ప్రముఖ నటుడి తండ్రి మరణం.. చివరిచూపు కోసం..

ప్రముఖ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్‌కుమార్ చక్రవర్తి (95) మంగళవారం సాయంత్రం ముంబైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో బెంగుళూరులో చిక్కుకున్న మిథున్ చక్రవర్తి ముంబై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఓ షూటింగ్ నిమిత్తం మిథున్ బెంగుళూరు వెళ్లారు. అనూహ్యంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయన అక్కడే ఉండిపోయారు. తాజాగా తండ్రి మరణించడంతో ఎట్టి పరిస్థితిలో ముంబై చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ తమ తండ్రి మరణించారని బసంత్‌కుమార్ రెండో కుమారుడు, మిథున్ సోదరుడు నామాషి చక్రవర్తి తెలిపారు. బెంగాళీ నటి రీతూపర్ణ సేన్‌గుప్తా Twitter వేదికగా.. మిథున్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అనారోగ్యంతో చనిపోగా లాక్‌డౌన్ వల్ల చివరి చూపు కూడా చూసుకోలేక పోయాడు సల్మాన్.