అన్నయ్యకు నేషనల్ అవార్డు రాలేదు.. అదే అసంతృప్తి: నాగబాబు

“నా ఛానెల్ నా ఇష్టం” పేరుతో యూట్యూబ్‌లో ఎన్నికల టైమ్ నుంచి వీడియోలు పెడుతున్న మెగా బ్రదర్ నాగబాబు లేటెస్ట్‌గా తన అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడారు. అన్నయ్య చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసినప్పటికీ, చిరంజీవికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కలేదనే అసంతృప్తి ఇప్పటికీ తనకు ఉందని నాగబాబు అన్నారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్న నాగబాబు.. ‘‘అన్నయ్యగారి పుట్టినరోజు సందర్భంగా చాలా రోజుల తర్వాత మళ్లీ మాట్లాడుతున్నా. చిన్నప్పటి నుంచి మా అందరి బర్త్‌డేల కన్నా అన్నయ్య బర్త్‌డే చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే అన్నయ్య పుట్టినరోజును అమ్మ బాగా చేసేది. నాకైతే ఇంట్లో వాళ్ల ఎవరి పుట్టినరోజులు గుర్తుండవు. అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత బర్త్‌డే రోజును మెగాఫ్యాన్స్ డేగా పరిగణిస్తున్నాం.
మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. సమాజంలో వివిధ రంగాల్లో ప్రాచుర్యం పొందిన వారిని సన్మానిస్తున్నాం. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఫారెన్ వెళ్లడంతో అన్నయ్య పుట్టినరోజు వేడుకకు నేను వెళ్లలేకపోయా. మా ఇంట్లో నాన్నగారి తర్వాత అంత గౌరవం ఇచ్చేది అన్నయ్యకే. ఆయన, మా వదిన కూడా మమ్మల్ని చాలా కేరింగ్‌గా చూసుకుంటారు. అన్నయ్య వల్లే మేమంతా కలిసి ఉంటున్నాం. బాధ్యతలు ఎలా తీసుకోవాలో నేర్పారు. అవసరమైనప్పుడు అడగకపోతే తిడతాడు తప్ప.. అస్సలు విసుక్కోడు. సంతోషంతో ఆ పని చేస్తాడు.’’
అన్నయ్య వేసిన బాటలోనే మేమంతా కొనసాగుతున్నాం. మెగా కుటుంబం నుంచి వచ్చే వాళ్లందరూ ఎంతో కష్టపడతారు. తమ వెనుక మెగా పవర్ ఉందని అస్సలు అనుకోరు. వరుణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు ‘చిరంజీవిగారి నుంచి వారసత్వంగా వచ్చేది ఒక్కటే ఉంది. అది తీసుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు’ అని చెప్పా. ‘ఏంటీ నాన్న అది’ అని వరుణ్ అడిగితే, ‘హార్డ్‌వర్క్, డెడికేషన్’ అని చెప్పా.
అయితే అన్నయ్య విషయంలో ఇప్పటికీ నాకు ఒక అసంతృప్తి ఉందని, అదేంటంటే.. అన్నయ్యలాంటి స్టార్‌కి ఒక్కసారి కూడా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రాలేదేనని, అందుకు ఎప్పుడూ బాధపడుతూ ఉంటా అని అన్నారు. ఎందుకంటే ఎన్నో మంచి సినిమాలు చేశారు. ‘రుద్రవీణ’కు రావాల్సింది. కానీ, ఇవ్వలేదు.
ఈసారి ‘సైరా: నరసింహారెడ్డి’తో ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నా. నేను సినిమా చూశా కూడా. అద్భుతంగా ఉంది. అభిమానులు ఏ అంచనాలతో ఉన్నారో.. వాటికి ఏమాత్రం తగ్గదు. వయసు పెరుగుతున్నా ఆయన కష్టపడేతత్వం, నిబద్ధత తగ్గలేదు. ముఖ్యంగా సినిమాలో ఫైట్స్ చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తోంది. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు.