో తెలుగువారు ఎక్కడున్నా త్రివిధ దళాలలో పనిచేసే ఫ్యామిలిలో పిల్లలకు కూడా ఈ స్కాలర్ షిప్ వర్తిస్తుంది.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మన దేశం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచికంగా, వారికి కృతజ్ఞతలు తెలపాలని ఈ కార్యక్రమం చేపట్టాను. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే వారి కోసం అండగా నిలవాలని అనుకున్నాను. అందుకే మా యూనివర్సిటీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. వేరే యూనివర్సిటీలు కూడా ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను అని తెలిపారు. దీంతో ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టినందుకు విష్ణుని అభినందిస్తున్నారు.
ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వాళ్లందరికీ కావాల్సినవి అందిస్తున్నారు. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా త్రివిధ దళాల్లో పనిచేసే తెలుగు వారి పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్‌ను ప్రకటించారు. ఇక విష్ణు కన్నప్ప సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. భారీ బడ్జెట్ తో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మధుబాల, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే వారి పాత్రల పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసారు. మరో వైపు పాన్ ఇండియా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా భారీగా రిలీజ్ కానుంది.