Vikkatakavi : ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ సస్పెన్స్ థ్రిల్లర్..
'వికటకవి' సిరీస్ ఊహించని మలుపులతో సాగే ఓ పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్.

Naresh Agastya Megha Akash Vikkatakavi Web Series Review and Rating
Vikkatakavi Series Review : నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ వికటకవి. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. వికటకవి సిరీస్ జీ5 ఓటీటీలో నేడు నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, రవితేజ, గిరిధర్.. పలువురు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. ఈ కథ 1970లో జరుగుతుంది. నల్లమల అడవుల్లో ఉన్న అమరగిరి అనే సంస్థానంలో అడవిలో ఉన్న దేవతల గుట్ట దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు గతం మర్చిపోయి శరీరంలో స్పందన లేకుండా అయిపోతుంటారు. అది 25 ఏళ్ళ క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల అమ్మవారు ఇచ్చిన శాపం అని ఊరంతా అనుకుంటారు. దీంతో ఎవరూ దేవతల గుట్ట వైపు వెళ్ళడానికి ధైర్యం చేయరు.
హైదరాబాద్ లో చదువుకుంటూ డిటెక్టివ్ గా పని చేసే రామకృష్ణ(నరేష్ అగస్త్య) దీనికి పరిష్కారం తేగలడు అని ఆ ఊరి నుంచి వెళ్లిన ఓ ప్రొఫెసర్ అతన్ని అమరగిరికి పంపిస్తారు. ఆ సమస్య పరిష్కరిస్తే డబ్బులు వస్తే తన తల్లికి ఆపరేషన్ చేయించొచ్చు అని రామకృష్ణ వెళ్తాడు. మొదట అమరగిరి రాజు(శిజు మీనన్) ఏ సమస్య లేదని వెళ్లిపొమ్మన్నా అతని మనవరాలు లక్ష్మి(మేఘ ఆకాష్) చెప్పడంతో రామకృష్ణ అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు. అసలు అడవిలో ఏం జరుగుతుంది అని రామకృష్ణ అడవిలోకి వెళ్తే అదే రోజు కొంతమందికి మతి పోయినా అతనికి మాత్రం ఏం కాదు. అసలు దేవతల గుట్ట దగ్గర ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్లినవాళ్లందరికి ఎందుకు మతి పోతుంది? రామకృష్ణ ఈ సమస్య పరిష్కరించాడా? రామకృష్ణ తల్లికి ఆ ఊరికి సంబంధం ఏంటి? 25 ఏళ్ళ క్రితం దేవతల గుట్ట మీద ఏం జరిగింది? అక్కడికి వెళ్లిన అందరికి మతిపోతున్నా రామకృష్ణకు ఏం కాలేదు ఎందుకు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : Allu Arjun : పుష్ప 2 నుంచి ఒక సీక్రెట్ రివీల్ చేసిన అల్లు అర్జున్.. కేరళ ఈవెంట్ స్పీచ్ బన్నీ ఏమన్నాడంటే..
సిరీస్ విశ్లేషణ.. ఒక ప్లేస్ లో ఏదో జరుగుతుంటే అది ఎవ్వరికి తెలియకూడదని దేవుడు, దయ్యం అని కథలు చెప్పి అక్కడికి వచ్చే జనాలకు ఏదో అయ్యేలా చేసి ఆ తర్వాత హీరో వచ్చి దాన్ని కనుకోవడం అనేది గతంలో చాలా సినిమాలు, సిరీస్ లలో చూసాము. ఒకరకంగా ఈ వికటకవి కూడా అదే కథ. కానీ ఈ కథని పీరియాడిక్ లో చెప్పడం, అందరూ అనుకున్నట్టు కాకుండా ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్పి కథను ఆసక్తిగా మలవడం కొత్తగా ఉంటుంది. మూడో ఎపిసోడ్ ఎండింగ్ లో ఇచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అయితే సిరీస్ లో విలన్ ఎవరు అనేది మొదటి నుంచే ఊహించేయొచ్చు. కానీ అతనే విలన్ ఎందుకు అయ్యాడు అనేది మాత్రం చివరి వరకు తెలియకుండా ఆసక్తిగా కథనం రాసుకున్నారు. ప్రతి ఎపిసోడ్ కి మంచి ఎండింగ్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అని ఆసక్తి కలిగించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కథ ఎవరూ ఊహించలేరు.
సిరీస్ ఆసక్తిగా ఉన్నా చాలా చోట్ల స్లో నేరేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికతో లేదా ఫార్వార్డ్ చేసుకుంటూ చూడాల్సిందే. అయితే తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథ కావడంతో అందరికి డైలాగ్స్ తెలంగాణ స్లాంగ్ లోనే ఉన్నాయి. కానీ కొంతమందికి ఈ స్లాంగ్ సెట్ అవలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇటీవల వరుస సినిమాలతో మెప్పిస్తున్న నరేష్ అగస్త్య ఈ సిరీస్ లో డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో బాగా మెప్పించాడు. మేఘ ఆకాష్ పాత్ర ఎక్కువ సేపే ఉన్నా నటనకు అంత స్కోప్ లేదు. శిజు మీనన్ ముసలి రాజు పాత్రలో బాగా నటించారు. అమిత్ కూడా ముసలి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. రవితేజ పోలీస్ పాత్రలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. రఘు కుంచె, తారక్ పొన్నప్ప, గిరిధర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రలో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. ఈ సిరీస్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి. పీరియాడిక్ సిరీస్ కావడంతో అప్పటి కాలానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా అందంగా చూపించారు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం అప్పటి సెట్స్, ప్రాపర్టీ, విలేజ్ సెటప్.. ఇవన్నీ చాలా బాగా డిజైన్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి థ్రిల్ ని తెప్పించి సిరీస్ కి బాగా ప్లస్ అయింది. కథ మొదట్లో రెగ్యులర్ పాయింట్ అనిపించినా రెండు ఎపిసోడ్స్ తర్వాత కథని మలుపు తిప్పి ఆసక్తికర కథనంతో రచయిత తేజ దేశరాజ్ మెప్పిస్తాడు. కొన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి. గతంలో 47 డేస్, సర్వం శక్తిమయం సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఈ సారి పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. తనకి ఇచ్చిన కథకు నూరు శాతం న్యాయం చేసి వరుసగా డిఫరెంట్ కంటెంట్ తో మెప్పిస్తున్నాడు. ఇక నిర్మాణ పరంగా SRT ఎంటర్టైన్మెంట్స్ ఈ సిరీస్ కి బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘వికటకవి’ సిరీస్ ఊహించని మలుపులతో సాగే ఓ పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జానర్ నచ్చేవాళ్ళు జీ5 ఓటీటీలో సిరీస్ చూసేయొచ్చు. ఈ సిరీస్ కు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.